– అధిక రాబడి వస్తుందని చెప్పారుొదళిత కుటుంబంతో బాండ్లు కొనిపించిన వెల్స్‌పన్ కంపెనీ అధికారి
– అదానీ గ్రూపుతో దానికి సంబంధాలు
అహ్మదాబాద్ : గత సంవత్సరం అక్టోబర్ 11న గుజరాత్‌లోని ఓ దళిత కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులను మాయమాటలతో మోసం చేసి రూ.11,00,14,000 విలువైన ఎన్నికల బాండ్లను కొనిపించారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎస్‌బీఐ సమాచారం ప్రకారం ఇందులో అక్టోబర్ 16న రూ.10 కోట్ల విలువైన బాండ్లను బీజేపీ సొమ్ము చేసుకుంది. మిగిలిన బాండ్ల మొత్తాన్ని అక్టోబర్ 18న శివసేన పార్టీ నగదుగా మార్చేసుకుంది.
అదానీ గ్రూపుతో సంబంధం ఉన్న వెల్స్‌పన్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ అధికారి ఒకరు తమను మోసం చేశారని, తమతో బాండ్లు కొనుగోలు చేయించారని ఆ దళిత కుటుంబం ఆరోపిస్తోంది. 2005లో అదానీ గ్రూపు వెల్స్‌పన్ నేచురల్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఉమ్మడి భాగస్వామ్యం నెలకొల్పింది. అదానీ వెల్స్‌పన్ ఎక్స్‌ప్లొరేషన్ లిమిటెడ్ పేరిట కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇందులో అదానీ గ్రూపుకు 65% వాటాలు, వెల్స్‌పన్ గ్రూపుకు 35% వాటాలు ఉన్నాయి.
‘ఒక ప్రాజెక్ట్ కోసం అంజర్ ప్రాంతంలో మా కుటుంబానికి చెందిన 43 వేల చదరపు మీటర్ల వ్యవసాయ భూమిని వెల్స్‌పన్ తీసుకుంది. అందుకు ప్రతిగా చట్టప్రకారం మాకు నష్టపరిహారం అందించారు. అయితే ఆ డబ్బును డిపాజిట్ చేసే సమయంలో కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ మహేంద్ర సింగ్ సోధా అడ్డుపడ్డారు. ఇంత పెద్ద మొత్తం డిపాజిట్ చేస్తే ఐటీ శాఖ నుండి ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఎన్నికల బాండ్ల పథకం గురించి చెప్పారు. ఈ పథకంలో సొమ్ము డిపాజిట్ చేస్తే కొన్ని సంవత్సరాలలోనే ఒకటిన్నర రెట్లు పెరుగుతుందని నమ్మబలికారు. మేము నిరక్షరాస్యులం. ఈ పథకం గురించి మాకేమీ తెలియదు’ అని దళిత కుటుంబానికి చెందిన హరేష్ సవకర ఆవేదనగా చెప్పారు.
వాస్తవాలు గ్రహించిన హరేష్ ఈ ఏడాది మార్చి 18న అంజన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత కేసులో బలం ఉంటే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేస్తామని వారు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం….వెల్స్‌పుర్ కంపెనీకి రూ.16,61,21,877 లకు వ్యవసాయ భూమిని విక్రయించేందుకు జిల్లా అధికారులు అనుమతి ఇచ్చారు. అందులో రూ.2,80,15,000లను అడ్వాన్సుగా ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని భూమి యాజమాన్య హక్కులున్న ఏడుగురు వ్యక్తులకు బదిలీ చేశారు. 2023 అక్టోబర్ 1-8 తేదీల మధ్య కంపెనీ అధికారి దళిత కుటుంబంతో నాలుగుసార్లు సమావేశమై బాండ్ల పథకంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా నచ్చచెప్పారు. ఈ సమావేశాల్లో అంజర్ నగర బీజేపీ అధ్యక్షుడు హేమంత్ రజనీకాంత్ షా కూడా పాల్గొన్నారు.