ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు

ఆద్యంతం నవ్వుతూనే ఉంటారుసుహాస్‌, సంగీర్తన హీరో, హీరోయిన్లుగా ‘జనక అయితే గనక’ చిత్రాన్ని సందీప్‌ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. శిరీష్‌ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దసరా సందర్భంగా ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ వేడుకకు డైరెక్టర్‌ బలగం వేణు, వశిష్టలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దిల్‌ రాజు మాట్లాడుతూ, ‘దసరా సందర్భంగా చాలా చిత్రాలు వస్తున్నాయి. వస్తున్న ఆరేడు చిత్రాల్లో ఇలాంటి మంచి చిత్రం వచ్చినప్పుడు.. మీడియానే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి చిన్న చిత్రాలు తీయాలనే ఆత్రుత, భయం రెండూ ఉంటాయి. చిన్న చిత్రాలతోనే ఎక్కువ టాలెంట్‌ బయటకు వస్తుంది. ఈ చిత్రం బాగా ఆడితేనే టెక్నీషియన్లు, ఆర్టిస్టులకు మంచి పేరు, ఆఫర్లు వస్తాయి. ఆద్యంతం నవ్వించేలా ఉందని అందరూ చెబుతున్నారు’ అని అన్నారు.
‘మా మూవీని చాలా చోట్ల ప్రదర్శించాం. మీడియా కూడా మా సినిమాను చూసింది. అందరూ మంచి ప్రశంసలు కురిపించారు. నాకు ఇంత మంచి టీం ఇచ్చిన దిల్‌ రాజుకి థ్యాంక్స్‌. సుహాస్‌ వల్లే ఈ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్లింది. మలయాళీ అయినా సంగీర్తన తెలుగులో డబ్బింగ్‌ చెప్పారు. ఈ మూవీలో చేసిన ఆర్టిస్టులందరికీ, టెక్నికల్‌ టీంకు థ్యాంక్స్‌’ అని సందీప్‌ రెడ్డి బండ్ల చెప్పారు. సుహాస్‌ మాట్లాడుతూ, ‘మా చిత్రానికి అన్ని చోట్లా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మీడియా కూడా మా చిత్రంపై ప్రశంసలు కురిపిస్తోంది. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌’ అని తెలిపారు. ‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. సినిమా చూసిన వారంతా కూడా ఎంతో సంతోషంగా థియేటర్‌ నుంచి బయటకు వస్తున్నారు. వారి ప్రేమను కురిపిస్తున్నారు’ అని సంగీర్తన అన్నారు.