అటూ ఇటూ స్వేచ్ఛకే దెబ్బ

వేమన అన్నట్టు చిత్తశుద్ధి లేకుండా చేసే పనిఏదైనా పక్కదోవపట్టడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా దేశాన్ని పాలించే ప్రభుత్వాధినేతల విషయంలో ఇది మరింత సత్యం. విధానాలు చట్టాల రూపకల్పనలో మౌలికంగా ఉద్దేశం మంచిదైతే ఫలితం ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తుకు మార్గదర్శకమవుతుంది. దుర్నీతితో వ్యవహరిస్తే చెప్పేదొకటి చేసేదొకటిగా పరిణమిస్తుంది. నరేంద్రమోడీ ప్రభుత్వ హయాంలో చాలాసార్లు ప్రకటిత లక్ష్యాలకు, కనిపించే ప్రభావాలకు పొంతనలేకుండా పోవడం రివాజుగా మారింది. దేశభక్తి, ప్రజాశ్రేయస్సు వంటి గంభీరోక్తులతో తీసుకొచ్చే చట్టాలు, చేసే నిర్ణయాలు ఆచరణలో ప్రజాకంటంకంగా తయారవుతున్నాయి. వీటిపై పోరాటాలు చేయవలసి వస్తున్నది. అందులోనూ దేశపౌరుల ప్రాథమిక హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛలకు అడుగడుగునా ఆటంకాలు తప్పడం లేదు. భిన్నమైన కోణాలలో తీసుకొస్తున్న రెండు చట్టాల రూపురేఖలు కూడా ఆచరణలో ప్రజాస్వేచ్ఛకు, హక్కులకు భంగకరంగా మారడం ఈ క్రమంలో తాజా పరిణామం. మొదటే చెప్పినట్టు అసలు ఉద్దేశం కుట్రపూరితం గనక జరుగుతున్న విపరీతమిది. ఈ రెండు చట్టాలు కూడా ప్రజారక్షణ స్వేచ్ఛ పేరుతోనే తీసుకురావడం మరింత విపరీతం. ఇందులో ఇకటి డిపిడిపి అనే డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్‌2023. మరొకటి ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌ (ఎఫ్‌సియు) ముసాయిదా. వీటిపై న్యాయస్థానాలు, న్యాయమూర్తులే ఆందోళన వెలిబుచ్చుతున్న పరిస్థితి.
డేటా పరిరక్షణ సవాలు
ముందు డేటా పరిరక్షణ చట్టం తీసుకుందాం. ఇదిప్పుడు అంతర్జాతీయ సమస్య. మామూలు మనుషుల నుంచి ప్రముఖుల వరకూ ప్రతిఒక్కరి వ్యక్తిగత వివరాలు చిన్నచిన్న అంశాలతో సహా డేటా అపహరించబడుతున్నది. మనం ఒక చొక్కా కొంటే వెంటనే మనకు మరిన్ని బ్రాండ్ల చొక్కాల గురించి సమాచారం వచ్చేస్తుంది. మనం యూట్యూబ్‌లో ఒక విడియో చూస్తే మరుక్షణంలో అలాంటి విడియోలే వరుసగా వచ్చేస్తున్నాయి. ఒక బ్యాంకులో రుణంకోసం ప్రయత్నిస్తే మేము అప్పిస్తామంటూ మరిన్ని సందేశాలు. ఒక రోజు టికెట్‌ బుక్‌చేసుకుంటే వెంటనే దానికి సంబంధించిన మెసేజ్‌లు. మందుల గురించీ, ఇండ్ల గురించి. ఒకటేమిటి… రాజకీయంగానూ మీ భావాలను బట్టి సందేశాలు. కొన్నిసార్లు ఫోన్‌కాల్స్‌, ఇదంతా ఎలా జరుగుతుంది? బిగ్‌ డేటా చౌర్యం వల్లనే, ఆధార్‌ కార్డు సమాచారం అమ్ముతామని బేరాలు పెట్టి దొరికిపోయిన వారిగురించి చూశామంటే ఈ కారణం వల్లనే, పెగాసిస్‌ మాల్‌వేర్‌ గురించిన కథనాలు కొంతకాలం కిందట ప్రపంచ వ్యాపితంగా సంచలనమయ్యాయి. దానిపై సుప్రీంకోర్టు విచారణ జరిపి వేసిన కమిటీ ఏదో సాంకేతికమైన నివేదిక ఇచ్చి ముగించింది. ప్రభుత్వం నేరుగా చెప్పకుండా తప్పించుకుంది. పాత్రికేయులు మీడియా వ్యక్తులు ప్రతిపక్ష నాయకుల డేటా పైన నిఘా వేసేందుకే ఇజ్రాయిల్‌ దగ్గర పెగాసిస్‌ కొన్నట్టు వెల్లడైంది. చివరకు ఇది ఆ దేశ పార్లమెంటులోనూ రభసకు దారితీసింది. ఈ డేటాతో ఎన్నికల మార్కెటింగ్‌, వాణిజ్య, వివిధ రకాల సేవలందించే సంస్థలు మన వివరాలు తెలుసుకుంటున్నాయనేది అందరికీ అనుభవమే. సోషల్‌ మీడియాలో పాలకపార్టీలు వాటితో యుద్ధం చేసుకుంటాయి. అయితే ఈ క్రమంలో పౌరుల వ్యక్తిగత వివరాలు కూడా బహిర్గతమై గోప్యత అంటూ లేకపోవడం అభద్రతకు కారణమైంది. దాంతో డేటా పరిరక్షణ బిల్లు ముసాయిదా రూపొందించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బిఎన్‌ శ్రీకృష్ణ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. (ఆంధ్రప్రదేశ్‌ విభజన సమస్యపై కమిటీకి ఈయనే నాయకత్వం వహించారు) ఈ కమిటీ అనేక సూచనలు సిఫార్సులు చేసింది. 2018లో వారు తమ నివేదిక సమర్పించారు. దానిపై విస్తారమైన చర్చ జరిగింది. కాని ప్రభుత్వం అమలుకు చర్యలు తీసుకోలేదు. తర్వాత దాన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపారు. ఈలోగా పెగాసిస్‌ వంటి సంచలనాలు బయిటకువచ్చాయి. ఆ సమయంలో జస్టిస్‌ శ్రీకృష్ణ మాట్లాడుతూ డేటా పరిరక్షణ బిల్లు గనక అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఎందుకంటే డేటా పరిరక్షణకు అందులో ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని కొన్ని పద్ధతులను ప్రతిపాదించారు.
ప్రాథమిక హక్కులకే భంగం
చాలా కాలం గడిచిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం డిపిడిపి పేరిట ఈ బిల్లు ముసాయిదా విడుదల చేసింది. ఈ నెలలో మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెడతారని భావిస్తున్నారు. సామాన్య పౌరులు కూడా తమ డేటా ఎవరో సంగ్రహించారని అనుమానం కలిగితే నిపుణుల కమిటీకి ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. కాని ఇందులో ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండాచేసింది. దీనిపై అనేక అభ్యంతరాలు, అనుమానాలు వచ్చాయి. మరెవరో కాకుండా సాక్షాత్తూ జస్టిస్‌ శ్రీకృష్ణ తీవ్ర విమర్శ చేశారు. ‘ఈ బిల్లు వ్యక్తిగత ఆంతరంగిక డేటాలో ప్రభుత్వం తల దూర్చడానికి ఎక్కడలేని అవకాశమిస్తుందని’ ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల జోక్యానికి మినహాయింపు ఇవ్వడం చాలా ఆందోళన కలిగిస్తున్నది. ఇందులో డేటా గోప్యతకు సంబంధింది వ్యక్తుల స్వేచ్ఛకు. ప్రాథమిక హక్కుకు రక్షణ ఇవ్వడం కంటే ప్రభుత్వ విశృంఖల జోక్యానికి అవకాశమే ఎక్కువగా ఉందని ఆయనన్నారు. ఈ యంత్రాంగానికి బాధ్యుడుగా నియమించబడే అధికారి ప్రభుత్వ కీలుబొమ్మలా ఉండాల్సిందే. 2018 ముసాయిదాలో మేము క్రియాశీలమైన, స్వతంత్రమైన నియంత్రణాధికారి ఉండాలని ప్రతిపాదించాం. కాని ఇందులో వారి అర్హతపదవీ కాలం ప్రతిదీ ప్రభుత్వ నిర్ణయం మేరకే జరగాల్సి ఉంటుంది. ఇదిగత బిల్లుకన్నా దారుణంగా ఉంటుంది అని స్పష్టం చేశారు. ఏదైనా నేరాన్ని లేదా చట్ట ఉల్లంఘనను అడ్డుకోవడానికి, దర్యాప్తు చేయడానికి అవసరమైన సందర్భాల్లో ఈ చట్టం వర్తించదు. న్యాయస్థానంలో ట్రిబ్యునల్‌లో లేదా మరేదైనా న్యాయసంబంధమైన వ్యవహారంలో కూడా డేటా తీసుకోవచ్చునని వెసులుబాటు కల్పిస్తున్నది. ఇంతా చేసి ఒకవేళ ఏదైనా ఉల్లంఘన జరిగితే జరిమానా 500రూపాయలు మాత్రమేనట!
సర్కారు చెప్పేదే సత్యమా?
ఇది స్వయంగా ముంబాయి హైకోర్టుకు వచ్చిన సందేహం. మీడియాలో సోషల్‌ మీడియాలో ఫేక్‌ వార్తలను నియంత్రించే పేరిట ప్రెస్‌ ఇన్ఫ్‌ర్మేషన్‌ బ్యూరో(పిఐబి), ప్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌(ఎఫ్‌సియు) ఏర్పాటు చేసేందుకు అధికారమిస్తున్న నిబంధనపై హైకోర్టు విచారణ చేపట్టింది. సోషల్‌మీడియా ఇంతగా విస్తరించకముందు ఇన్ఫర్మేషన్‌ చట్టం 2000 సెక్షన్‌69(1) పనిచేస్తూ వచ్చింది. మారిన పరిస్థితులలో ఆ చట్టం సరిపోలేదని 2019లో ఫేక్‌ వార్తల అదుపునకు పిఐబి కమిటీని వేశారు. 2021లో కొత్త సవరణ తీసుకొచ్చారు. వాటి ప్రకారం బనాయించిన అనేక కేసులు సుప్రీం కోర్టు ముందు విచారణలో ఉన్నాయి. చాలాసార్లు అత్యున్నత న్యాయమూర్తులే వీటిపై విమర్శలు చేశారు. కేంద్రం తన వైఖరి చెప్పాలని తాఖీదులిచ్చారు. కేంద్రం ఆరునెలల గడువు కోరింది. ఈ కాలంలో ఆ ఆంక్షలు అమలులో ఉండవని సుప్రీంకోర్టు ప్రకటించింది. మరోవైపు 2021 సమాచార సాంకేతిక పరిజ్ఞానం నిబంధనల సవరణ ముసాయిదాలో వ్యూహాత్మకంగా కేంద్రం కొత్త ఎత్తు ఎత్తింది. ఆ ప్రకారం పిఐబి నియమించే ఫేక్‌వార్తల నియంత్రణ కమిటీ లేదా ప్రభుత్వం అందుకోసం నియమించే మరేదైనా కమిటీకి ఏకపక్ష నిషేద అధికారం కల్పించారు. పైకి చెప్పడానికి ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిరోధించడానికి ఈ చట్టం తెచ్చామన్నారు. కానీ సోషల్‌ మీడియా వేదికలలో అంటే యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, ఓటిటి వంటివాటిలో వచ్చిన వార్తా కథనాలు(కంటెంట్‌) అవాస్తవమైతే వాటిని తొలగించే అధికారం పిఐబికి ఉంటుందని ప్రతిపాదించారు. వాటిని తీసేయవలసిందిగా ఆదేశిస్తే మధ్యంతర వ్యవస్థలైన అగ్రిగేటర్లు (యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, ఓటిటి సంస్థలు) అమలు చేయవలసి ఉంటుంది. కాని ఏది నిజమో, ఏది బూటకమో నిర్ణయించేది ఎవరు? వాటికి కొలబద్దలేమిటి? ఇదే ప్రశ్న హైకోర్టు అడిగింది. మీరుచెప్పిందే సత్యమా? సత్యానికి ప్రభుత్వం గుత్తాధిపత్యం కలిగివుందా అని నిలదీశారు న్యాయమూర్తి గౌతంపటేల్‌. భిన్నాభిప్రాయాలు వస్తే వివరణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అంతేగాని నిజానిజాలను భిన్న విధానాలు విలువలను నిర్థారించే అధికారం రాజ్యాంగం ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. నచ్చని పార్టీల అభిప్రాయాలను అడ్డుకున్న ఉదాహరణలు గతంలో ఉన్నాయి. ఆ ప్రకటనలు సరైనవికావని ఎవరైనా ఎడిటర్‌ నిర్థారణ చేసి వాటిని ఆపితే మీ ఫ్యాక్ట్‌కమిటీ ఆ నిర్ణారణను తోసిపుచ్చవచ్చు కదా! అప్పుడేమవుతుంది? అని జస్టిస్‌ భాటియా ప్రశ్నించారు. విచారణకు హాజరైన మీడియా సంస్థలతరపు న్యాయవాది కూడా ఇది స్వేచ్ఛకు భంగకరమైన ఆలోచన అని గట్టిగా వాదించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది సమర్థనకు తంటాలు పడ్డారు. సోలిసిటర్‌ జనరల్‌ కూడా పాల్గొనబోతున్నారు.
గతంలో జరిగిందేమిటి?
ఈ చర్చ ఇంత లోతుగా జరగడానికి బలమైన కారణాలున్నాయి. గతంలో నియమితమైన పిఐబి కమిటీ అనుభవం తీసుకుంటే చాలా దారుణంగా ఉంది. అనేకసార్లు ఈ కమిటీ కొన్ని వార్తలు ఫేక్‌ బూటకమని ప్రకటించింది. కాని దాని ప్రకటనలే అవాస్తవాలని తేలింది. 2020 డిసెంబరులో కేంద్ర నిఘా విభాగం(ఐబి) తరపున విడుదలైన నియామకాలకు సంబంధించిన అడ్వర్‌టైజ్‌మెంట్‌ బూటకమని గొప్పగా ప్రకటించింది. తర్వాత చూస్తే అది అధికారికంగా ఇచ్చిందేనని తేలింది. పిఐబి తన ట్వీట్‌నే తొలగించుకోవాల్సి వచ్చింది. కరోనా సమయంలో ఆర్నాబ్‌ గోస్వామి వంటివారు వలస కార్మికులు తరలిపోతున్న ఫొటోను మసీదు బ్యాక్‌గ్రౌండ్‌తో ఇవ్వడం ఎంత కలవరం కలిగించిందో గుర్తుండే ఉంటుంది. కరోనా కాలంలో ఢిల్లీలోని తబ్లీగీ జమాయత్‌ మర్కజ్‌ సంస్థలో ఏమి జరిగింది? ఈ విషయంలో అప్పట్లో ప్రధానితో సహా చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు ఎలావున్నాయి? మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, తప్పుడు కథనాలు వదలడంపై చివరకు సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్రాస్‌ ఘటనలోనూ బూటకపు చిత్రాలు వచ్చాయి. నిజమైన ఫొటోలు మార్ఫింగ్‌ ఫొటోలు పక్కపక్కనే చాలాసార్లు ప్రచురితమైనాయి. (ఇలాంటి దారుణమైన అనుభవాలు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్నాయి. వాటిలోకి వెళితే ఎవరు ఏమిటి అన్నది మరో వివాదమవుతుంది.) విచిత్రమేమంటే పిఐబి ఏర్పాటు చేసిన కమిటీ పరివార్‌ ప్రచారాల వాటి జోలికి పోయిందే లేదు. హైకోర్టు అడిగినట్టు తాము చెప్పిందే సత్యమని, తమ తప్పులను విమర్శించేదంతా అసత్యమని పిఐబి ద్వారా కేంద్రం నియంత్రణ చేయడం అనుమతించరానిది. ఎన్నికల సమయంలో మరీ ప్రమాదం. ఈ కేసు విచారణ సరైన తీర్పుకు దారితీస్తుందని ఆశించాలి. కనుక డేటా రక్షణ అన్నా సత్యశోధన అన్నా జరిగేది మాత్రం స్వేచ్ఛకు ఎసరు పెట్టడమే. అందుకు వ్యతిరేకంగా పోరాడితేనే ప్రజాస్వామ్యం వ్యక్తిగత గోప్యత, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోగలం.
– తెలకపల్లి రవి