ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి.. పసిడి పట్టారు

 Breaking the world record.. They got sick– రోయింగ్‌, షూటింగ్‌లో రెండేసి కాంస్యాలు
– హాంగ్జౌ ఆసియా క్రీడలు 2023
– షూటింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
– మహిళల క్రికెట్‌ జట్టూ బంగారం
ఆసియా క్రీడల్లో టీమ్‌ ఇండియా దుమ్మురేపుతోంది. తొలి రోజు ఐదు పతకాలు సాధించిన భారత్‌.. రెండో రోజు సిక్సర్‌ కొట్టింది. షూటింగ్‌లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి మరీ మెన్స్‌ జట్టు పసిడి పతకం పట్టగా.. అమ్మాయిలు క్రికెట్‌లో చారిత్రక బంగారు పతకం అందించారు. షూటింగ్‌, రోయింగ్‌లో మరో నాలుగు కాంస్య పతాలు సొంతమయ్యాయి. రెండు పసిడి, మూడు రజత, ఆరు కాంస్య పతకాలు సహా 11 మెడల్స్‌తో భారత్‌ పతకాల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది.
నవతెలంగాణ-హాంగ్జౌ
ఆసియా క్రీడల్లో భారత షూటర్లు, రోయర్ల జోరు రెండో రోజూ కొనసాగింది. ఈసారి షూటర్లు మూడు పతకాలు అందించగా, రోయర్లు రెండు మెడల్స్‌తో సత్తా చాటారు. యువ షూటర్ల త్రయం ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌, దివ్యాన్షు సింగ్‌ పవార్‌, రుద్రాంక్ష్‌ పాటిల్‌లు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి మరీ పసిడి పతకం అందుకున్నారు. మెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో పసిడి ఫేవరేట్‌ చైనా షూటర్లను మనోళ్లు చిత్తు చేశారు. 1893.7 స్కోరుతో ప్రపంచ రికార్డు, పసిడి పతకం సొంతం చేసుకున్నారు. ఇక మహిళల క్రికెట్‌ జట్టు ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆసియా క్రీడల్లో పోటీపడిన టీమ్‌ ఇండియా అమ్మాయిలు బంగారు పతకం పట్టుకొచ్చారు. పసిడి పోరులో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో గెలుపొందిన హర్మన్‌ప్రీత్‌ సేన.. క్రికెట్‌లో భారత్‌కు తొట్టతొలి బంగారు పతకం అందించింది. మెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ కాంస్య సాధించగా..మెన్స్‌ 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో విజరువీర్‌ సింగ్‌, అనీశ్‌, ఆదర్శ్‌ సింగ్‌ త్రయం సైతం కాంస్య పతకం దక్కించుకుంది. రోయింగ్‌లో కాక్స్‌లెస్‌ ఫోర్‌, మెన్స్‌ క్వాడ్రఫుల్‌ స్కల్స్‌లో భారత్‌కు కాంస్య పతకాలు దక్కాయి. రోయింగ్‌లో పతక పోటీలు సోమవారంతో ముగియగా భారత్‌ రెండు రజతాలు, మూడు కాంస్యాలతో ఘనంగా ముగించింది.
ప్రపంచ రికార్డుతో పసిడి
మెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ జట్టు విభాగంలో భారత షూటర్లు అదరగొట్టారు. పసిడి ఫేవరేట్‌ చైనా త్రయాన్ని చిత్తు చేసి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఇటీవల బాకులో జరిగిన షూటింగ్‌ ప్రపంచ కప్‌లో చైనా షూటర్లు 1893.3 స్కోరుతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. దీంతో హాంగ్జౌలోనూ ఆ త్రయమే ఫేవరేట్‌గా నిలిచింది. కానీ తొలి సిరీస్‌ నుంచీ ఆధిక్యం నిలుకుంటూ వచ్చిన మనోళ్లు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి పసిడి పతకం పట్టారు. దివ్యాన్షు సింగ్‌ పవార్‌, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌, రుద్రాంక్ష్‌ బాలాసాహేబ్‌ పటేల్‌లు సమిష్టిగా మెరిశారు. రుద్రాంక్ష్‌ వరుసగా ఐదు సిరీస్‌ల్లో 104.8, 106.1, 103.8, 105.5, 106.7 స్కోరు చేయగా.. దివ్యాన్షు 104.8, 104.3, 104.6, 105.5, 106.3, ప్రతాప్‌ సింగ్‌ 104.1, 105.1, 105.3, 104.7, 105.7 స్కోరు సాధించారు. ఐదు సిరీస్‌ల అనంతరం భారత షూటర్లు 1893.7 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచారు. బాకులో చైనా నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాశారు. 1890.1తో దక్షిణ కొరియా రజతం, 1888.2తో చైనా కాంస్య పతకం దక్కించుకున్నాయి.
మెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ పతక రేసులో సత్తా చాటాడు. సహచర షూటర్లు నిరాశపరిచినా.. వ్యక్తిగత విభాగంలో పతకం దక్కించుకున్నాడు. 228.8 పాయింట్లు సాధించిన ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. చైనా షూటర్‌ 253.3 పాయింట్లతో పసిడి, 251.3 పాయింట్లతో దక్షిణ కొరియా షూటర్‌ రజత పతకం సాధించారు. ఇక 25 మీటర్ల మెన్స్‌ ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో భారత్‌కు మరో కాంస్యం లభించింది. విజరువీర్‌ సిద్దూ, అనీశ్‌, ఆదర్శ్‌ సింగ్‌ త్రయం 1718తో స్కోరు సాధించి కాంస్య పతకం నెగ్గారు.
రోయింగ్‌లో మరో రెండు
రోయింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు దక్కాయి. తొలి రోజు రోయర్లు మూడు పతకాలు అందించగా, రెండో రోజు పోటీల్లో మరో రెండు మెడల్స్‌ వచ్చాయి. పురుషుల కాక్స్‌లెస్‌ ఫోర్‌ విభాగంలో భారత రోయర్లు సత్తా చాటారు. జస్విందర్‌ సింగ్‌, భీమ్‌ సింగ్‌, పునీత్‌ కుమార్‌, ఆశీష్‌లు రేసును 6.10.81 సెకండ్లలో ముగించారు. మూడో స్థానంలో నిలిచి కాంస్య దక్కించుకున్నారు. 6.04.96 సెకండ్లతో ఉబ్బెకిస్తాన్‌ స్వర్ణం నెగ్గగా.. 6.10.4 సెకండ్లతో చైనా రజతం సాధించింది. మరో ఈవెంట్‌లోనూ మనకు కాంస్యమే దక్కింది. మెన్స్‌ క్వాడ్రఫుల్‌ స్కల్స్‌లో సత్నామ్‌ సింగ్‌, పర్మీందర్‌ సింగ్‌, జాకర్‌ ఖాన్‌, సుఖ్‌మీత్‌ సింగ్‌లు 6.08.61 సెకండ్లలో రేసు పూర్తి చేసి కాంస్య పతకం అందుకున్నారు. రోయింగ్‌లో భారత్‌ ఐదు పతకాలు సాధించగా.. భారత రోయింగ్‌ చీఫ్‌ కోచ్‌ హైదరాబాద్‌కు చెందిన ఇస్మాయిల్‌ బేగ్‌ కావటం విశేషం.