ప్రమాణం చేయనిది వారిద్దరే…

– సభకు హాజరు కాని కేసీఆర్‌, బీఎల్‌ఆర్‌
– ఇప్పటి వరకు 117 మంది ప్రమాణస్వీకారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ సమావేశాలు గురువారం తిరిగి ప్రారంభమయ్యాయి. రెండోరోజు 16 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయలేదు. వారిలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌), మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్‌) ఉన్నారు. ఇప్పటి వరకు 117 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ సమక్షంలో గురువారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేటీ రామారావు, పాడి కౌశిక్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, టి పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిపి ఎనిమిది మంది ప్రమాణం చేశారు. అయితే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ప్రమాణస్వీకారం చేయబోమని బీజేపీ సభ్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వారు సభకు గైర్హాజరయ్యారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఎన్నికైన తర్వాత బీజేపీ సభ్యులు ఆలేటి మహేశ్వర్‌రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, పాయల్‌ శంకర్‌, రామారావు పవార్‌, టి రాజాసింగ్‌తో కలిపి ఎనిమిది మంది ప్రమాణస్వీకారం చేశారు. కేటీ రామారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేయగా, మిగిలిన వారంతా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. పాడి కౌశిక్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసే సమయంలో సందర్శకుల గ్యాలరీలో ఉన్న ఆయన కూతురు ‘ఐలవ్‌ యూ డాడీ’ అని గట్టిగా అరిచారు. దీంతో సభలో ఉన్న సభ్యులంతా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. రాజాసింగ్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత భారత్‌ మాతాకి జై అని అన్నారు. అనంతరం సభను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు.