– దేశవ్యాప్తంగా ఎస్‌కెఎం కిసాన్ ట్రాక్టర్ పరేడ్ విజయవంతం
– 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 484 జిల్లాల్లో కవాతు
– కార్పొరేట్ దోపిడీ అంతం, లౌకిక ప్రజాస్వామ్య రక్షణకు ప్రతిజ్ఞ
– ఎన్నికల వాగ్దానాన్ని ఉల్లంఘించి రైతులకు సర్కారు ద్రోహం
– దేశంలో ఎన్నడూ లేనంత రైతు వ్యతిరేక ప్రధాని మోడీ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కార్పొరేట్ దోపిడీని అంతం చేయడానికి, వ్యవసాయాన్ని, దేశాన్ని రక్షించడానికి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చిన కిసాన్ ట్రాక్టర్, వాహన కవాతు దేశమంతటా రైతుల, కార్మికుల భాగస్వామ్యంతో విజయవంతంగా జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పదివేల ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో లక్షలాది మంది రైతులు కవాతులో పాల్గొన్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 484 జిల్లాల్లో కవాతు జరిగింది. పంజాబ్, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ట్రాక్టర్, వాహన కవాతు విజయవంతమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తితో ముందుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులు, కార్మికులకు ఎస్‌కేఎం అభినందనలు తెలిపింది.
పరేడ్‌లో పాల్గొన్నవారు మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా లౌకిక, ప్రజాస్వామ్య స్వభావాన్ని బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలుచేస్తే ప్రజల విస్తృత, బలమైన ప్రతిఘటనను ఎదుర్కొంటుందని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని ఎస్‌కేఎం విమర్శించింది.
2021 డిసెంబర్ 9 నాటి రాతపూర్వక హామీని, అన్ని పంటలకు గ్యారెంటీ సేకరణతో పాటుగా సి2ప్లస్ 50 శాతంతో కూడిన ఎంఎస్‌పీ సహా రైతుల ఇతర ముఖ్యమైన డిమాండ్‌లను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి రైతుల పోరాటంలో ఇది భాగమని ఎస్‌కేఎం పేర్కొంది. రైతు, వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ, విద్యుత్ రంగ ప్రైవేటీకరణను నిలిపివేయడం, ప్రీ-పెయిడ్ మీటర్ల ఏర్పాటు నిలిపివేయటం, ఇన్‌పుట్‌ల ఖర్చు తగ్గించడం, ప్రభుత్వ నియంత్రిత సాధారణ, సార్వత్రిక పంటల బీమాను నిర్ధారించడం, లఖింపూర్ ఖేరీ రైతుల హత్యాకాండకు ప్రధాన కుట్రదారుడు కేంద్ర హౌం వ్యవహారాల సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా తొలగింపు, ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్ చేసింది. ఎస్‌కేఎం ఇప్పటికే ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ రోజున కార్మిక సంఘాలు కూడా పారిశ్రామిక, సెక్టోరల్ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ పోరాటాన్ని రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్రాలు, జిల్లాల వరకు గ్రామాల వరకు విస్తరించి, అన్ని డిమాండ్లను మోడీ ప్రభుత్వం నెరవేర్చే వరకు మరింత ఉధృథం చేస్తామని పేర్కొంది.
త తొమ్మిదేళ్లలో 14.64 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేసినా ఒక్క రూపాయి కూడా రైతుల రుణమాఫీ చేయలేదని తెలిపింది.
ఇన్‌పుట్‌లకు సబ్సిడీల ఉపసంహరణ, ధరల పెరుగుదల వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయం, రైతు కుటుంబాల రోజువారీ ఖర్చులను పెంచిందని పేర్కొంది. ఎంఎస్‌పి, రుణమాఫీ, ఏడాదికి 2 కోట్ల ఉపాధి హామీ ఎన్నికల వాగ్దానాన్ని ఉల్లంఘించి రైతులకు ద్రోహం చేసిన నరేంద్ర మోడీ, దేశంలో ఎన్నడూ లేనంత రైతు వ్యతిరేక ప్రధానమంత్రి అని ఎస్‌కెఎం పునరుద్ఘాటించింది.