ఇది…అవమానమే!

This is...a shame!కరడుగట్టిన నేరస్తుల్లా చేతులు, కాళ్లకు సంకెళ్లు.. సరుకుల రవాణా చేసే సైనిక విమానాల్లో కుక్కేసిన మూటల్లా సుమారు ముప్పై గంటలకు పైగా ప్రయాణం.. ఇది మన దేశ వలసదారుల తరలింపుపై అమెరికా అమానుష వైఖరి. ఒక వైపు భారత్‌తో తమకు స్నేహ సంబంధాలున్నాయని చెబుతూనే మనవారిని అవమానకరంగా, అమానవీయంగా మన దేశానికి పంపింది. అయినా ‘మేరా భారత్‌ మహాన్‌’ అని ఉపన్యాసాలు దంచే మోడీ గొంతు మాత్రం కనీసంగా కూడా పెగల్లేదు. పైగా, అక్రమ వలసలు కాబట్టి ఈ గెంటివేతను సగౌరవంగా స్వాగతిస్తున్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఘనంగా పార్లమెంట్‌లోనే ప్రకటించారు. అమెరికా అమానవీయ వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపచేయడం భారత ప్రజల మనోభావాల వ్యక్తీకరణే! ట్రంప్‌ తన తలతిక్క నిర్ణయాలతో మన దేశ ప్రయోజనాలకు చిల్లు పెడుతున్నా సరే, చిన్నపాటి స్పందన కూడా చూపనిది మన ప్రధాని మోడీనే. అనేక దేశాలు వలసదారులైన తమ ప్రజల పట్ల అమెరికా అమానుష చర్యల్ని వ్యతిరేకించాయి. కానీ మన ”విశ్వగురు” మాత్రం ఆ సాహసం చేయలేకపోయారు. కొలంబియా లాంటి దేశాలకు ఉన్న తెగువ, ధైర్యం కూడా మన ప్రధానికి లేవా? ప్రశ్నించడం చేతకాదా? అన్న సందేహలు కలుగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడి ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలు అనాగరికం అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ట్రంప్‌ నిర్ణయాలు ఆ దేశాన్ని గొప్పగా మారుస్తాయో లేదో గానీ ఇతర దేశాల రాజకీయ, ఆర్థిక, భౌగోళిక స్థితుల్ని తలకిందులు చేస్తున్నాయి. ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యపై అధ్యక్షుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపడం. ఒకప్పుడు వలసల్ని ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ ఆర్థిక శక్తిగా మారిన దేశం అది. నేడు అదే వలసల్ని అరికట్టాలని అనుకోవడం కేవలం వారి స్వార్ధమే. అక్రమంగా వచ్చిన వాళ్ళని ఆపడం, వెనక్కి పంపించడంలో ఎవరికీ ఆక్షేపణ, అభ్యంతరం ఉండనక్కర లేదు. కానీ వారిని పంపిన తీరే అమానవీయం. తాము కఠినంగా ఉన్నామని చెప్పుకోడానికి ఇంత తీవ్రంగా వ్యవహరించనక్కరలేదు. మన దేశం ఈ విషయమై అభ్యంతరం వెలిబుచ్చి, వారిని ఉన్నంతలో మర్యాదగా తీసుకురావడానికి కృషి చెయ్యాల్సింది. ఆ దిశగా మన ప్రభుత్వం ఆలోచన కూడా చేయకపోవడం శోచనీయం.
మొన్న బుధవారం అమృత్‌సర్‌కు తిరిగొచ్చిన వారందరూ మెరుగైన ఉపాధికోసం అమెరికా బాటపట్టినవాళ్లే. ఆస్తులు తాకట్టుపెట్టి, అందిన చోటల్లా అప్పులు చేసి ఏజెంట్లకు డబ్బులు ధారపోసి మరీ అక్కడికి వెళ్లారు. అలా ఏ దేశంలోకైనా దొడ్డిదారిలో ప్రవేశించడం సమర్థనీయం కాదు. అలాంటి వారిని తిప్పి పంపడంలో కర్కశత్వం ప్రదర్శించడమూ సమంజసం కాదు. యుద్ధఖైదీల పట్ల కూడా అమానుషంగా వ్యవహరించరాదన్నది నాగరిక ప్రపంచ కట్టుబాటు. ఈ కట్టుబాట్ల సంగతి అటుంచితే కనీస మానవత్వం కూడా చూపించని ట్రంప్‌ సర్కారు పోకడలు గర్హనీయమైనవి!
స్వదేశీ దోపిడీ ప్రభుత్వ విధానాలపై ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పోరాడడానికి బదులు విదేశీ వ్యామోహంతో లక్షలాది మంది విద్యాధిక యువతీ యువకులు అమెరికా, యూరోప్‌, కెనడా, ఆస్ట్రేలియా వంటి సుదూర దేశాలకు వెళ్లడం తెలిసిందే. దేశం విడిచి వెళ్ళడానికి ప్రధాన కారణం కుహనా స్వదేశీ పాలక వర్గాల విధానాలే! అలా వెళ్లిన మన యువతకు పరాయి నేలపై ఎన్ని అవమానాలో, ఎన్నెన్ని పరాభవాలో! నేడు ట్రంప్‌ అధికారానికి రావడంతో అవి పరాకాష్టకు చేరాయి. అక్రమ వలసదార్ల వల్ల అమెరికన్‌ కార్పొరేట్లు ఇన్నాళ్లు భారీ లాభాలు గడించారు. వారి రంగు నలుపైనా, చట్టం అక్రమ వలసదార్లని చెప్పినా, వారి సాంకేతిక నైపుణ్యం అమెరికన్‌ కార్పొరేట్లకి అంటరానిది కాదు. ట్రంప్‌ సర్కార్‌ వచ్చాక మన వాళ్ళను క్రిమినల్స్‌ లా వేటాడి నిర్భంధించింది. సంకెళ్ళతో అమెరికా సైనిక విమానాల్లో కుక్కి అమృత్‌సర్‌లో పడదోసి వెళ్ళింది. అది ఆ 104 మందిని కాదు, 140 కోట్ల భారత ప్రజల్ని అవమానించడమే.
మోడీ, బీజేపీ వల్లె వేస్తున్న ‘వికసిత భారత్‌’లో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరుకుంది. ప్రధాని అభ్యర్ధిగా 2014 ఎన్నికల్లో యువతకు మోడీ ఇచ్చిన ప్రధాన హామీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు. ఇప్పటి వరకు ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే నిరుద్యోగిత ఎందుకు కట్టలు తెంచుకుంటుంది? స్టార్టప్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా నినాదాలు గాలిలో కలిశాయి. చివరికి ఎక్కడిదాకా వచ్చిందంటే, విధిలేక వీధుల వెంట పకోడీలు అమ్ముకునే పని కూడా ఉపాధి, ఉద్యోగం కిందికే వస్తుందనే స్థాయికి ప్రధాని భాష్యాలు చెప్తున్నారు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువత ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలనేకం. బీజేపీ ప్రచారం చేసుకునే ‘అచ్చేదిన్‌’ వచ్చి ఉంటే ఇంత మంది యువత విదేశాలకు సక్రమంగానో, దొడ్డి దారినో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా? ఈ తర్కాన్ని యువత గ్రహించాలి.