ఈ అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది

This award completed my film career– ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో చిరంజీవి
చిరంజీవి తన నట జీవితంలో మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ఏఎన్నార్‌ జాతీయ అవార్డును బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఆయనకు ప్రదానం చేశారు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార ప్రదానోత్సవ వేడుకకి ముఖ్య అతిథిగా అమితాబ్‌ బచ్చన్‌ హాజరయ్యారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తనయుడు నాగార్జున ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ‘నాకు పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, గిన్నీస్‌బుక్‌లో స్థానం..ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్ళు నన్ను గుర్తించి అవార్డు ఇవ్వడం గొప్ప విషయంగా అనిపించింది. అందుకే నాగార్జునకి ఇది నాకు అన్ని పురస్కారాలకు మించిన అవార్డు అని చెప్పా. ఈ అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది. దేవానంద్‌, లతా మంగేష్కర్‌, అమితాబ్‌ బచ్చన్‌, రేఖ, హేమామాలిని, కె.బాలచందర్‌ వంటి గొప్పవాళ్ళకు ఇచ్చిన పురస్కారం నాకు దక్కడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. జీవితాంతం ఈ అనుభూతిని మనసులో పెట్టుకుంటాను’ అని అన్నారు. ‘తెలుగు సినిమాలోనే కాకుండా మొత్తం సినీ ఇండిస్టీలో ఏఎన్నార్‌ సత్తా చాటారు. ఎంతో మందికి వినోదాన్ని పంచారు’ అని అమితాబ్‌ బచ్చన్‌ చెప్పారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం చిరంజీవిది అని, ఆయనతో తనకి ఉన్న అనుబంధాన్ని నాగార్జున ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.