– 15రోజుల్లో 25కిలోల బస్తాపై రూ.200పైనే పెంపు
– వరిసాగు విస్తీర్ణం తగ్గుదల.. మార్కెట్‌లో డిమాండ్
– స్టాక్ బ్లాక్ చేస్తున్న మిల్లర్లు, ట్రేడర్లు
– ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డివిరుస్తున్న వైనం
– కొన్నింటిలో రేషన్ బియ్యాన్ని కలుపుతూ సొమ్ము చేసుంటున్న తీరు..
సన్న బియ్యం పిరమయ్యాయి. పక్షం రోజుల్లోనే క్వింటాల్ బియ్యంపై రూ.800 నుంచి రూ.1200వరకు ధర పెరిగింది. బీపీటీ రకం బియ్యం 25కిలోల బస్తా రూ.వెయ్యి నుంచి రూ.1250పైనే పలుకుతోంది. హెచ్‌ఎంటీ, జైశ్రీరాం రకాలు రూ.1450 నుంచి రూ.1650 వరకు పలుకుతున్నాయి. దీనంతటికీ రాష్ట్ర వ్యాప్తంగా వరి సన్నాల సాగు విస్తీర్ణం తగ్గడం ఒకెత్తయితే.. ఇదే అదనుగా మిల్లర్లు, ట్రేడర్లు స్టాక్ బ్లాక్ చేసి మరీ వారం రోజులకోమారు ధరలు పెంచుతున్నారు. ఇందులో కొత్తవి, పాతవి అంటూ అయోమయానికి గురి చేస్తున్నారు. మరోవైపు బీపీటీలాంటి సన్నరకం బియ్యంలో రేషన్ బియ్యాన్ని కూడా కలుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతలా ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరుగుతున్నా.. ఆ ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది.
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
సాధారణంగా వానాకాలంలో 60:40నిష్పత్తిలో సన్న, దొడ్డు రకం వరిసాగు చేస్తారు. యాసంగిలో సన్నరకాలపై వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉండటంతో 30:70నిష్పత్తిలో వరి వేస్తారు. ప్రస్తుతం వరి ధాన్యానికి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొంటోంది. అయితే దొడ్డు రకానికి, సన్న రకానికి మధ్య పెద్దగా తేడా లేకుండా మద్దతు ధర చెల్లిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సీజన్‌తో సంబంధం లేకుండా వానాకాలం, యాసంగి సీజన్లలో 70శాతం దొడ్డు రకాలే పండిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. దొడ్డు రకాలు పండిస్తే ఎకరాకు రూ.23వేల పెట్టుబడి అవుతుండగా 25క్వింటాళ్ల నుంచి 28 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి వస్తోంది. సన్నరకం సాగు ఖర్చు చూస్తే రూ.30వేలు దాటుతుండగా.. దిగుబడి 18క్వింటాళ్ల నుంచి 20క్వింటాళ్లు కూడా రావడం లేదు. శ్రమకోర్చి, పెట్టుబడి పెట్టి మరీ సన్నాలు సాగు చేసే బదులు దొడ్డు రకం సాగువైపే మొగ్గు చూపుతున్నారు. ఈ వానాకాలంలో వరి సాగు చూస్తే.. కరీంనగర్ జిల్లాలో 2,66,778 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 2,01,408, జగిత్యాల జిల్లాలో 3,02,517, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 1,74,181 ఎకరాల్లో సాగవుతుండగా.. అందులో 70శాతం మేర దొడ్డురకం పంటనే పండుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వినియోగదారులు తినే సన్నాలే కావడం, దిగుబడి లేక మార్కెట్‌లో ఆ బియ్యానికి డిమాండ్ పెరిగింది.
బ్లాక్ చేస్తున్న మిల్లర్లు, ట్రేడర్లు
నెల రోజుల వ్యవధిలోనే సన్నరకం ధరలు అమాంతంగా పెరిగాయి. బీపీటీ, హెచ్‌ఎంటీ బియ్యం క్వింటాల్‌కు రూ.400పైగానే పెంచి అమ్ముతున్నారు. నెల కిందట క్వింటాల్ జైశ్రీరాం బియ్యం పాతవి రూ.5800ఉండగా వ్యాపారులు దాని ధర రూ.6200వేలకు పెంచి విక్రయిస్తున్నారు. హెచ్‌ఎమ్‌టి రూ.4600గా ఉన్న ధరను రూ.5వేలకు పెంచారు. బీపీటీ రూ.4400గా ఉన్న ధరను రూ.4800కు పెంచి అమ్ముతున్నారు. మార్కెట్‌లో 25కిలోల బీపీటీ బియ్యం బస్తా ధర మొన్నటి వరకు రూ.1100గా ఉండేది. ప్రస్తుతం రూ.1250కి పెంచారు. కొన్నిచోట్ల పాత బియ్యం పేరుతో రూ.1400వరకూ అమ్ముతున్నారు. ఒక్కసారిగా పెరిగిన సన్న బియ్యం ధరలతో ఏం కొనాలో ఏం తినాలో తెలియడం లేదని సామాన్యులు వాపోతున్నారు. ఇదే సమయంలో సన్నరకం బియ్యం (ప్రధానంగా బీపీటీ, జైశ్రీరాం) రకాల్లో రేషన్ బియ్యాన్ని కలుపుతున్నారు. 25కిలోల బస్తాలో కనీసంగా కిలో నుంచి 2కిలోల వరకూ కలుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బియ్యం స్టాక్‌ను మిల్లర్లు, ట్రేడర్లు బ్లాక్ చేస్తున్నారు. కొత్త బియ్యాన్నే పాత బియ్యం కింద చూపుతూ విక్రయిస్తున్నారు. ఇలా మాయ చేసి మరీ దోచుకుంటున్న తీరు ప్రస్తుతం మార్కెట్‌లో రాజ్యమేలుతోంది. దీన్ని అరికట్టాల్సిన అధికారులు, ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం చేష్టలూడిగి చూస్తోంది.