గౌరయపల్లిలో దొంగల బీభత్సం

Thieves in Gaurayapalli– ఒక్క రోజే ఆరు ఇండ్లల్లో చోరీ
– నెలల వ్యవధిలో ఒక ఇంట్లో రెండు సార్లు..
నవతెలంగాణ-కొమురవెల్లి
మెదక్‌ జిల్లా కొమురవెల్లి మండలంలోని గౌరయపల్లి గ్రామంలో ఒకే రోజు ఆరు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి ఆరు ఇండ్లలో భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకొని అర్ధరాత్రి ఇండ్ల తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
గౌరయపల్లి గ్రామానికి చెందిన నీల కనకయ్య ఇంట్లో 10తులాల బంగారం, బొచ్చు లక్ష్మి ఇంట్లో తులం బంగారం, 6 తులాల వెండి, రూ.21 వేలు, బండి మల్లవ్వ ఇంట్లో 25 తులాల వెండి, తులం బంగారం, రూ.4 వేలు ఎత్తుకెళ్లారు. సన్నపురి రాములవ్వ ఇంట్లో 20 తులాల వెండి పట్టాగొలుసులు, రూ.6 వేలు, నరెడ్ల మల్లవ్వ ఇంట్లో సుమారు రూ.20 వేలు, దొంతరబోయిన భిక్షపతి ఇంట్లో రూ.2 లక్షల 80 వేలను ఎత్తుకెళ్లారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చేర్యాల సీఐ ఎల్‌.శ్రీను, కొమురవెల్లి ఎస్‌ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీం ఏఎస్‌ఐ క్రాంతి ఆధారాలు సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
నీల కనకయ్య ఇంట్లో సుమారు 11 నెలల కిందట దొంగలు పడి కిలో వెండి ఆభరణాలు, మూడు తులాల బంగారం దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వదిలేశారని బాధిత కుటుంబం తెలిపింది. ఆ కేసును ఛేదించక ముందే మరోసారి ఇంట్లో దొంగలు పడి బంగారం ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు ఇప్పుడైనా దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలని వాపోయారు.