నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ రాచకొండ పోలీస్ స్టేషన్ ల పరిధిలోని పలు స్టేషన్ల లో నిందితులుగా ఉన్న పార్తి గ్యాంగ్ లోని మూడో సభ్యుడిని అరెస్టు చేసి అతని నుండి లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డిఎస్పి కె. శివరామిరెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండలోని డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పట్టుబడ్డ నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. పార్తి గ్యాంగ్ లోని మూడో సభ్యుడైన మహారాష్ట్రకు చెందిన రాజ్ కపూర్ త్రిబోవన్ అలియాస్ రాజ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. అత్యంత ప్రమాదకరమైన ఈ గ్యాంగ్ సభ్యులు నేషనల్ హైవేలపై వాహనాలను ఆపి దొంగతనాలకు పాల్పడడమే కాకుండా దొంగతనాలను అడ్డుకునేందుకు యత్నించే వారిని విచక్షణారహితంగా పొడిచి చంపుతారని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం మే 18వ తేదీన కట్టంగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే పై నిద్రిస్తున్న కృష్ణాజిల్లా పామర్రు మండలం చాట్లవానిపురం గ్రామానికి చెందిన కొల్లూరి రాజవర్ధన్ ను ముఠా సభ్యులు దారుణంగా హత మార్చి అతని వద్ద ఉన్న రూ.14,500 రూపాయల నగదును దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు అయిన నలుగురు సభ్యులు గల ముఠాలో ఈనెల 5వ తేదీన ఇద్దరు నిందితులను పట్టుకున్నామని డిఎస్పి శివరామిరెడ్డి తెలిపారు. ఈ ముఠాలో మూడో సభ్యుడైన రాజ్ కుమార్ త్రిబోవన్ ను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడ్డ నిందితుడు నల్లగొండ జిల్లా, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది కేసులలో నిందితుడని ఆయన వెల్లడించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నార్కెట్ పల్లి సిఐ కే. నాగరాజు, కొండమల్లేపల్లి సిఐ ధనుంజయ గౌడ్, చిట్యాల ఎస్ఐ డి. సైదా బాబు, ఎస్సైలు సుధీర్, శ్రీను, సిబ్బంది అఫ్జల్ ,విష్ణు, ఖలీల్, నరహరి, కార్తిక లను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.