అయ్యప్ప హోటల్ లో దొంగలు పడ్డారు..

– రూ.70 వేలు దొంగతనం 
– ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 
– నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
అయ్యప్ప అనే హోటల్ లో దొంగలు పడి రూ.70 వేల నగదును దొంగిలించిన ఘటన సోమవారం ఆళ్ళపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పద్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్ళపల్లి మండల కేంద్రానికి టేకులపల్లి మండల కేంద్రం నుండి బతుకు తెరువు కోసం సుమారు 5 సంవత్సరాల క్రితం నూనావత్ మోతిలాల్, పద్మ అనే దంపతులు వచ్చి, మెయిన్ రోడ్ హోటల్ పెట్టుకుని, నడుపుకుంటూ జీవించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ‘అయ్యప్ప’ అని హోటల్ కి నామకరణం చేసి నడుపుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 10 వ తేదీన టేకులపల్లిలో చిట్టి వ్యాపారి దగ్గర చిట్టి పాట పాడి రూ.1 లక్షా 30 వేలు ఆళ్ళపల్లిలోని వారి ఇంటికి తీసుకొచ్చి, ఇంట్లో బీరువాలో దాచారు. అవసర నిమిత్తం అందులో రూ.30 వేలు ఖర్చు చేసి, మిగతా డబ్బులు ఇంట్లోనే ఉంచి, సంక్రాంతి పండుగ సందర్భంగా సమీప బంధువుల ఫంక్షన్ వేరే గ్రామంలో ఉండటంతో ఈ నెల 14వ తేదీన దంపతులు ఇరువురు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఆరోజు అక్కడే గడిపి, మరునాడు సాయంత్రం ఆళ్ళపల్లికి వచ్చారు. అవసరం నిమిత్తం ఈనెల 16వ తేదీన మిగతా డబ్బుల కోసం బీరువా తీయగా డబ్బులు లేకపోవడంతో దంపతులు ఇరువురు బాధపడ్డారు. ఇరువురు ఎవరిని అడగాలి, ఎవరిని అనుమానించాలో ఎటూ పాలుపోక చివరికి ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ జరిగిన ఘటన విషయం చెప్పి, దరఖాస్తు చేసుకున్నారు. ఊర్లో మాకు అండగా ఎవరూ లేకపోయినా బ్రతుకు తెరువు కోసం ఆళ్ళపల్లి వచ్చి హోటల్ నడుపుకుంటున్న మా ఇంట్లో దొంగలు పడి, నగదును దొంగిలించడం ఒంకిత బాధను కలిగిస్తుందని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు జరిగిన దొంగతనంపై పూర్తిగా దర్యాప్తు చేసి, మా డబ్బులు తిరిగి ఇప్పించాలని పద్మ, మోతిలాల్ వేడుకుంటున్నారు.