నవతెలంగాణ – నసురుల్లాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా నేడు రూ.లక్ష మాఫీకి చర్యలు తీసుకోవడంపై బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసూరుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆదేశాల మేరకు నసురుల్లబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో ఉన్న రైతు వేదికల్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి.. మొదటి విడతగా రూ. లక్షలోపు రుణమాఫీకి శ్రీకారం చుట్టారని మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్కా శ్రీనివాస్ తెలిపారు. రైతులకు సీట్లు పంచుతూ ముఖ్యమంత్రి చేసిన రుణమాఫీపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, సొసైటీ చైర్మన్లు, మండల వ్యవసాయ అధికారులు సిబ్బంది, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.