– అప్పులపై కాంగ్రెస్‌ది తప్పుడు ప్రచారం
– ఆ పార్టీది అడుగడుగునా నయవంచనే
– రైతులను పట్టించుకోని సర్కార్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
– నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానంపై నేతలతో సమీక్ష
– అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఓ బ్లాక్‌మెయిలర్ అంటూ ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అసలు రుణాలే తీసుకోవద్దంటూ ఉచిత సలహాలిచ్చిన ఆ పార్టీ… ఇప్పుడు తన ఏలుబడిలో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తోందంటూ ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నయవంచనే ఆ పార్టీ అసలు నైజమని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎఫ్‌ఆర్‌బీఎమ్ నిబంధనలకు లోబడి రూ.3.89 లక్షల కోట్ల అప్పులను చేస్తే… దాన్ని రూ.ఏడు లక్షల కోట్లంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక… అసలు అప్పులెందుకు చేస్తున్నారో ఆ పార్టీ నేతలు చెప్పాలంటూ ప్రశ్నించారు.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న ఉప ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి ఆయా జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. ధాన్యం కొనుగోళ్లు స్తంభించిపోవటంతో వారు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. కామారెడ్డిలో ఇటీవల కొందరు రైతులు రోడ్ల మీదికి వచ్చారని గుర్తు చేశారు. మార్కెట్ యార్డుల్లో హమాలీల కొరత కూడా ఉందని చెప్పారు. ఎన్నికలు ముగి సిన నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. ఎఫ్‌సీఐ ద్వారా తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వరికి బోనస్, రుణమాఫీ తదితర అంశాల్లో రైతులకు తమ పార్టీ మద్దతుగా ఉంటుందని తెలిపారు.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే… అన్ని సార్లూ తమ పార్టీయే గెలిచిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు కూడా పట్టభద్రులు తమకే ఓటేస్తారంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్నెల్ల కాంగ్రెస్ పాలన, హామీల అమల్లో దాని వైఫల్యాలను గమనించాం కాబట్టి… ఆ పార్టీని నమ్మొద్దని గ్రాడ్యుయేట్లకు సూచించారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ విషయాల్లో కాంగ్రెస్ తన మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. టెట్ దరఖాస్తుల ఫీజును ఐదు రెట్లు పెంచిన ఘనత రేవంత్ సర్కార్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కేవలం ఆర్నెల్లలోనే 30 వేల ఉద్యోగాలిచ్చామంటూ ప్రభుత్వం చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ సర్కార్‌కు ఆర్నెల్ల కాల పరిమితి పూర్తయింది… ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మరో ఆర్నెల్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఇది సాధ్యమేనా..? అని ప్రశ్నించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థి… ఓ బ్లాక్‌మెయిలర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను గెలిపిస్తే మరో నయీంను గెలిపించినట్టేనని విమర్శించారు. ఇప్పటికే ఒక బ్లాక్‌మెయిలర్ (రేవంత్)ను చూశాం, ఇప్పుడు టీవీ ఛానళ్లను అడ్డం పెట్టుకుని బెదిరించే మరో బ్లాక్‌మెయిలర్‌ను గెలిపిద్దామా..? అని వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్‌లో టీచర్లపై పోలీసులు లాఠీఛార్జి చేయటాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ఖండించారు.