అధికారమా..ఆలోచించు!

నిండు ప్రయాణికులతో ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన బాధ్యత విమాన పైలెట్‌దే అయినా దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత గ్రౌండ్‌ కంట్రోల్‌ ఇంజినీర్లదే.అలాగే కిక్కిరిసిన ప్రయాణికులతో గమ్యాన్ని చేరుకుంటున్న ట్రెయిన్‌ని సురక్షితంగా స్టేషన్‌కి చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్‌దే అయినా సరైన పట్టాల మార్గాన్ని నిర్దేశించాల్సిన బాధ్యత స్టేషన్‌ మాస్టర్‌పైనే ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లోనూ మార్గదర్శనం చేయాల్సిన అధికారులు ఏమైనా పొరపాట్లు చేసినా, లేదా అలసత్వం వహించినా, జరిగే పరిణామాల, ఫలితాలు అతి దారుణంగా వుంటాయి.చరిత్రలోనే ఇది తిరుగులేని సత్యం. ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ప్రభుత్వంలో పాలకులు, అధికారుల బాధ్యత సమన్వయం అలాగే సహకారంతో కూడుకున్నది. సర్కార్‌ను నడిపేవారు సరిగ్గా లేకపోతే అధికారులు కూడా బాధ్యతారహిత్యంతో వ్యవహరిస్తారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో రాజకీయంగా చూస్తే చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. పదేండ్లుగా పాలన సాగించిన వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి ప్రభుత్వంలోనే పనిచేసిన ఐఏఎస్‌, ఇతర ఉన్నతాధికారులు ఆ అవినీతి మరకలంటించుకున్నారు. ఒక్కోసారి పాలకుల అహంకార ధోరణికి కూడా అధికారులు విషమ పరిస్థితులను ఎదుర్కొనే వరకు తీసుకెళ్తారు అటువంటి పరిస్థితుల్లో అధికారుల కర్తవ్యమేమిటి? ఈ ప్రశ్నకు ప్రజల ఐఏఎస్‌గా పేరుపొందిన ఎస్‌.ఆర్‌.శంకరన్‌ జీవితంలో జరిగిన ఒక సంఘటన సమాధానమిస్తుంది. కర్తవ్యాన్ని భోదిస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శంకరన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న రోజుల్లో దళితులు,పేదవర్గాల ఉన్నతికి నిరంతరం శ్రమించాడు. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్యం, వెట్టిచాకిరీ బలంగా ఉండేది. ఈ వ్యవస్థపై ఉక్కుపాదం మోపాడు శంకరన్‌. అప్పటికే అమలు పరచబడ్డ The Bonded Labour System (Abolition) Act-1976 గురించి పీడిత వర్గాల ప్రజల అవగాహన కల్పించాడు. వెట్టిచాకిరీ చేయవద్దని పిలుపునిచ్చాడు. వారిని ఆ వైపు ముందుకు సాగేలా ధైర్యాన్నిచ్చాడు. సంఘంలోని ఉన్నత వర్గాలకు ఇది మింగుడు పడలేదు. ఫలితంగా వారంతా ఉమ్మడిగా ఈవిషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి దఅష్టికి తీసుకువెళ్లారు. రాజకీయ కోణంలో ఈ విషయాన్ని పరిశీలించిన అప్పటి ముఖ్యమంత్రి శంకరన్‌ను తీవ్రంగా మందలించాడు. దీంతో ఆయన విధానంతో విభేదించిన శంకరన్‌ చట్టం అమలు విషయంలో తాను రాజీపడేది లేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు. అంతటితో ఆగక దీర్ఘకాలం సెలవు తీసుకున్నాడు. అదే సమయంలో ఆయన నీతి,నిజాయితీ, నిబద్ధతను గుర్తించిన త్రిపుర ముఖ్యమంత్రి శంకరన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాదరంగా అహ్వానించాడు. అందుకు సమ్మతించిన శంకరన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధుల్లో చేరి ఆరేండ్లపాటు తన బాధ్యతలని సక్రమంగా నిర్వహించాడు. త్రిపుర ప్రజల మన్ననలనందుకున్నాడు. ఇనిన దశాబ్ధాల తర్వాత కూడా ఆ రాష్ట్రంలో శంకరన్‌ గురించి తలచుకుంటున్నారంటే ఆయన పేదలకు చేసిన సేవ. అందుకే ఆయన పేదల ఐఏఎస్‌గా పేరుగాంచారు.
ఇక చర్చిస్తున్న విషయానికొస్తే కొద్దిమంది ఉన్నతాధికారులు (అందరూ కాదు) ప్రభుత్వ నిర్వహణలో తమ పాత్ర ఔన్నత్యాన్ని, తమ విద్యార్హతల గొప్పదనాన్ని మరిచిపోయి వివిధ కారణాల వల్ల పాలకులకు సరైన మార్గదర్శనం చేయలేక అభాసు పాలవుతున్నారు.పైన చెప్పుకున్నట్టు తర్వాత సంభవించే పరిణామాలకు బాధ్యులవుతూ చట్టపరమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, పరిస్థితులు ప్రతికూలించనప్పుడు ”పాలకుల ఒత్తిళ్ల ప్రభావం వల్ల సరైన మార్గదర్శనం చేయలేకపోయామని” సంజాయిషీ ఇచ్చుకొంటున్నారు. మరికొన్ని సందర్భాల్లోనైతే తమది ఏమాత్రం తప్పు లేదని, తప్పంతా ఏలినవారిదేనని వాదిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమర్థనీయంకాదు. ఎందుకంటే ఒత్తిళ్లను కూడా తట్టుకొని, తప్పులు లేకుండా, సమర్థవంతంగా పనిచేస్తేనే కదా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ పాలకులు మొండిగా మౌఖిక అదేశాలిస్తే వాటిని పాటించాల్సిన అవసరం లేదు. లేదంటే లిఖిత పూర్వక అదేశాలను కోరవచ్చు. అప్పుడు ఫలితాలకు ప్రధాన బాధ్యత అదేశాలిచ్చిన పాలకులదే. ఈ విధానం దేశానికి కూడా ఎంతో ప్రయోజనకరం.అందుకే శంకరన్‌లాంటి ఐఏఎస్‌ల్లా ముక్కుసూటిగా నడవాలి. ప్రజల కోసం అంకితభావంతో పనిచేయాలి.
– బసవరాజు నరేందర్‌రావు, 9908516549