పేదల గుడిసెలను కూల్చేసిండ్రు

– రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై మున్సిపల్‌ అధికారులు
– న్యాయం చేయకుంటే పోరాటాన్ని ఉదతం చేస్తాం
– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. మల్లేశం
నవతెలంగాణ-మెదక్‌
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కైన మున్సిపల్‌ అధికారులు పేదల గుడిసెలను కూల్చేస్తుండ్రని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. మల్లేశం పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ పట్టణంలోని హమాలీ కాలనీలో అధికారులు కూల్చివేసిన నిరుపేదల గుడిసెలను సందర్శించారు. అనంతరం మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయానికి తరలివెళ్లి కమిషనర్‌ను నిలదీశారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ 1992లో అసైన్మెంట్‌ కమిటీ ద్వారా హామాలీ కార్మికులకు, పేదలకు 5 ఎకరాల 30 గుంటల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించిందన్నారు. 114 మంది పేదలకు ప్లానింగ్‌ చేసి పట్టాలు పంపిణీ చేశారన్నారు. పట్టాలు ఇచ్చినవారికి పొజిషన్‌ చూపకుండా ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కాలయాపన చేశారన్నారు. పట్టాదారులు వ్యవసాయ కార్మిక సంఘం సహకారంతో పట్టాలు ఉన్నవారు గుడి సెలు వేసుకొని స్థానికంగా నివాసం ఉంటున్న పేదలపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కన్నే సినట్లు తెలిపారు. పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశా రు. పాలకులకు ఎన్నిక లపై ఉన్న దష్టి పేదలపై లేదన్నారు. మున్సిపల్‌ అధికా రులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూమిని అమ్మడానికి ప్రయత్నించి పేదల గుడిసెలపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ మున్సిపల్‌ అధికారులు 248/1 సర్వే నెంబర్లు నివాసం ఉంటున్న పేదలకు రక్షణ కల్పించి పట్టా లేనివారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు నాగమణి, జిల్లా నాయకులు గుడిసెల పోరాట కమిటీ కన్వీనర్‌ లచ్చా గౌడ్‌, గీత, అంజమ్మ, పాషా భారు, జ్యోతి, సిద్దమ్మ, రామమ్మ, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.