ప్రభుత్వాల వల్లే.. ఈ సంక్షోభం

SIRCILLA– సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వాలి
– బకాయిలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలి
– సీఎం రేవంత్‌ రెడ్డి తక్షణమే స్పందించాలి
– రాజకీయ కోణంలో కాకుండా ప్రజా సమస్యగా చూడాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.వీరయ్య
– కార్మికుల నినాదాలతో దద్దరిల్లిన ‘నేతన్న మహా గర్జన’
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్‌
‘సిరిసిల్లకు సాంచాలే గుండె చప్పుడు. అటువంటి చప్పుడు ఆగే పరిస్థితి నెలకొంది. వెంటనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బకాయిలు చెల్లించి, కొత్తగా ఆర్డర్లు ఇచ్చి ఉపాధి కల్పించాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది’ అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.వీరయ్య అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సుమారు 2వేల మంది కార్మికులు శనివారం ‘నేతన్న మహాగర్జన’ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లే సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడిందన్నారు. చేనేత, టెక్స్‌టైల్‌ బోర్డును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని, కనీసం ఇక్కడి కార్మికుల గురించి ఆలోచించినా వారికి కొంత ఉపశమనం లభించేందని అన్నారు. ముఖ్యంగా యారన్‌, ఇతర వస్త్రాల ఉత్పత్తిపై నాలుగు శాతంగా ఉన్న జీఎస్టీని 12శాతానికి పెంచి నేతన్నల నడ్డి విరిచిందన్నారు. కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మికవర్గంపై చిన్న చూపు చూస్తోందని విమర్శించారు. ఆయా కార్పొరేట్‌ కంపెనీలకు పెద్దపీట వేస్తూ బహుళజాతి కంపెనీల పనులు వేగంగా జరిగేలా సాయం అందిస్తున్న కేంద్రం.. ఏండ్లుగా చాలీచాలని వేతనాలతో కార్మికులు, నష్టాల్లో నడుస్తున్న వస్త్ర పరిశ్రమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గత సర్కారు ఈ ప్రాంత పరిశ్రమకు ఇచ్చిన ఆర్డర్ల బకాయిలు చెల్లించకపోవడం, ఇప్పుడున్న సర్కారు కనీసం దాని గురించి ఆలోచించకపోవడం బాధాకరమని అన్నారు. రాయితీపై యారన్‌, కరెంటు కూడా ఇవ్వలేదన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో కార్మికుల కోసం నిర్మించిన అపరల్‌ పార్క్‌లోని షెడ్లల్లో తొండలు గుడ్లు పెడుతున్నాయని ఎద్దేవా చేశారు. మూన్నెళ్లుగా ఉపాధి లేక 30వేల మంది కార్మికులు రోడ్డునపడ్డారని, తినడానికీ తిండి లేక ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కిందట పవర్‌లూమ్‌ కార్మికుడు శ్రీనివాస్‌, శనివారం మరో కార్మికుడు సిరిపురం సత్యనారాయణ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు అద్దం పడుతోందన్నారు. సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారే ప్రమాదం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులెవరూ ప్రాణం తీసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని అన్నారు. సమస్య పరిష్కారం కోసం పోరాడుదామని, దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా సమస్యగా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. పాలక, ప్రతిపక్షాలు ఒకరిపైనొకరు ఆరోపణలు చేసుకోకుండా ఈ ప్రాంత వస్త్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నేతన్నల సమస్యలు పరిష్కరించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లను కోరినట్టు తెలిపారు. స్పందించిన మంత్రులు సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని చెప్పారు. నేతన్నలకు ఉపాధి కల్పించి, సిరిసిల్ల గుండె చప్పుడును కాపాడాలన్నారు. ఈ నేతన్నల మహాగర్జనలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్‌, సీఐటీయూ రాష్ట్ర పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌, సీఐటీయూ, ఇతర సంఘాల జిల్లా నాయకులు మూషం రమేష్‌, పంతం రవి, కోడం రమణ, తాటిపాముల దామోదర్‌, మంచే శ్రీనివాస్‌, మండల సత్యం, వెళ్లండి దేవదాస్‌, సిరిసిల్ల రవీందర్‌, మోర రాజు, లక్ష్మీనారాయణ, వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.