వాళ్ల తప్పేముంది..?

What is wrong with them?సుమిత్రకి సుమారు 43 ఏండ్లు ఉంటాయి. ఆమెకు 18 ఏండ్లు వయసులో ఆర్మీలో పని చేసే భరత్‌తో పెండ్లి జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. భరత్‌ ఈ మధ్య కాలంలోనే ఉద్యోగ విరమణ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆరు నెలల తేడాతో ఇద్దరు కొడుకులకు పెండ్లి చేశారు. ఇద్దరూ తమ జీవితాలను హాయిగా గడుపుతున్నారు. పెద్ద కొడుకు వంశీకి తల్లంటే చాలా ఇష్టం. ప్రతి రోజూ తల్లే వంట చేసి పెట్టాలి. బయటకు వెళ్లేటప్పుడు ఆమెకు చెప్పకుండా వెళ్లడు. ప్రతి చిన్న విషయం తల్లితో పంచుకోవడం అలవాటైపోయింది. ఆర్మీ నుండి వచ్చిన తర్వాత భరత్‌ వేరే ఉద్యోగం చేయాలనుకున్నాడు. దాని కోసం వెదుకులాట మొదలుపెట్టాడు.
అయితే వీళ్ల ఇంట్లో రెండు బెడ్‌ రూంలు మాత్రమే ఉంటాయి. పిల్లల పెండ్లి కాక ముందు తల్లిదండ్రులు ఒక రూమ్‌లో, పిల్లలు మరో రూమ్‌లో పడుకునే వారు. ప్రస్తుతం ఇద్దరికీ పెండ్లి జరిగింది కాబట్టి సుమిత్ర, భరత్‌ హాల్లో పడుకుంటున్నారు. అయితే ఒక రోజు తల్లిదండ్రులు ఇద్దరూ దగ్గరగా ఉండడం వంశీ చూశాడు. అది భరించలేకపోయాడు. ‘ఈ వయసులో మీకు ఇది అవసరమా’ అనే భావనతో తల్లితో మాట్లాడడం మానేశాడు.
ఆమె చేసిన వంట తినడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు కూడా చెప్పేవాడు కాదు. ప్రతి రోజూ సాయంత్రం రాత్రి అందరూ కలిసి భోజనం చేసే వారు. కానీ ఆ రోజు నుండి వంశీ అందరితో కలిసి తినకుండా తన రూంలోనే కూర్చొని తినడం మొదలుపెట్టాడు. తల్లిని పూర్తిగా దూరం పెట్టేశాడు. ఆమెను చూస్తేనే ఏదో ఒకటి అనేవాడు, అవమానించేవాడు. ఆమె కూడా ఓ పదిహేను రోజుల వరకు కొడుకు ముందుకు వెళ్లలేకపోయింది. ఇంట్లో ఇలాంటి పరిస్థితి చూసి కోడలు ‘ఏం జరిగింది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు’ అని వంశీని అడిగింది. దాంతో ఆమెపై కూడా కోప్పడడం మొదలుపెట్టాడు.
కొడుకులో వచ్చిన మార్పు చూసి సుమిత్రకు చాలా బాధ అనిపించింది. నిజంగా తను చేయకూడని తప్పు ఏదో చేసినట్టు భావించింది. అదే బెంగతో ఆరోగ్యం పాడు చేసుకొని ఆస్పత్రిలో చేరింది. అయినా వంశీ తల్లిని అస్సలు పట్టించుకోలేదు. వంశీ ఇలాగే ఉంటే భవిష్యత్‌ ఎలా ఉంటుందో అని ఆలోచించి సుమిత్ర తన కోడలిని తీసుకొని ఐద్వా అదాలత్‌కు వచ్చింది.
మేము వంశీకి ఫోన్‌ చేసి పిలిచించాము. మొదట అతను ‘నేను రాను, మా ఇంట్లో ఎలాంటి సమస్యా లేదు. ఇక నేను ఎందుకు రావాలి’ అన్నాడు. కానీ మేము ‘మీరు ఇక్కడికి వస్తే కదా అసలు సమస్య వుందో లేదో, మీ వల్ల ఎంత మంది బాధపడుతున్నారో తెలిసేది’ అన్నాము. చివరకు అతను రావడానికి ఒప్పుకున్నాడు. సుమిత్రతో పాటు, అతని భార్య చెప్పిన విషయాల గురించి అడిగితే ‘అవును మేడం కొడుకులకు పెండ్లి చేసిన తర్వాత కూడా ఈ వయసులో వాళ్లిద్దరూ అంత క్లోజ్‌గా ఉండడం ఏమిటి? ఇప్పుడే కొత్తగా పెండ్లయిన వాళ్లలా ప్రవర్తిస్తుంటే దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి. అది వయసులో ఉన్న వారు చేసే పని. ఇప్పుడు నాకూ ఓ పాప ఉంది. అంటే మా అమ్మకు మనవరాలు ఉంది. అమ్మమ్మ అయిన తర్వాత కూడా ఇలా ప్రవర్తించడం ఏంటీ. అయినా నేను మా అమ్మను ఏమీ అనలేదు. నాకు నచ్చలేదు కాబట్టి తనతో మాట్లాడడం మానేశాను. ఇందులో నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. దీని కోసం అత్తాకోడళ్లు ఇద్దరూ ఇక్కడి వరకు వచ్చారు’ అన్నాడు.
‘మీ వయసు సుమారు 24 వుంటుంది. మీ పాప వయసు ఆరు నెలలు. మీ అమ్మ వయసు ఎంత ఉంటుంది, మహా అయితే 43 ఏండ్లు అంతేగా. అయినా వయసు ఎంతైతే ఏంటి. ఆమె తన భర్తతో దగ్గరగా ఉంటే ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఈ వయసు వారే క్లోజ్‌గా ఉండాలి, ఈ వయసు వారు దూరంగా ఉండాలి అని రూల్స్‌ ఏమీ లేవు కదా! అసలు వాళ్లు చేసింది తప్పు అనే భావన మీకు ఎందుకు వచ్చింది. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అది వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని బట్టి ఉంటుంది. ఇందులో తప్పేంటి. మీరు మీ అమ్మను అసహ్యించుకోవడం, ఆమేదో తప్పు చేసినట్టు అవమానించడం సరైనదేనా ఒక్కసారి ఆలోచించండి. మీకు రూం ఇచ్చి వాళ్లు బయట పడుకుంటున్నారు. ఇదేనా వాళ్లు చేసిన తప్పు. మీ నాన్న ఆర్మీలో ఉద్యోగం చేయడం వల్ల వాళ్లిద్దరూ చాలా ఏండ్లు దూరంగా గడిపారు. మీ నాన్న కూడా మీతోగానీ, మీ అమ్మతో గానీ గడిపిన సమయం చాలా తక్కువ. ఇప్పుడే అందరూ ఓ దగ్గర ఉంటున్నారు. బాధ్యతతో మీ ఇద్దరికీ పెండ్లి చేశారు. మీరు సంతోషంగా ఉంటున్నారు. మరి మీ అమ్మానాన్న సంతోషంగా ఉండకూడదంటున్నారు. ఇది సరైన పద్ధతేనే మీరే ఆలోచించండి. అసలు నిజానికి మీరే అర్థం చేసుకొని మీ అమ్మానాన్న కోసం ప్రత్యేకంగా ఒక గది ఉండేలా చూడాలి. అప్పుడు ఇలాంటి సమస్యే వచ్చేది కాదు.
మొన్నటి వరకు మీ అమ్మతో మీరు ఎంతో ప్రేమగా ఉండేవారు. ప్రతి విషయం ఆమెతో పంచుకునేవారు. ఒక్కసారిగా ఇప్పుడు అమ్మ మీకు తప్పు చేసిన వ్యక్తిగా మారిపోయింది. చివరకు ఆమె మీపై దిగులుతో ఆస్పత్రిలో చేరినా పట్టించుకోలేదు. ఇన్ని రోజులు మీ నాన్న లేకపోయినా మీ అవసరాలన్నీ చూసుకుంది. మీరే జీవితంగా బతికింది. ఆమెకూ కొన్ని కోరికలు ఉంటాయి. తన భర్తతో సంతోషంగా ఉండాలని ఉంటుంది. దీన్ని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ ప్రవర్తన వల్ల ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత లేకుండా పోయింది. ఒక్క సారి మనసుతో ఆలోచించండి’ అని అతనికి అర్థమయ్యేలా చెప్పాము.
దాంతో వంశీ ‘నిజమే మేడం, మీలా నేను ఆలోచించలేకపోయాను. అమ్మను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఈ వయసులో ఇలాంటి ఆలోచనలు ఏంటీ అనుకున్నాను. నేను చేసింది తప్పే. అమ్మా నన్ను క్షమిం చమ్మా.. నిన్ను ఇన్ని రోజులు బాధపెట్టాను. ఇకపై ఎప్పుడూ ఇలా తప్పుగా ఆలోచించను’ అని చెప్పి తల్లిని తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత కొడుకులిద్దరూ హాల్లోనే తన తల్లిదండ్రుల కోసం ఒక చిన్న గది ఏర్పాటు చేశారు.
– వై వరలక్ష్మి,
9948794051