అవి తాయిలాలు కాకూడదు…

తెలంగాణలోని దళిత, బడుగు, బలహీనవర్గాల వారు, మైనారిటీలు దశాబ్దాల తరబడి… ‘కూడుకేడ్చారు.. గూడుకేడ్చారు..ఒంటినిండా కప్పుకోను బట్టకేడ్చారు…’ ఈ క్రమంలో స్వయం పాలన, సర్వతోముఖాభివృద్ధి కోసమంటూ కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం. మళ్లీ ఇప్పుడు గతంలో మాదిరిగా కూడు కోసం, గూడు కోసం, ఆర్థిక సాయాలు, ఆసరాల కోసం ఏడ్చే పరిస్థితి రాకూడదు. అది రాకుండా ఉండాలంటే పాలకులు, పార్టీలు గుప్పించే హామీలు ‘ఎన్నికల తాయిలాలు’ కాకూడదు. అవన్నీ అమలు కావాలని ఆశిద్దాం.
    మనం చేస్తున్న పని మంచిదా..? చెడ్డదా..? అన్నప్పుడు ‘దాని వల్ల అత్యధిక మందికి మేలు, లాభం జరిగితే అది మంచిదని భావించొచ్చు…’ అని మన పెద్దలు చెబుతుంటారు. ఇది వ్యక్తుల దగ్గర్నుంచి వ్యవస్థల వరకూ.. పంచాయతీ దగ్గర్నుంచి పార్లమెంటు వరకూ అందరికీ వర్తించే సూత్రం. మనం ఇప్పుడు ప్రజాస్వామ్య భారతంలో ఉన్నాం కాబట్టి… పాలకులు ఈ విషయాన్ని మరింతగా గుర్తు పెట్టుకోవాలి. భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించి 76 ఏండ్లు పూర్తవుతున్న క్రమంలో… తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇది మరింత సందర్భోచితం.
రానున్న ఐదారు నెలల కాలం తెలంగాణకు, ఇక్కడి ప్రజలకు అత్యంత కీలక సమయం. ఎందుకంటే రాష్ట్ర శాసనసభకు డిసెంబరు నాటికి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి. ఈ క్రమంలో ఈ ఐదారు నెల్ల కాలం ఇటు అధికార పార్టీకి, అటు ప్రతిపక్ష పార్టీలకు కూడా అంతే కీలకం. అందుకే బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌, బీజేపీలు పోటా పోటీగా జనంపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ హంగామా సృష్టిస్తున్నాయి. ఈ వాగ్దానాల వానను కురిపించటంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ సహజంగానే ముందు వరుసలో ఉంది. వికలాంగులకు పింఛన్‌ పెంపు, బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం వంటివి ఈ కోవలోనివే. వీటిలో బీసీలకు ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఈ అప్లికేషన్‌ సమర్పించేందుకు అవసరమైన ఆదాయ ధృవీకరణ పత్రం కోసం జనాలు తహశీల్దార్‌ కార్యాలయాల ముందు క్యూ కడుతున్నారు. మీ సేవా సెంటర్లు దరఖాస్తుదారులతో కిక్కిరిసి పోతున్నాయి. దాంతో వాటి పంట పండుతోంది.
ఇంత వరకూ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక లాజిక్కు దాగుంది. దరఖాస్తులు సమర్పించిన బీసీలందరికీ ఆర్థిక సాయం వస్తుందా..? అనేది పెద్ద శేష ప్రశ్న. ఇప్పటి బీఆర్‌ఎస్‌తో పాటు గతంలో రాష్ట్రాన్ని పాలించిన పలు పార్టీలు ఎన్నికలప్పుడు ప్రకటించిన అనేక పథకాలు, కార్యక్రమాలు లబ్దిదారులందరి దరి చేరకపోవటమే దీనికి కారణం. ఎప్పటిదాకో ఎందుకు..తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి దాకా పదేండ్ల కాలాన్ని పరిశీలించినా ఈ సత్యం బోధపడుతుంది. 2014 జూన్‌లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో… దళితులకు మూడెకరాల భూ పంపిణీ, కేజీ టూ పీజీ ఉచిత విద్య, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు తదితర ప్రతిష్టాత్మక పథకాలను ఆనాటి టీఆర్‌ఎస్‌ (నేటి బీఆర్‌ఎస్‌) ప్రకటించింది. ప్రస్తుతం ఆయా హామీల పరిస్థితేంటో మనందరికీ తెలిసిందే. 2014లో ఇచ్చిన ‘దళితులకు మూడెకరాల’ హామీ గురించి… 2018 ముందస్తు ఎన్నికల సందర్భంగా ఏలికలను అడిగితే… ‘వాగ్దానాలన్నీ ఐదేండ్లలోనే అమలు కావు… మూడెకరాల పంపిణీ అనేది ఒక నిరంతర ప్రక్రియ, అందువల్ల అది కొనసాగుతూనే ఉంటుంది…’ అనే సమాధానం విని విస్తుపోవాల్సి వచ్చింది. ఇక 2018లో ఇచ్చిన నిరుద్యోగ భృతికి ఇప్పటి వరకూ అతీగతీ లేదు. దీని గురించి నాలుగేండ్ల క్రితమే అడిగితే… ‘రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారో వివరాలు తీస్తున్నాం… విధి విధానాలు రూపొందిస్తాం…’ అని చెప్పారు తప్పితే అటు మంత్రుల నుంచి గానీ, ఇటు అధికారుల నుంచి గానీ స్పష్టమైన సమాధానం రాకపోవటం గమనార్హం. హూజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంలో కూడా సర్కారు వారు ఆర్భాటంగా దళిత బంధును ప్రకటించారు. ఆ పథకం కింద ఇప్పటి వరకూ ఒక్కో ఊరిలో ఎంత మందికి లబ్ది చేకూరిందనేది లెక్కలు తీస్తే… అసలు విషయం ఇట్టే బోధపడుతుంది. బర్రెలు, గొర్రెల పంపిణీ సంగతి సరేసరి.
ఈ రకంగా ‘ఏ పథకాన్ని, ఏ కార్యక్రమాన్ని చూసినా… ఏమున్నది గర్వకారణం… అవన్నీ ఎన్నికల మాయాజాలం…’ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. తెలంగాణలోని దళిత, బడుగు, బలహీనవర్గాల వారు, మైనారిటీలు దశాబ్దాల తరబడి… ‘కూడుకేడ్చారు.. గూడుకేడ్చారు… ఒంటినిండా కప్పుకోను బట్టకేడ్చారు…’ ఈ క్రమంలో స్వయం పాలన, సర్వతో ముఖాభివృద్ధి కోసమంటూ కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం. మళ్లీ ఇప్పుడు గతంలో మాదిరిగా కూడు కోసం, గూడు కోసం, ఆర్థిక సాయాలు, ఆసరాల కోసం ఏడ్చే పరిస్థితి రాకూడదు. అది రాకుండా ఉండాలంటే పాలకులు, పార్టీలు గుప్పించే హామీలు ‘ఎన్నికల తాయిలాలు’ కాకూడదు. అవన్నీ అమలు కావాలని ఆశిద్దాం.