ఆలోచించి ఓటెయ్యాలి

Think and vote– అన్ని రంగాల్లో మోడీ ప్రభుత్వం విఫలం
– భువనగిరిలో సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలి : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
– నన్ను గెలిపించండి మీ గొంతుకనవుతా : జహంగీర్‌
నవతెలంగాణ-భువనగిరి/ భువనగిరి అర్బన్‌
ఎన్నికల్లో మోడీ సర్కార్‌ కుట్రలను తిప్పికొట్టి, మతతత్వ బీజేపీని ఓడించాలి.. ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలి.. అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ చౌరస్తా నుంచి బైక్‌ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద అంబేద్కర్‌కు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు భారతదేశం, ప్రజల భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలన్నారు. ప్రజలంతా ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తన పనితనం చూపించి ఓట్లను అడిగే స్థితిలో లేదన్నారు. అన్ని రంగాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలు పదేండ్ల బీజేపీ పాలనను చూసి ఆ పార్టీని చిత్తుగా ఓడిస్తారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన మోడీ సర్కార్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలు, ప్రజల పట్ల నిబద్ధతో పనిచేసే వారిని ఎన్నుకోవాలని కోరారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగాన్ని పెంచారని, రైతులకు మద్దతు ధర గ్యారంటీ చేస్తామని తెలిపి ఇప్పుడు మద్దతు ధర గ్యారంటీ చేయడానికి ససేమిరా అంటున్నారని తెలిపారు. ఈ పదేండ్లలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత అసంతృప్తి పెరిగిందని, అందుకే బీజేపీని ప్రశ్నించేవారిపై, ప్రతిపక్షాలపై నిరంకుశ అణచివేత ధోరణి కొనసాగిస్తోం దని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్స్‌ ఎత్తేయాలని చూస్తోందని అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ప్రజాసమస్యలు తెలియని వారు డబ్బు సంచులతో పోటీలో నిలిచారని చెప్పారు. లౌకిక విలువల కోసం ప్రజాస్వామ్య విలువల కోసం నిబద్ధతతో నికరంగా నిలిచిన ఎర్రజెండాను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం : అభ్యర్థి జహంగీర్‌
13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమని భువనగిరి సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ అన్నారు. ప్రజలంతా ఆచీతూచి ఓట్లు వేయాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై అవగాహన లేని వ్యక్తులు పోటీలో ఉన్నారన్నారు. ప్రజా సమస్యలపై పట్టింపులేని బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించాలని అన్నారు.
ఎన్నికల్లో డబ్బు, మందు, మతోన్మాద రాజకీయాలను ఓడించాలన్నారు. 13న జరిగే ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రంపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటేష్‌, కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జగదీష్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వంగూరి రాములు, శోభన్‌ నాయక్‌, నాయకులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, సిరిపంగి స్వామి, మాయ కృష్ణ, దయ్యాల నరసింహ, పగిళ్ల లింగారెడ్డి, సీనియర్‌ నాయకులు గూడూరు అంజిరెడ్డి పాల్గొన్నారు.