– సీఏఏ అమలును లౌకికవాద సమస్యగానే చూడాలి
– మెతక హిందూత్వ ధోరణితో బీజేపీని నిలువరించలేం
– అభివృద్ధి చెందిన దేశాల సరసన కేరళ
– హిందూ ఇంటర్వ్యూలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
తిరువనంతపురం : ”ప్రస్తుతం జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలు భారతదేశ లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంపై ఒక రెఫరెండం.” అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డీఎఫ్) తీవ్రంగా ప్రతిఘటించడాన్ని మైనారిటీ లేదా మెజారిటీ సమస్యగా చూడడం తప్పని విజయన్ పేర్కొన్నారు. దానికి బదులుగా దీన్ని లౌకికవాదానికి సంబంధించిన సమస్యగా చూడాలని అన్నారు. మెతక హిందూత్వ ధోరణిని అనుసరించడం వల్ల మరింత దూకుడుతో వ్యవహరిస్తున్న బీజేపీని నిలువరించలేమని అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య పార్టీల నుంచి మితవాద పార్టీలోకి జరుగుతున్న ఫిరాయింపులనేవి కలవరపరు స్తున్నాయని విజయన్ వ్యాఖ్యానించారు. కేరళలోని 20లోక్‌సభా నియోజకవర్గాల్లో 24 రోజుల పాటు పర్యటనకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2024 పార్లమెంటరీ ఎన్నికల కీలక స్వభావాన్ని ఆయన వివరించారు. శుక్రవారం ఈ-మెయిల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
సీఏఏ అమలు గురించి కాంగ్రెస్ అసందిగ్ధతపైనే మీరు ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు కదా. సాంప్రదాయంగా యూడీఎఫ్ వైపే వుండే మైనారిటీ ఓటర్లను… ఎల్‌డీఎఫ్ లౌకిక, బీజేపీ వ్యతిరేక ఎజెండా వైపునకు తీసుకురాగలగుతారా?
ఇది మైనారిటీ లేదా మెజారిటీ సమస్య కాదు, లౌకికవాదానికి సంబంధించిన సమస్య. భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య దేశంగానే వుండడాన్ని కొనసాగించాలా లేక ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా మతపరమైన రాజ్యాల సరసన నిలబెట్టాలా? అదీ అసలైన సమస్య. భారతదేశంలో ఆనాటి వలస పాలనకు వ్యతిరేకంగా మహౌజ్వలంగా సాగిన స్వాతంత్య్ర ఉద్యమ సంగ్రామంలో అన్ని మత విశ్వాసాలకు చెందినవారు పాల్గొని పోరాడారు. అలాగే ఏ మతాన్ని విశ్వసించని వారు కూడా పోరాడారు. లౌకికవాద భారతదేశం కోసం వారు పోరు సల్పారు. అందువల్ల వారి మతపరమైన గుర్తింపు ప్రాతిపదికగా భారత పౌరసత్వాన్ని ఎవరికీ నిరాకరించరాదు. మేం ఓట్ల కోసం చూడడం లేదు. భారతదేశ లౌకికవాద గుర్తింపును పరిరక్షించడంపైనే మా దృష్టంతా వుంది.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయింపులు ఎల్‌డిఎఫ్‌ను ఆందోళనపరుస్తున్నాయా? కేరళలో కాంగ్రెస్ విచ్ఛిన్నమయ్యేలా చూడడం ఎల్‌డీఎఫ్‌కి ప్రయోజనకరం కాదని మీరు పదే పదే చెబుతున్నారు కదా. ఎందుకు కాదో కాస్త మీరు వివరించగలుగుతారా? అటువంటి పరిస్థితి కేరళలో మితవాద పార్టీకి సాధికారతను కల్పిస్తుందా?
ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని మతోన్మాద బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అన్ని లౌకికవాద, ప్రజాస్వామ్య శక్తులను ఏకతాటిపైకి తీసుకురావాలని మేం భావిస్తున్నాం. అందువల్ల దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు బలహీనపడుతున్నాయంటే అది కచ్చితంగా ఆందోళన చెందే అంశమే. ప్రజలు లౌకిక, ప్రజాస్వామ్య పార్టీల నుండి మతోన్మాద, నిరంకుశవాద పక్షాల వైపునకు మళ్ళినపుడు కచ్చితంగా అది మితవాద విభాగానికి సాధికారత కల్పిస్తుంది. మెతక హిందూత్వ విధానాలను అనుసరించడం ద్వారా బీజేపీని ఓడించడం సాధ్యం కాదు, రాజీపడని ధోరణిలో మతోన్మాద వ్యతిరేక రాజకీయ వైఖరిని అనుసరించడం ద్వారానే వారిని ఎదుర్కొనాల్సిన అవసరం వుంది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగిన వారిపై కేసులను ఉపసంహరించుకోవడం ద్వారా మీరు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, పైగా మైనారిటీ కమ్యూనిటీల్లో భయాన్ని పాదుగొల్పడం ద్వారా మతం పేరుతో ఓటర్లను విభజిస్తున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణలకు మీరు ఎలా స్పందిస్తారు?
ఏ కమ్యూనిటీలోనూ మేం భయాన్ని పాదుగొల్పడం లేదు. తమ హింసా, విద్వేష రాజకీయాలతో, విచక్షణాపూరిత విధానాలతో, సీఏఏ, ఎన్‌ఐఏ వంటి వాటిని వ్యాప్తి చేయడం ద్వారా భారత సమాజంలోని వివిధ వర్గాల మధ్య భయం నెలకొల్పుతోంది బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమినే.
నవ్ కేరళ సదస్సు మీ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత సన్నిహితం చేసిందని మీరు భావిస్తున్నారా? ఆర్థిక సమాఖ్యవాదంపై దారుణమైన ఉల్లంఘనలు, కేంద్రం యొక్క ఘర్షణాయుత వైఖరి రాష్ట్ర అభివృద్ధికి, విస్తృతమైన సామాజిక భద్రతా వ్యవస్థకు ముప్పుగా పరిణమించాయని ఓటర్లను మీ ప్రభుత్వం ఒప్పించగలిగిందా?
అవును, సంపూర్ణంగా చేయగలిగాం. కేరళ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షను మరింత ప్రశ్నించడాన్ని, ఇటువంటి వివక్షాపూరిత విధానాలను ప్రశ్నించని కేరళలోని ప్రతిపక్షమైన యుడిఎఫ్‌ను విమర్శించడాన్ని మేం చూస్తున్నాం.
విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ ద్వారా నడిచే ఆధునిక కేరళ పట్ల మీ దార్శనికత ప్రజలకు మీరు చేరువయ్యే సుస్థిరమైన అంశంగా వుంది. రాబోయే కాలంలో అక్షరాస్యత, అత్యంత నాణ్యతతో కూడిన జీవన సూచీలు కలిగిన కేరళ, నేర్చుకోవడానికి, ఉదారవాదానికి, లౌకికవాదానికి ఒయాసిస్‌గా ఆవిర్భవించగలుగుతుందని మీరు భావిస్తున్నారా?
నిస్సందేహంగా. అనేక అభివృద్ధి సూచీల్లో కేరళ ఇప్పటికే దేశానికి మార్దదర్శకత్వం వహిస్తోంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో అగ్ర భాగాన వుంది. అనేక విషయాల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసన మేం వున్నాం. కేరళలో వున్న లక్షలాదిమంది గెస్ట్ వర్కర్లు వారి స్వంత దేశాలతో పోలుస్తూ మా రాష్ట్రం గురించి ఏమంటున్నారో మేం చూస్తున్నాం. వారు ఇక్కడ మరింత మెరుగైన విద్యా, ఆరోగ్య సౌకర్యాలు, అధిక ఆదాయాలు పొందుతున్నామని చెబుతున్నారు. అందువల్ల, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ, వినూత్న సమాజంగా ఆవిర్భవించే బాటలోనే కచ్చితంగా మేమున్నాం.