నాడు పోరాడారు నేడు బ‌రిలో నిలిచారు..

They fought on, today they stood in the ring..– కేరళలో మహమ్మారులపై శైలజా టీచర్‌ నిర్విరామ సేవలు
– లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు సిద్ధం
– జె.జగదీష్‌, నవతెలంగాణ
కేరళను ఒక్కటిగా నిలబెట్టిన తన పరిపాలనా దక్షతతో నిపా, కరోనా వంటి మహమ్మారులను మట్టి కరిపించిన శైలజా టీచర్‌, వడకర లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కరోనా చీకటి కాలంలో కేరళ మనుగడకు మార్గనిర్దేశం చేసినందుకు దేశం హృదయంలో నిలిచిన పేర్లలో కెకె శైలజ ఒకటి. పరిచయం అవసరం లేని మహిళా నాయకురాలు ఆమె. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన తొలి పినరయి విజయన్‌ ప్రభుత్వంలో ఆరోగ్య, సామాజిక న్యాయం, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి కెకె శైలజ. మంత్రిగా ఉన్నప్పుడు నిపా, కొవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో సైన్స్‌ ఉపాధ్యాయురాలిగా నైపుణ్యంతో ముందుకు సాగడం ఆమెను దేశానికే ప్రియమైన వ్యక్తిగా నిలిపింది. 2020లో వోగ్‌ మ్యాగజైన్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా శైలజ గౌరవించబడింది. అదే ఏడాది రేడియో ఆసియాకు న్యూస్‌ యాంకర్‌గా మారారు. మెడికల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ మోల్డోవా నుండి విజిటింగ్‌ ప్రొఫెసర్‌ హౌదాతో సత్కారం పొందారు. దీనితో పాటు, ఐక్యరాజ్యసమితి సహా అనేక సంస్థల నుంచి ప్రతిష్టాత్మక గుర్తింపులు, అవార్డులను అందుకుంది. కోవిడ్‌ నివారణలో ఐక్యరాజ్యసమితి అవార్డ్‌, నిపా వైరస్‌ నివారణకు అంతర్జాతీయ గుర్తింపు, కొవిడ్‌ నివారణకు నీతి ఆయోగ్‌ ప్రశంసలు అందుకున్నారు. ఆమె నేతృత్వంలో ఆరోగ్య సూచీలో మొదటి స్థానం, వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డు కేరళ సాధించింది.
2021లో కేరళ అసెంబ్లీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీని ఆమెకు ప్రజలు అందించారు. మట్టనూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 60,963 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం మట్టనూరు ఎమ్మెల్యేగా, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలుగా, ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. విద్యార్థి, యువజన ఉద్యమాలతో ప్రజాక్షేత్రంలో క్రియాశీలకంగా మారారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా, మహిళా సంఘం కన్నూర్‌ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, అఖిల భారత సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. స్త్రీశబ్దం పత్రికకు సంపాదకురాలిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మట్టనూర్‌లోని పజాస్సీరాజా కళాశాల నుండి గ్రాడ్యుయేషన్‌, విశ్వేశ్వరయ్య కళాశాల నుండి బీఈడీ చేశారు. ఆమె శివపురం హైస్కూల్‌లో సైన్స్‌ టీచర్‌గా పనిచేసి, పూర్తికాలం రాజకీయాల్లో పని చేసేందుకు ఉద్యోగ విరమణ చేశారు.
1996లో తొలిసారిగా కూతుపరం నుంచి భారీ మెజారిటీతో శాసనసభలో విజయం సాధించారు. 2006లో పెరవూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2016లో యూడీఎఫ్‌ నుంచి కూతుపరం నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. ఆరోగ్యం – సామాజిక న్యాయం – మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.
ఆమె 1956 నవంబర్‌ 20న ఇరిట్టి మటంకి చెందిన కె కుందన్‌, కెకె శాంత దంపతులకు జన్మించారు. మట్టనూర్‌ పజాస్సీలో నివాసం ఉంటారు. ఆమె భర్త కె భాస్కరన్‌, మట్టనూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ మాజీ ఛైర్మెన్‌, సీపీఐ(ఎం) ఏరియా కమిటీ సభ్యుడు. ఇద్దరు పిల్లలు శోభిత్‌, లసిత్‌ ఉన్నారు.