హీరో కిరణ్ అబ్బవరం నటించిన లెటెస్ట్ మూవీ ‘క’. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా రెండు రోజుల్లో 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో శనివారం సక్సెస్‌మీట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. నిర్మాత చింతా గోపాలకష్ణ రెడ్డి మాట్లాడుతూ, ‘నేనేనా ఇంత పెద్ద సూపర్ హిట్ సినిమా చేశాననిపిస్తోంది. ఇంకా నమ్మకం కుదరడం లేదు. అందుకే సక్సెస్ కిక్ రావడం లేదు. నా టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా’ అని చెప్పారు. ‘ఈ సినిమా నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఈ సినిమాతో ఏదో మ్యాజిక్ జరుగుతుంది. మనం ఇరవై కోట్లు కాదు వంద కోట్ల సినిమా కొడుతున్నాం అని హీరో కిరణ్ చెప్పాడు. అతని మాటలే నాలో ఎంతో నమ్మకాన్ని కలిగించాయి. ఆ నమ్మకం ఈ రోజు నిజమైంది’ అని డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ‘ఘన విజయాన్ని అందించి ఈ దీపావళికి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. థియేటర్స్ పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. హిట్ కొట్టాడు అనకుండా హిట్ కొట్టేశాం అంటున్నారు. ఇది తమ విజయంగా భావిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని తెలిపారు.