మానేరులో దొంగలు… ఇప్పలపల్లిలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు

– అర్ధరాత్రి అక్రమ ఇసుక తవ్వకాలు
నవతెలంగాణ- మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి, కేశారంపల్లి మానేరులో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ అక్రమంగా మానేరులోని సహజ సంపదైన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రవాణ చేస్తూ  కొల్లగొడుతున్నారు. పోలీస్, రెవెన్యూ, అటవీశాఖ, మైనింగ్ శాఖల అధికారులను ములాఖత్ చేసుకొని యథేచ్ఛగా ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు.అక్రమ ఇసుక దందా కొయ్యిర్ పోలీస్ స్టేషన్, అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో కొనసాగుతోంది. ఒక్కొక్క ట్రాక్టర్ త్రిప్పుకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు.అక్రమ ఇసుక రవాణ కోసం పంట పొలాల్లో నుంచి అక్రమంగా వక్రమ దారిని సైతం ఇసుక వ్యాపారులు ఏర్పాటు చేశారు. ఇప్పలపల్లిలో అక్రమ ఇసుక దందాకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. ట్రాక్టర్లలో ఇసుక పోయడానికి ట్రాక్టర్ కు డొజర్ ను అమర్చి మానేరులో నిబంధనలకు విరుద్ధంగా 4 అడుగుల నుంచి 6 అడుగుల లోతుగా తీయడంతో భూగర్భజలాలు అడుగంటి రాబోయే వేసవిలో తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచివుoది. ఇప్పలపల్లి నుంచి ట్రాక్టర్ల ద్వారా కాటారం, రహస్య ప్రదేశాల్లో డంపింగులు ఏర్పాటు చేసి రాత్రికిరాత్రే లారీలలో వరంగల్, హైదరాబాద్ పట్టణాలకు నిత్యం లక్షల ఇసుక వ్యాపారం జరుగుతున్న అక్రమ ఇసుక దందాను ఆపే దమ్ము ఎవరికి లేదాని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం భూపాలపల్లి జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని కొండంపేట, ఇప్పలపల్లి, కేశారం పల్లి గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.