– పీర్జాదిగూడ శ్రీకర ఆస్పత్రిలో దారుణం
– చికిత్సకు శరీరం సహకరించలేదన్న వైద్యులు
– పెద్ద దిక్కును కోల్పోయిన రెండు కుటుంబాలు
నవతెలంగాణ-బోడుప్పల్
చెయ్యి విరిగిందని ఆస్పత్రిలో జాయిన్ అయితే.. ఆ వ్యక్తి ప్రాణమే పోయింది. దీంతో అతనిపై ఆధారపడిన రెండు కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయాయి. ఈ ఘటన హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన మండల వెంకటేష్ గౌడ్(45) డిసెంబరు 30న కెపాల్ వద్ద ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢకొీట్టింది. దీంతో అతని కుడి భుజం విరిగింది. చికిత్స కోసం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని శ్రీకర ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. పరీక్షించిన వైద్యులు.. జనవరి 1న ఆపరేషన్ చేశారు. అనంతరం ఐసీయూలో పెట్టారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులను చూడనివ్వలేదు. రెండో తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో పరిస్థితి విషమించి వెంకటేష్‌గౌడ్ చనిపోయినట్టు కుటుంబీకులకు చెప్పారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం వల్లే వెంకటేష్ ప్రాణం పోయిందని కుటుంబీకులు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సర్జరీ సమయంలో ఇచ్చిన మత్తు మందు వికటించడంతోనే కోమాలోకి వెళ్లి మృతిచెందాడని ఆరోపించారు. ఒకటో తేదీ ఆపరేషన్ జరిగితే.. రెండో తేదీ రాత్రి అతని శరీరం వైద్యానికి సహకరించడం లేదని, బతికించే ప్రయత్నం చేస్తున్నామని తమతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
వెంకటేష్ గౌడ్ స్థానికంగా ప్రయివేటు స్కూల్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. అతని అన్న అనారోగ్యంతో మృతిచెందగా.. అన్న కుటుంబాన్ని, పిల్లలను వెంకటేష్ గౌడ్ పోషిస్తున్నాడు. ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వెంకటేష్‌గౌడ్ కూడా మృతిచెందడంతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మా ఇంటి పెద్ద దిక్కు ఇక లేడని కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీకర ఆస్పత్రిలో వెంకటేష్ మృతి ఘటనపై మేడ్చల్ జిల్లా వైద్యాధికారి రఘునాథ్‌ను మీడియా వివరణ అడగ్గా.. అతనికి ఆపరేషన్ సమయంలో పరిస్థితి విషమించిందని, ఐసీయూలో పెట్టి చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. ఆ సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం సహజమేనంటూ చెప్పుకొచ్చారు.