– కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టడం సిగ్గుచేటు
– ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల దోపీడీ
– అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ ప్రజలను తొమ్మిదేండ్లు మోసం చేసి, చేతగాని దద్దమ్మ మాదిరి అసెంబ్లీకి రాకుండా మొఖం చాటేసిన నీవు.. నేడు నల్లగొండలో సభ పెట్టడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ సీఎం కేసీఆర్‌నుద్దేశించి విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బీఆర్‌ఎస్ సాగునీటి విషయంలో మోసం చేసిందని, పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేయలేదన్నారు. రావాల్సిన నీళ్లు రాకుండా చేశారని, అందుకే వికారాబాద్ జిల్లాలో నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు మాట్లాడుతూ.. గ్రావిటీతో వెళ్ళే నీటిని ఉల్టా చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, మురళీధర్‌రావును అడ్డం పెట్టుకొని కోట్లు దండుకున్నారని ఆరోపించారు. డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని, కేసీఆర్‌కు ధైర్యముంటే చట్టసభకు వచ్చి మాట్లాడాలని అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పుల గుదిబండగా మార్చిన ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ మొఖం చాటేసి.. వారి పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి.. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారన్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను ఎడారి చేసిన కేసీఆర్.. ముందు ముక్కు నేలకు రాసి నల్లగొండ సభకు బయలుదేరాలన్నారు. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, ఏ.లక్ష్మణ్ కుమార్, సంజీవ రెడ్డి, రాందాస్ నాయక్ ఉన్నారు.