ఇలా ఇచ్చి..అలా గుంజుకున్నరు

– ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు అందని పరిహారం
– ఏండ్లు గడుస్తున్నా ఎదురుచూపులే పెరుగుతున్న దాడులు
– పట్టించుకోని పాలకులుఅటకెక్కిన హైపవర్‌ కమిటీ
ఎస్సీ ఎస్టీ లైంగిక దాడి బాధితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం అలా చూపించి..ఇలా తిరిగి తీసుకుంది. వారికి చెందాల్సిన రూ.10 కోట్ల నిధులను దారి మళ్ళించింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో రూ.5 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 5 కోట్లను జమచేసి మొత్తం పది కోట్లకు బడ్జెట్‌ రిలిజ్‌ అర్డర్‌ ఇచ్చింది. అయితే ఆ డబ్బును కలెక్టర్‌ల ఖాతాలకు పంపిన గంట వ్యవధిలో తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి మళ్లించింది. దీంతో బాధితులకు అందాల్సిన పరిహారం ఆలస్యమవుతున్నది.అది ఎప్పుడొస్తదా అని ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. చెప్పులరిగేలాగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదిగో..అదిగో అంటూ అధికారులు బాధితులను మభ్యపెడుతున్నారు తప్పితే, వారికి పరిహారం అందించటంలేదు. తక్షణ సహయం, నష్టపరిహారం, పునరావాసం భిక్ష కాదు.. అది బాధితుల చట్టబద్ధమైన హక్కు అని మరిచి పోతున్నారు.
ఇది వేధింపుల లెక్క
సంవత్సరం ఎస్టీ ఎస్టీ మొత్తం
2014-15 204 83 287
2015-16 620 167 787
2016-17 794 213 1,007
2017-18 937 306 1243
2018-19 875 277 1152
2019-20 908 276 1184
2020-21 1768 921 2689
2021-22 – – –
2022-23 – – –
మొత్తం 6106 2243 8818
(2021,2022-23 సంవత్సరాల
కేసులు వెల్లడి కానందున ఇక్కడ పొందుపర్చలేదు.)

చట్టాలున్నా..
అమలులో నిర్లక్ష్యం
దళితులపై పెత్తందారుల దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు చట్టాలున్నా..వాటిని అమలు చేయటంలో నిర్లక్ష్యం కొనసాగుతున్నది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక
విచ్చల విడి దాడులు పెరుగుతున్నాయి. మనుధర్మాన్ని పాటించాల్సిందేనని చెబుతున్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా సనాతన ధర్మాలను ముందుకు తెస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నమయ్యే స్థితి ఉన్నది. రాజ్యాంగ రక్షణకు సంఘటితంగా ఉద్యమించాల్సిందే.
టి స్కైలాబ్‌ బాబు కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిదళితులంటే నిర్లక్ష్యమెక్కువ..
తరతరాలనుంచి దళితులంటే అంటరాని వారుగా సమాజం చూస్తున్నది. అగ్రకులాలు ఆధునిక సమాజంలోనూ..ఈ వైఖరి కలిగి ఉన్నారు. అందుకే పెత్తందార్లు ఎస్సీ, ఎస్టీలపై నిత్యం ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూనే ఉన్నారు. కుల అహంకార దాడులు చట్ట ప్రకారం నేరం. అయినా నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి. చట్టాలు, కోర్టులు ఏమీ చేయలేవన్న ధైర్యం పెత్తందార్లలో ఉన్నది. తమకు అనుకూలంగా ఆ చట్టాలను మలుచుకోవచ్చని భావిస్తున్నారు. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే..కొంతలో కొంతైనా ఈ నేరాలు తగ్గుతాయి. కానీ..అమలులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది.
శంకర్‌ జాతీయ కార్యదర్శి దళిత బహుజన ఫ్రంట్‌
బాధితులకు నష్టపరిహారంలో నిర్లక్ష్యం తగదు..
ఎస్సీ, ఎస్టీ బాధితులకు పరిహారాన్ని అందించటంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. కేసులు నమోదు చేసుడే తక్కువ. నమోదైన కేసులకు పరిహారం చట్టబద్ధంగా చెల్లించటానికి తాత్సారం ఎందుకు? హైదరాబాద్‌లో నమోదైన కేసులకు రెండు కోట్లు అవసరమైతే.. రూ.40 లక్షలు, సిరిసిల్లా జిల్లాకు రూ.40లక్షలు అవసరమైతే కేవలం రూ.9లక్షలు మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. చట్ట ప్రకారం సమయానుకూలంగా నష్టపరిహారం అందించాలి.
బత్తుల రాంప్రసాద్‌ ఎంఎస్‌ఎస్‌ అధ్యక్షులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం ఎఫ్‌ఐఅర్‌ నమోదైన ఏడు రోజుల్లో మొదటి దశ నష్టపరిహరం చెల్లించాలి. చార్జీషిటు వేసిన తర్వాత రెండో దశను పూర్తి చేయాలి. నిందితులకు శిక్ష పడిన తర్వాత చివరి దశ నష్టపరిహరం చెల్లించి పునరవాసం కల్పించాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 వేల మంది బాధితులకు నష్టపరిహారం అందాల్సి ఉంది. మొదటి, రెండో, మూడో దశల్లో చెల్లించాల్సిన నష్టపరిహారం బాధితులకు సక్రమంగా అందటం లేదు. వారికి పునరావాసం కల్పించాలని చట్టం చెబుతున్నా..ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవటం లేదు. చట్ట నిబంధనలను సర్కార్‌ ఖాతరు చేయటంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెరుగుతున్న దాడులు..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తొమ్మిదేండ్ల కాలంలో అవి 836 శాతం పెరిగాయి. రాష్ట్రం వచ్చిన కొత్తలో 287 అట్రాసిటీ కేసులు నమోదైతే.. 2020-21 నాటికి వాటి సంఖ్య 2,689కి పెరిగింది. తెలంగాణ అవిర్భావం తర్వాత ఒకే ఏడాదిలో అన్ని కేసులు నమోదు కావడంపై దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నమోదైన కేసులే ఇన్ని ఉంటే..ఇక స్టేషన్‌ వరకు రాని కేసులెన్నో..పెద్ద మనుషుల ఒప్పందాలతో పరిష్కారమైన కేసులు ఇంకెన్నో.. మరో పక్క కేసులు పెట్టడానికి బాధితులు స్టేషన్‌కు వెళ్లిన సమయంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల జాతీయ ఎస్సీ కమిషన్‌ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా బాధితులు ఆ కమిషన్‌ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసులమంటూనే బాధితుల పట్ల ఇలా వ్యవహరించటమేంటని సామాజిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఒక్క ఎస్సీలపైనే 6,106 దాడులు
రాష్ట్రంలో ఇప్పటి దాకా 8,818 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అందులో ఎస్సీలపైనే 6,106 దాడులున్నాయి. ఎస్టీలకు సంబంధించి 2,243 కేసులు నమోదయ్యాయి. 2014లో 204 మంది దళితులపై దాడులు జరగ్గా, 2020-21 నాటికి వాటి సంఖ్య 1,768కు పెరిగింది. వీటిలో మహిళపై లైంగిక వేధింపుల కేసులు కూడా ఉన్నాయి. ఇవి నమోదైన కేసులే. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా రాజీ చేసుకున్న కేసులు ఇంకా చాలానే ఉన్నాయి.
పరిహారమూ ఇవ్వలే..
మామూలుగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైతే.. రిలీఫ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ కింద బాధితులకు అందే పరిహారంలో మైనర్‌ అయితే 25 శాతం, మేజర్‌ అయితే 50 శాతాన్ని ముందే అందించాల్సి ఉంటుంది. అది కూడా వారంలోగా ఇవ్వాలి. మిగతా మొత్తం చార్జిషీట్‌ నమోదయ్యాక ఇవ్వాలి. కానీ ఒక్క కేసులోనూ సమయానికి పరిహారం అందలేదు. లైంగిక దాడి, హత్య వంటి కేసుల్లో అదనపు పరిహారం కింద కుటుంబానికి మూడునెలలకు సరిపోయే రేషన్‌ ఇవ్వాలి. మూడు నెలల్లోపు అర్హతను బట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు, గ్రామాల్లో అయితే మూడెకరాల భూమి ఇవ్వాలి. దీంతోపాటు ఇంట్లో పెద్ద మనిషి ఉంటే పింఛను కూడా ఇవ్వాలి. కానీ.. ఒక్క కేసులోనూ ఈ పరిహారం ఇవ్వకపోవటం గమనార్హం.
ఆలస్యంతో అవస్థలు..
సంబంధిత వ్యవస్థల నిర్లక్ష్యం మూలంగా కేసుల పరిష్కారంలో తీవ్ర ఆలస్యం జరుగుతున్నది. కేసుల నమోదును జిల్లాల్లో అయితే డీఎస్పీ, పట్టణాల్లో అయితే ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించాలి. నెలలోపు దర్యాప్తు పూర్తి చేసి… రెండు నెలల్లోగా కోర్టులో చార్జిషీీటు వేయాలి. తర్వాత 60 రోజుల్లోని కోర్టులో విచారణ జరగాలి. కానీ, ఇవేవీ సమయానికి జరగటం లేదని బాధితులు చెబుతున్నారు. 33 జిల్లాలకు 10 స్పెషల్‌ కోర్టులున్నాయి.
ఇందులో ఎస్సీ, ఎస్టీ కేసుల కంటే ఇతర కేసులే ఎక్కువగా విచారణకు వస్తున్నాయి. హత్య జరిగితే 6 నెలల్లోపే కేసును పూర్తి చేయాల్సి ఉన్నా ఆరేడేండ్లయినా కేసులు పూర్తి కావట్లేదు. 4,100 కేసుల విచారణలు ఇంకా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటాన్ని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హైపవర్‌ కమిటీ ఊసే లేదు
ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, దాడులకు సంబంధించి చట్టబద్ధంగా సీఎం అధ్యక్షతన హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఏడాదికి రెండు సార్లు సమావేశం కావాలి. దీనిలో అట్రాసిటీ చట్టం అమలు, బాధితులకు పరిహారం, దర్యాప్తు వంటి విషయాలపై చర్చించాలి. ఇంత ముఖ్యమైన ఈ కమిటీ ఏర్పాటు ఊసే లేదు. ఆ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానటరింగ్‌ కమిటీ ఏర్పాటు కాలేదు. నాలుగేండ్లుగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మెన్‌, పాలకమండలి సభ్యుల నియామకం జరగలేదు. జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీలు ఉన్నప్పటికీ మూడు నెలలకోసారి జరగాల్సిన సమీక్షా సమావేశాలు జరగటం లేదు.