లోక్‌సభ ఎన్నికల పుణ్యమానీ… ఇటీవల రాజకీయ నాయకుల అసలు రంగు బయటపడుతోంది. వాళ్లలో ఇన్నాళ్లూ దాగున్న ‘అపరిచితులు…’ మాటల రూపంలో బయటికొస్తున్నారు. వీరిలో అందరికంటే అగ్రగణ్యుడిగా ఉన్నది మన ప్రధాని మోడీ గారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలో పెద్ద దుమారాన్నే లేపాయి. అంతర్జాతీయ మీడియా సైతం ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి పీఎం గారి కామెంట్లు. ఎలక్షన్ ప్రక్రియ చివరి అంకంలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆయన తాజాగా తనను తాను పొగుడుకున్న తీరును చూసిన జనాలు..’వార్నాయనో…’ అనుకుంటున్న పరిస్థితి. ‘2047 వరకూ క్రియాశీల రాజకీయాల్లో ఉంటా. దేవుడు ఆ మేరకు నన్ను ఆజ్ఞాపించాడు. అప్పటి వరకూ ఆయన నన్ను వెనక్కి పిలవబోడు…’ అంటూ తనను తాను దేవుడి బిడ్డగా చెప్పుకున్నారు మన మోడీజీ. ఇది చూసిన మేధావులు, నెటిజన్లు ‘ఔరా…’ అనుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏ దేశానికి వెళితే ఆ దేశ దుస్తులు, ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రంలో వాడే టోపీలు ధరించిన ప్రధాని… ఇప్పుడు ఏకంగా తాను దేవుడు పంపితే భూమ్మీదకు వచ్చిన వాడినని చెప్పుకోవటం కొసమెరుపు. ఈ సందర్భంగా అరుణాచలం సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తోంది. ‘దేవుడు శాసిస్తాడు.. అరుణాచలం పాటిస్తాడు…’ అంటూ రజనీ చెప్పిన డైలాగ్‌కు అప్పట్లో ధియేటర్లు దద్దరిల్లాయి. ఇప్పుడు అదే కోవలో డైలాగులు కొట్టేందుకు ప్రధాని ప్రయత్నిస్తు న్నారు. గమ్మత్తేమిటంటే… దేవుడు శాసించటం, మోడీ పాటించటం అటుంచితే, ‘పెట్టుబడిదారులు, ముఖ్యం గా అంబానీ, ఆదానీలు ఆర్థికాంశాలు, ధరల పెరుగుదలలో కేంద్రాన్ని శాసించటం, మోడీ వాటిని అమలు చేసి చూపటం గత పదేండ్లుగా నడుస్తున్న స్టోరీనే…’ అవునా..? కాదా…?
-బి.వి.యన్.పద్మరాజు