‘సూర్య గ్రహణం వేళ నేను పుట్టడంతో అంతా నన్ను కోతి అని, పిచ్చిదని రకరకాల పేర్లతో పిలిచేవారు. అనాథ శరణాలయంలో నన్ను వదలాల్సిందిగా నా తల్లిదండ్రులపై చాలామంది ఒత్తిడి తెచ్చారు. కానీ, ఇవ్వాళ నేను దేశం గర్వపడేలా భారతావనికి పతకం సాధించాను.’ పారీస్ పారాలింపిక్స్‌లో 400 మీ.ల పరుగులో కాంస్యంతో మెరిసిన మన వరంగల్ అథ్లెట్ జీవాంజి దీప్తి ఆవేదన ఇది. ఆమెదే కాదు ఒక్కొక్కరిది ఒక్కోగాథ. అడుగడుగునా ఎన్నో అనుమానాలు, అవమానాలు, మరెన్నో ప్రశ్నలు.. ఆ ప్రశ్నలన్నిటికి నేడు చేతలతోనే సమా ధానాలు చెప్పారు. ‘పారీస్ పారాలింపిక్స్‌లో 25 పతకాలు సాధిస్తాం’.. ఇది క్రీడల ఆరంభానికి ముందు మన పారా అథ్లెట్ల బృందం ధీమా! దానిని కూడా హేళన చేసిన వారి నోళ్లు మరల తెరవకుండా 12 క్రీడాంశాల్లో తలపడిన 84 మంది భారతీయ పారాఅథ్లెట్లు అంచనాలకు మించి అద్వితీయ ప్రదర్శనతో ఏడు స్వర్ణాలు సహా మొత్తం 29 పతకాలు ఒడిసిపట్టారు.
వారి వైకల్యాన్ని మనస్సు కంటన్విక ఒంటికే పరిమితం చేసి చక్రాల కుర్చీలతో.. కృత్రిమ కాళ్లతో.. పని చేయని చేతులతో.. పారాలింపిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఆ అనుమానాలను పటాపంచలు చేశారు. ఆత్మవిశ్వాసం అండగా.. పోరాటమే శ్వాసగా.. ఆట మీదే ధ్యాసతో..అద్భుత ప్రదర్శనతో దేశానికి పతక వెలుగులు పంచారు. ‘అవిటితనం కన్న ఆత్మవిశ్వాసం మిన్నా / అదికాస్త లేకున్నా అంగము లున్నా సున్నా’ అన్న కవి శేషగిరి వాక్కులను నిజం చేస్తూ మన పారా అథ్లెట్లు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో విశ్వక్రీడా యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి.. అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. తామేమీ సాధించలేమనే నిరాశలో కుంగిపోతూ చాలా మంది తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తారు. కానీ, వీళ్లది కష్టాల కడలిలాంటి జీవితం.. ఆ జీవన ప్రయాణంలో అడుగడుగునా అడ్డంకులే అయినా, వెన్నుచూపలేదు. భయపడి చీకటిలోనే ఉండిపోలేదు. అన్నింటిని అధిగమించి ఆటల్లో సత్తాచాటి దేశ ఖ్యాతిని చాటారు. టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు సాధిస్తే.. పారిస్‌లో 29 పతకాలతో మరో చరిత్రకు నాంది పలికారు.
వెన్నునొప్పితో అల్లాడుతున్నా వెనకడుగు వేయని సుమిత్ అంటిల్ జావెలిన్ త్రోలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఏడాదిగా అనారోగ్యం కుంగదీస్తున్నా అవని లేఖరా తుపాకీ గురి తప్పలేదు. క్లబ్‌త్రో, హైజంప్, బ్యాడ్మింటన్, ఆర్చరీల్లోనూ మన క్రీడాకారులు స్వర్ణాలు కొల్లగొట్టారు. ఆత్మవిశ్వాసంతో ప్రతికూలతలను అధిగమించి విజేతలుగా నిలిచిన పారా అథ్లెట్లకు యావద్దేశం జేజేలు పలుకుతోంది! పుట్టుకతోనే చేతుల్లేని జమ్మూకశ్మీర్‌కు చెందిన పదిహేడేండ్ల శీతల్ దేవి కాలితో విల్లు పట్టుకుని, భుజంతో నారి లాగి శరం సంధించి రాకేశ్ కుమార్‌తో కలిసి కాంస్యం సాధించింది. కరెంట్ షాక్‌తో తొమ్మిదేండ్లకే చూపు కోల్పోయిన కపిల్ పర్మార్ అంధుల జూడోలో మూడోస్థానంలో నిలిచి, ఈ విభాగంలో దేశానికి తొలి మెడల్ అందించాడు. అవమానాల కొలిమిలో రాటుదేలిన ప్రీతి పాల్ పరుగుల పోటీలో రెండు కాంస్య పతకాలను దేశానికి అందించింది. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన అథ్లెట్ జీవాంజి దీప్తి సైతం కాంస్యంతో మెరిసింది. పారాఅథ్లెట్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటిగాథ… కానీ, వారెవరూ విధికి తలవంచలేదు. జీవితంలో గెలిచేందుకు కావాల్సినవి లక్ష్యంపై గురి, సాధన, మొక్కవోని స్థెర్యం అని తమ చేతలతో చాటిచెప్పారు. చిన్నతనంలోనే పోలియో కోరల్లో చిక్కినా, ఎదిగిన వయసులో తీవ్ర ప్రమాదాలకు గురై వైకల్యం పాలైనా చెక్కుచెదరని ఆత్మస్థైర్యంతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన విజేతల అపూర్వగాథలన్నీ భావితరాలకు అద్వితీయ పాఠాలు.
‘వికలాంగుల కోసం అమలు చేస్తున్న పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. తనిఖీ చేస్తే భయంకర వాస్తవాలు నిగ్గుతేలతాయి’ అని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించి ఏండ్లు గడుస్తున్నా… పరిస్థితి అంతే సంక్లిష్టంగా కొనసాగుతూనే ఉంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో వారికి ప్రోత్సాహం అంతంతమాత్రమే, స్వయంఉపాధికి ప్రభుత్వ పథకాలు సైతం వారికి అక్కరకురావడం లేదన్నది వాస్తవం. రాజ్యాంగం వికలాంగులకు అనేక హక్కులు కల్పించింది. కానీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడంలేదు. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ తదితర దేశాలు సరికొత్త విధానాలతో వారికి ఆలంభనగా నిలుస్తుంటే.. మాట్లాడితే ఆయా దేశాలతో పొల్చుకుంటూ దేశ, రాష్ట్రాల రూపురేఖలే మార్చేస్తాం అని చెప్పుకునే మన నేతలకు.. దుర్భర స్థితిలో ఉన్న వికలాంగుల హక్కులు హరించబడ్డ విషయాలు కనబడవు. విద్య, ఉపాధుల్లో వారికి అవరోధంగా ఉన్న వ్యవస్థలకు చరమగీతం పాడాలి. పారాలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక క్రీడల్లో పోటీపడటానికి అవరోధాలుగా ఉన్న మౌలిక సదుపాయాలు, నిధులు కొరతను అధిగమించే ఏర్పాట్లు చేసి తమ కమిట్‌మెంట్‌ను చూపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా అంతర్జాతీయ యవనికపై భారతీయ క్రీడా స్ఫూర్తిని చాటే దిశగా అడుగులేస్తాయని ఆశిద్దాం.