వ్యాపారులను బెదిరించి డబ్బులు దండుకున్నారు

వ్యాపారులను బెదిరించి డబ్బులు దండుకున్నారు– వీరిని మరింతగా విచారించాలి
– కోర్టుకు తెలిపిన పంజాగుట్ట పోలీసులు
– ముగ్గురు అధికారుల కస్టడీ పిటిషన్‌ నేటికి వాయిదా
– ప్రతి జిల్లాలో ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులున్నారు
– విచారణ జరపండి : డీజీపీకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం ఫిర్యాదు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రయివేటు వ్యాపారులనూ బెదిరించి ముగ్గురు పోలీసు అధికారులు భారీ మొత్తంలో డబ్బులను దండుకున్నారనీ, వారిని మరింత లోతుగా విచారించటానికి తమ కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులైన డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు బుజంగరావు, తిరుపతన్నలు చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ ముగ్గురిని తదుపరి విచారణ కోసం వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కేసు దర్యాప్తు జరుపుతున్న పంజాగుట్ట పోలీసులు.. న్యాయమూర్తిని కోరారు. ప్రతిపక్ష రాజకీయ ప్రముఖుల ఫోన్లతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బంగారు వ్యాపారుల ఫోన్లను అనేకం వీరు ట్యాపింగ్‌ చేసి చివరకు బెదిరింపులకూ పాల్పడ్డారని పంజాగుట్ట పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, దీనికి సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయటానికి తమకు సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును కోరటంతో బుధవారానికి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
దర్యాప్తును సాగిస్తున్న స్పెషల్‌ టీమ్‌ పోలీసులు ఈ ముగ్గురిని తదుపరి విచారించటానికి అవసరమైన ్పశ్నావళిని సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, ఫోన్‌ట్యాపింగ్‌కు అవసరమై ఆధునిక పరికరాలను విదేశాల నుంచి తేవటంలో ఒక ఎమ్మెల్సీ కూడా ఇందులో కీలక పాత్ర వహించినట్టు దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో, ఈ అధికారుల నుంచి తామెదుర్కొన్న బాధలను కొందరు వ్యాపారులు మౌఖికంగా పోలీసు అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే, వాటిపై ఫిర్యాదు చేస్తే తప్పకుండా దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని స్పెషల్‌ టీమ్‌ అధికారులు హామీ ఇచ్చినట్టు సమాచారం.
కాగా, ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వలన ఇబ్బందులను ఎదుర్కొన్న బాధితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారనీ, వాటిని సమగ్రంగా విచారించటానికి పటిష్టమైన విచారణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి.. డీజీపీ డాక్టర్‌ రవి గుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తాను కూడా బాధితుడినేనని ఆయన చెప్పారు. ఒక కుట్రపూరితంగా జరిగిన ఈ ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో అప్పటి ప్రతిపక్ష రాజకీయ ప్రముఖులేగాక అనేక మంది వ్యాపారులు, ప్రముఖులు కూడా ఇబ్బందులు పడ్డారని ఆయన వివరించారు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వెనక పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేసింది అప్పటి ప్రభుత్వ పెద్దలేననీ, ఈ నేరానికి పాల్పడ్డవారెవరిని కూడా వదలకూడదని ఆయన డీజీపీని కోరారు. ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపించి, బాధితులకు న్యాయం చేస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్టు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ఫోన్‌ట్యాపింగ్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడి అనేక మంది వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలను నిందిత అధికారులు దండుకున్నారనే ఆరోపణలపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కూడా దృష్టిని సారించినట్టు తెలిసింది. అప్పటి స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎస్‌ఐబీ) ఐజీ ప్రభాకర్‌రావు ఇచ్చిన ఫోన్‌ నెంబర్లే గాక.. ప్రయివేటు వ్యక్తులు, మరికొందరు రాజకీయ నాయకులు కూడా ఇచ్చిన ఫోన్‌ నెంబర్లను ట్యాప్‌ చేయటం ద్వారా భారీ మొత్తంలో అక్రమార్జనకు వీరు పాల్పడినట్టు ఏసీబీ అనుమానిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఏసీబీ నుంచి కొందరు అధికారులను ఈ దిశగా అంతర్గత సమాచార సేకరణ కోసం రంగంలోకి దింపినట్టు తెలిసింది. నిందితుల్లో ఒకరైన అదనపు ఎస్పీ బుజంగరావు తాను ఎస్సైగా ఉన్నప్పటి నుంచి అదనపు ఎస్పీగా పదోన్నతి పొందే వరకు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన సందర్భంగా అమాయకులను బెదిరించి భూకబ్జాలకు పాల్పడినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. నాచారం, వనస్థలిపురం, మాదాపూర్‌, కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వర్తించినపుడు ఈ భూకబ్జాలకు పాల్పడినట్టుగా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నట్టు తెలుస్తున్నది. భువనగిరిలో పని చేస్తున్నపుడు గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కబ్జాకు పాల్పడ్డ కొన్ని భూములలో కూడా బుజంగరావు తన హస్తలాఘవం ప్రదర్శించి సొంతం చేసుకున్నట్టు కూడా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నట్టు తెలుస్తున్నది.