
ప్రతి ఒక్కరు సుందరయ్య ఆదర్శంగా స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తీగల ఆగి రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో కమ్యూనిస్టు పార్టీ దక్షిణ భారతదేశ ఉద్యమ నిర్మాత పోరాటయోధుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభను అంబాల మురళి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి హాజరై మాట్లాడుతూ.. సుందరయ్య జీవితం నేటి సమాజానికి ఆదర్శప్రాయమని ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని కోరారు. నేటి పాలకవర్గాల విధానాల వలన దేశంలో రోజురోజుకు సామాన్యులైన పేద మధ్యతరగతి ప్రజలు అనునిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. రైతులు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని కార్మికులకు పనికి తగిన వేతనాలు అందడం లేదని దళిత గిరిజనులకు ఉపాధి అవకాశాలు కొరబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని భారం వేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ రంగం సేవలను ప్రజలకు దూరం చేస్తూ బడా పెట్టుబడిదారులకు వాటిని అప్పగిస్తున్నారని ఆరోపించారు. దేశంలో రోజురోజుకు మతోన్మాదం తీవ్ర రూపం దాలుస్తుందని దానివలన దేశంలో అనేకచోట్ల హింసాత్మక ఘటనలు చెల్లరేగి వందలాది మంది అమాయక ప్రజలు చనిపోయారని అన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి ప్రజలంతా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బావి తరాలకు మంచి పాలన అందించడానికి శ్రామికులు రైతులు వ్యవసాయ కార్మికులు బడుగు బలహీన వెనుకబడిన వర్గాలకు చెందిన వారంతా ఏకమై పెట్టుబడి వర్గాన్ని గద్దె దించి శ్రామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు అందరూ కృషి చేయాలని ఇదే సుందరయ్య గారికి మనం ఇచ్చే ఘన నివాళి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు గొంది రాజేష్ మండల కమిటీ సభ్యులు ముమ్మడి ఉపేంద్ర చారి కొట్టెం కృష్ణారావు నాయకులు పల్లపు రాజు కడారి అశోక్ గణేష్ రాజేశ్వరి విజయ్ శేఖర్ సత్యనారాయణ వంశి తదితరులు పాల్గొన్నారు.