ఈ దేశంలోని ప్రతి పౌరుడూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి – 1931లో విప్లవ వీరుడు భగత్‌సింగ్ పక్షాన తీవ్రంగా వాదించిన న్యాయవాది – ఆసఫ్ అలీ. భగత్‌సింగ్‌ను శిక్షించడానికి నిరాకరించి, తన జడ్జీ పదవికి రాజీనామా చేసిన జస్టిస్ – సయ్యద్ ఆగా హైదర్. ఇకపోతే భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష విధించిన జడ్జీ – రారు సాహిబ్ పండిట్ శ్రీ క్రిషన్. నరనరాన ఆరెస్సెస్ భావజాలం నింపుకున్న వ్యక్తి. ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత, లేదా గుర్తు చేసుకున్న తర్వాత ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు. అనే విషయం విజ్ఞత గల ఈ దేశపౌరులు పూర్తిగా అర్థం చేసు కుంటారు. ముస్లిం అయినంత మాత్రాన ద్వేషించాలని, హిందువులంతా బంధువులేనని అనుకోక తప్పదా? భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నది ఎవరు? పాల్గొనని వారెవరు? తెలుసుకోనక్కరలేదా? ప్రస్తుతం అధికారంలో ఉన్న వారు ప్రచారం చేస్తున్న విద్వేష భక్తి గేయాలు పాడుకోవల్సిందేనా? నిజా నిజాలు తెలుసుకునే పనిలేదా? మండిపోతున్న మణిపూర్ లాగా దేశమంతా కావల్సిందేనా? గౌరవనీయులైన మూర్ఖుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, సామాన్య పౌరులు తమ వివే కాన్ని నిద్రలేపాలి. ప్రతి చిన్న విషయాన్నీ హేతుబద్దంగా విశ్లేషించుకుంటూ ముందుకు సాగాలి. మనది ప్రజాస్వామ్య దేశం! మనుషులంతా ఒక్కటి!! ఈ రెండు విషయాలకు కట్టుబడి మాత్రమే – నిజాయితీగా నిబద్దతతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
తాము సనాతన ధర్మాన్ని గౌరవించేవారిమని, దాన్ని వ్యతిరేకించే వారి వ్యాఖ్యలు తమ మనోభావాల్ని గాయపరు స్తున్నాయని, ఆ వ్యాఖ్యలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అలాంటి లేఖ రాసిన వారికి అసలు సనాతనమంటే ఏమిటన్నది అవగాహన ఉందా లేదా అని అనుమానం వస్తుంది. సనాతనమంటే – అసమానత, సనాతనమంటే – అస్పృశ్యత, సనాతన మంటే – కులవివక్ష, సనాతనమంటే బలులు, యజ్ఞయాగాలు, బాల్య వివాహాలు, సతీ సహగమనం, దళితుల సజీవ దహనం, సనాతనమంటే- సమాజపు సగభాగపు అణచివేత. ఆధిపత్య హింస, శ్రామికుల పీడన. సనాతనమంటే – నిచ్చెన మెట్ల వ్యవస్థ. సనాతనమంటే- వర్తమానాన్ని గతం అజమాయిషీ చేయడం, సనాతనమంటే- భవిష్యత్తుకు అవరోధం. ఏ కొందరి మనోభావాలో దెబ్బతింటాయంటే, వారు తప్పక వారి ఆలోచనా సరళిని మార్చుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పిన వన్నీ నిజాలే కదా? నిజాలు కాదు, అబద్దాలు అని- ఎవరైనా నిరూపించదలిస్తే నిరూపించిన తర్వాత మాట్లాడాలి. సమకాలీనంలో కూడా సనాతనం చేసే అనర్దాలేలా ఉంటాయో చూడండి. ఎప్పుడో మొదలైన కుంభమేళాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కదా?
1760-హరిద్వార్ కుంభమేళాలో శైవులైన గోసాయన్లకు వైష్ణవులైన బైరాగులకు మధ్య కలహాలు చెలరేగి ఇరువైపులా వందల సంఖ్యలో మర ణాలు సంభవించాయి. మరాఠా పిష్యాల నాటి ఒక రాగి ఫలకం – మరికొన్ని భయం కరమైన విషయాలు వెల్లడించింది. 1789లో నాసిక్ కుంభమేళాలో సుమారు 12 వేల మంది మర ణించారు. కారణం శైవులు – వైష్ణవులు హోరా హోరీగా పోట్లాడుకుని, కోపాలు, రోషాలు చల్లా రక చంపుకోవడం దాకా వెళ్ళింది. మేమంటే మేం – ముందు స్నానం చేయాలని గొడవపడి, అది పెద్దదై శత్రువుల్లాగా ఒకరినొకరు చంపుకు న్నారు. ఇరుపక్షాలవారు కలిసి మొత్తం 12వేల మంది పుణ్య స్నానాల పేరుతో ప్రాణాలు త్యాగం చేశారు. మతం పిచ్చి తలకెక్కితే అంతే! అలాగే మరికొంత కాలానికి 1796 – హరిద్వార్ కుంభమేళాలో మరోసారి హింస చెలరేగింది. ఉవులకు, ఉదాసీలకు మధ్య సామాను రవాణాకు సంబంధించి, వారి వారి హక్కులకు సంబంధించి సహనం కోల్పోయిన భక్తు లు యుద్ధవీరులై పోయారు. భక్తులు మానవత్వం మీద చెరగని మచ్చలుగా మిగిలారు తప్పితే, మత కలహాలతో ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా పొంద గలిగారా?
లోక కళ్యాణం గురించి, ప్రశాంత జీవన మార్గం గురించి, సత్ప్రవర్తన గురించి జనానికి బోధలు చేసే సన్యాసులు, సాధు వులు, భైరాగులు యుద్ధాలకు దిగడం ఏమైనా బావుందా? అంటే వారు – సర్వసంగ పరిత్యాగులుగా వేషం మార్చారే గాని, తమలోని అహాన్ని జయించలేక పోయారని మనకు అర్థమౌతుంది. అలాంటి వారి నుండి సామాన్యులు నేర్చుకు నేది ఏముంటుందీ? వారిని అని లాభం లేదు. సామాన్యులే వాస్తవాలు గ్రహించాలి. అలాంటి సన్యాసులు దొంగ యోగులు సమాజానికి కాదు కదా, వారికి వారే ఉపయోగం లేనివారు. అలాంటి వారిని సామాన్యులు నమ్మకూడదు. వారి బూటకపు ఆధ్యాత్మికతకు ప్రభావితులు కాకూడదు. అలాంటి వారిని దూరం పెట్టాలి. సమాజ శ్రేయస్సుకు పాటుపడిన మహనీయుల గూర్చి తెలుసుకుంటూ ఉండాలి. వారి మార్గం లో నడవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దైవమే లేనప్పుడు దైవం పేరు చెప్పి, సంస్కృతి సంప్రదాయాల పేరు చెప్పి, మోసం చేసే వారిని నమ్మడం అవసరమా? ఆలోచించాలి కదా? మన దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే పెళ్ళాన్ని చంపి నోడు సద్గురువు అయ్యాడు. పెళ్ళాన్ని వదిలేసినోడు విశ్వగురువు అయ్యాడు. చిన్న విషయం కూడా నేర్చుకుం దామన్న తపన లేనోళ్ళంతా ఈ దేశంలో గురువులు కావాలని తహతహలాడుతుంటారు. అసలైతే వేలిముద్రగాడు, కానీ బింకంగా పరిక్షలపై చర్చ అంటూ వచ్చి కూర్చుంటాడు-
”ఆలి నేల లేని అసమర్థుడెట్లౌను/ ప్రజల నేల గల్గు ప్రాజ్ఞ వరుడు?/ ప్రాకలేని బుడత పరుగెత్త నేర్చునా/ వాస్త వమ్ము నార్లవారి మాట” – అని అన్నారు తెలుగు కవి, రచయిత, ప్రసిద్ధ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు – చాలా కాలం కిందట! ఇప్పుడీ విషయమే రివర్స్‌లో చూస్తు న్నాం. ఆలినేలుకోలేని వాడు దేశాన్ని ఏలుతున్నానన్న భ్రమలో బతుకుతున్నాడు. ఉదాహరణకు 2014లో రూపాయికి డాలర్ మారకం విలువ 60.99 అదే 2023లో 83.15 అయ్యింది. పరిస్థితి ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ప్రధాని అతని సహచరులంతా దేశం ఆర్థిక ప్రగతి సాధించిందని దబాయిస్తారెందుకూ? వారికెవ్వరికీ కళ్ళూ, చెవులూ పని చేయడం లేదా? అందుకే కాబోలు మణిపూర్‌లో ప్రధాని మోడి ఫొటోతో పోస్టర్లు వెలిశాయి. దాని కింద ఒక వాక్యం ఉంది. ”ఈయనకు కళ్ళు కనబడవు. చెవులు వినబడవు. ఇక్కడ మా మణిపూర్ మండిపోతున్నా ఆయనకు పట్టదు. విదేశాలకు పారిపోతుంటాడు” అని!
వీఉణ× అనేది ఇంటిపేరు కాదు, ఆయన విద్యా ర్హతలు. మాస్టర్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా-అని ఆయన అనుయాయులు ప్రచారం చేసుకుంటున్నది నిజం. కాని, హై స్కూల్ చదువు పూర్తి చేయనివాడు లోపాయికారిగా యం.ఎ. డిగ్రీ సంపాదించాడని ఈ దేశ ప్రజలకు తెలుసు. డబ్బు గుప్పించి నమ్మకంగా పడి ఉండేవాణ్ణి రెండుసార్లు ప్రధాని సీట్లో కూర్చోబెట్టిన కార్పోరేట్లకు తెలుసు. అందుకే ఆయన వారికి అతివిధేయుడిగా ఉన్నాడు. బిబిసి డాక్యుమెంటరీయే కాదు, ప్రపంచవ్యాప్తంగా 14 అంతర్జాతీయ పత్రికలు ఈయన అసమర్థత గూర్చి పూర్తి వివరాలు వెల్లడించాయి. ”కుట్ర చేయడం ఎంతతెలివిగా చేయాలంటే ఎదుటివారికి ఏ మాత్రం తెలియకూడదు. పైగా తనకు తానుగా వచ్చి కుట్రలో ఇరుక్కోవాలి. బలై, భస్మమైపోవాలి”- అని అన్నాడు విన్సెంట్ చర్చిల్. చర్చిల్ ఎప్పుడో చెప్పిన విషయాన్ని ఈ దేశ ప్రధాని ప్రజలమీద ప్రయోగిస్తున్నాడు. నిజం చెప్పుకోవాలంటే విప క్షాల అనైక్యత వల్ల ఆయన కొనసాగాడు తప్పించి, స్వీయ ప్రతిభతో రాణించింది ఎప్పుడూ ఎక్కడా? గజరాత్ గాయం, మణిపూర్ గాయం. దేశమంతా గాయాలమయమై పోతోంది. నిజమే! ఈ విషయం మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి!
దేశం కోసం – ధర్మం కోసం ఈ దేశ ప్రధాని చేస్తున్న అనేక సంస్కరణల్లో – గ్యాస్ సిలిండర్ ధర పెంచడం కూడా ఒకటి అని ఆ ఫలానా పార్టీ నాయకులు తెగ ప్రచారం చేస్తు న్నారు. వారి వాదన ఏమిటో ఎంత సబబుగా ఉందో ఆలో చించండి. విషయం మీకే బోధపడుతుంది – ”సిలిండర్లలో నింపేగ్యాస్ భూమి లోపల నుండి తీస్తారు. అలా గ్యాస్ తీయడం వల్ల మొక్కలకు లోపల నుండి అందాల్సిన ఆక్సిజన్ అందదు. దాని వల్ల చెట్లు పెరగవు. సుమారుగా ఒక రాష్ట్రా నికి 54 లక్షల సిలిండర్లు అవసరమౌతాయంటే, ఇక దేశం మొత్తానికి ఎన్ని కావాలో లెక్క కట్టండి. గ్యాస్ సిలిండర్ ధర పెంచడం వల్ల, భారం మోయలేక చాలా మంది కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళతారు. వారు అక్కడ శుభ్రమైన గాలి పీల్చుకుంటారు. దానివల్ల మేలు జరిగినట్టేకదా? వంట చెరకు కొట్టి తెచ్చుకుని కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు. కట్టెలపొయ్యి వల్ల పొగ వస్తుం ది. ఆ పొగ వాతావరణంలో ఎక్కువ శాతంగా ఉన్న ఆక్సిజన్‌ను తగ్గిస్తుంది. అంటే, దాని వల్ల వాతావరణ సమతుల్యం కాపాడబడుతుంది. కదా? దానివల్ల మేలు జరిగినట్టే కదా? కట్టెల పొయ్యి మీద వంట చేసుకున్న మన పూర్వీకులు రోగాలు రొష్టులూ లేకుండా ఆరోగ్యంగా ఉండే వారు కదా? కట్టెల పొయ్యి ఉపయోగంలో లేనం దువల్లనే ఈ రోజుల్లో రోగాలు నానాటికీ ఎక్కు వవుతున్న విషయం అందరూ గ్రహించాలి! ఇవ న్నీ దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఆరోగ్యం కాపా డడం కోసమే మోడి సిలిండర్ ధర పెంచారు. ఆయన ఏ పని చేసినా దేశం కోసం, ధర్మం కోసమే చేస్తారన్నది ఈ దేశ ప్రజలు అర్థం చేసు కోవాలి”- ఫలానా పార్టీవారు చేస్తున్న ప్రచారం లో నిజానిజాలు దేశ ప్రజలే గ్రహించుకోవాలి! దేశం ఎంత ముందుకు పోతోందన్నది బేరీజు వేసుకోవాలి.
”దేశమును ప్రేమించుమన్న/మంచి అన్నది పెంచు మన్న” – అన్న గురజాడ అప్పారావు (1862 – 1915) మనకు తెలుసు. ”మతములన్నియు మాసిపోవును/ జ్ఞాన మొక్కటి నిలిచి వెలుగును” అని అన్నది కూడా ఆ మహాను భావుడే. ”చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడవవలె నోరు / అన్నదమ్ములవలెను జాతులు/మతములన్నియు మెలగవలెనోరు” – అని ఆశించారాయన! అందుకు వ్యతి రేకమైన భావజాలాన్ని ఇప్పుడు ఒక గుజరాత్ అప్పారావ్ ద్వేషభక్తి గీతం పాడుతున్నాడు. జ్యోతిబసు పేరుతో ఎవరో నాకు ఆ పేరడీ గేయం పంపించారు. అది నా పాఠకుల కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను ”మతమునే ప్రేమించు మన్న/ హింసయన్నది పెంచుమన్న/ వట్టి మాటలు చెప్పు కోవోరు/ చేయు మేలుని కట్టిపెట్టోరు/ దేశాభిమానమె నాకె కద్దని/ వట్టి గొప్పలె చెప్పుకోవోరు/ దేశమంటే జనం కాదోరు/ దేశమంటే మతంమయమోరు/ హిందు మతమే రాజ్యమేలగ/ దారిలో నువు పాటు పడవోరు/ తతిమ జాతులు మతములన్నీ/ అణిగి మణిగి మెలగవలెనోరు// స్వంతలాభమె అంతయనుకుని/ ప్రజలనందరి ముంచవలె నోరు/ జాతి ఆస్థులు కట్టగట్టి/ దత్తపుత్రుల కట్టబెట్టోరు // విజ్ఞాన మంతయు రాతి యుగపు/ గ్రంథమయమని బొంక వలెనోరు/ రోదసీ నౌకకి సైతం/ దిష్టి టెంకారు కొట్ట వలెనోరు/ అంబేద్కరు గాంధీ ఇజాలకు/ పైపై డప్పు కొట్ట వలెనోరు/ మత సామరస్యం చావుకోసం/ లోన గోతులు తీయవలెనోరు” అధికారంలో ఉన్నవారు పాడుతున్న ఈ ద్వేషభక్తి గేయం దేశానికి ఎంతగా గాయం చేస్తుందో.. సామాన్య పౌరులు అర్థం చేసుకోవాలి! ‘భారత్ జోడో – సఫ్రత్‌జోడో! భారత దేశ సమగ్రతను కాపాడదాం! విద్వేష భావాన్ని విడనాడుదాం!! ‘ఇదే నేటి మన కర్తవ్యం.
– సుప్రసిద్ద సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్
డాక్టర్ దేవరాజు మహారాజు