దేవుని గురించి మాట్లాడుతారు…

– ధరల పెరుగుదలపై నోరు విప్పరెందుకు? : బీజేపీ నేతలకు జగ్గారెడ్డి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేవుని గురించి పదే పదే మాట్లాడే బీజేపీ నేతలు పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరల గురించి ఎందుకు నోరు విప్పడం లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోమవారం గాందీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మత భావోద్వేగ రాజకీయాలు చేసే బీజేపీ పేదల కడుపు నింపి ఓట్లు అడుగుతుందా? అని నిలదీశారు. ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాతే దేవుళ్లను మొక్కడం మొదలైనట్టు ప్రచారం చేసుకుంటున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లోనూ తమ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. దేశంలో రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని తెలిపారు. తండ్రి చాటు కొడుకు కేటీఆర్‌ తమ పార్టీ గురించి తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నుంచి వెళ్లిన కేసీఆర్‌కు దానిపై అవగాహన ఉందని చెప్పారు. బీజేపీ దేవుడినీ, గుడినీ రాజకీయాల కోసం వాడుకుంటుంటే, రాహుల్‌ గాంధీ ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మరిచిపోయిన బీజేపీ వారిని భావోద్వేగాల వైపు మళ్లిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.