అప్పుడప్పుడు మాత్రమే కునుకు పట్టనివ్వని కవిత్వం పుడుతుంది. చీకట్లీనుతున్న ఆకాశంలోంచి అక్షర దీపాలను కురిపిస్తుంది. చితుకులైపోతున్న మట్టిపెళ్ళ బతుకుల్లోకి జ్ఞాపకాల తడిని మోసుకొస్తుంది. రాలిపడ్డ బొడ్డుతాడు నుదిటిన రాతిశాసనాల్ని చూపెడుతుంది. ముక్కు ముఖం మొలిపించుకున్న బండరాయి కరకు పాదాలకింద వెలిపేటల ఒంటరి కన్నీటి చుక్కలు అన్యాయంగా నలిగిపోతుంటే మేలుకొలుపులు పాడుతుంది. మెడలో ముంతా, ముడ్డికి తాటాకు కట్టుకొని మనిద్దరిమద్య నిజంగా తేడా ఏంటని అమాయకంగా అడుగుతుంది. ఈ కవిత్వం చదివి ఇప్పుడు అదేమాట నేనూ అడుగుతున్నా మనిద్దరిమద్య తేడా ఏంటి?
చురకమచ్చల నుదుళ్ళకి, చెరచబడ్డ మెదళ్ళకి కులం తక్కువ అక్షరాలతో తలస్నానాలు చేయిస్తున్న కవిత్వం ఇది. జీవితపు వాక్యాల అసంపూర్ణత్వానికి అంత్యప్రాసలు అద్దుతుంది. అంటరాని సమాధులకి తలలు ఆనిచ్చి అసలు చరిత్ర చెప్పమంటుంది. దుఃఖచెలమ నురగల్ని చీల్చి అరచేతుల్లోకి తీసుకున్న కలల దాహంతో దేహాన్ని తడుపుకుంటుంది. నేల నెర్రెల్లోకి మెదళ్ళని దూర్చి పూడ్చబడ్డ పుర్రెలతో రేపటి గురించి చర్చిస్తుంది. కన్నీటిచుక్కల ముఖాల్లోకి సూటిగా చూస్తూ ధైర్యవచనాలు బోధిస్తుంది. ఇది నేల తనకుతాను రాసుకున్న చిక్కటి కవిత్వం.
కనుగుడ్లను చిదిమేసే వడగండ్లకు లెక్కేలేదు. నెత్తుటి మేఘాల గర్జనల్ని నెత్తిమీద మోస్తున్న వాళ్ళం. అక్షరాల అంతరంగాల్లో నిన్నటిని దిగమింగి బతుకుతున్నవాళ్ళం. ఎర్ర జీరల కళ్ళలోకి కవిత్వపు చనుబాలు పిండుకొని మసకలు పోగొట్టుకుంటున్నవాళ్ళం. చీకటికి రంగులు పులుముతున్నవాళ్ళం. కవిత్వం మనకి స్వాంతన, కవిత్వం మన అస్తిత్వం, కవిత్వం జీవన వాస్తవం. ఒకే దేశంలో వందల వేల సరిహద్దులు పెట్టుకొని, దేహం చుట్టూ కంచెలు పాతుకొని, నిలబడ్డ చోట సమాధులు కట్టుకున్న ఇరుకుతనం మనది. యుద్ధం విసిరిన కన్నీటి రాళ్లకు నిశ్శబ్దాన్ని నేర్పుతున్నాం. కాళ్ళు నరుక్కొని ఎక్కడికో పరుగులు పెడుతున్నాం. ఏదో ఒక రోజు అక్షరం అగ్గివానలు కురిపిస్తుంది. కవిత్వమై ముంచెత్తుతుంది. పుట్టకముందే అంటిన నెత్తుటి మరకలు దేశాన్ని తగలబెడుతుంటే గొంతులుపగిలే గర్జనలు అక్షరాల మధ్యలోంచి మాత్రమే పుడతాయి. కవిత్వం యుద్దాన్ని భుజాన మోస్తుంది, మాటని నినాదం చేస్తుంది, నిన్నూ నన్ను ముందుకు తోస్తుంది, మట్టిపాదాల పగుళ్లలోంచి ఉద్యమానికి దారులు తీస్తుంది, కవిత్వం యుద్ధానికి మరోపేరు.
ఇది నడినెత్తి మీద బడబాగ్నిని కురిపిస్తున్న కవిత్వం. సింధూరపు రంగు పులుముకున్న నీలివర్ణపు అక్షరం. జూలు విదిలించి కవిత్వమై దుంకుతుంది. సమాజపు చివర్లలో, మిగిలిపోయిన బతుకుల్లో, అట్టడుగు మనుషుల్లో తనని తాను చూసుకొని రాసుకొని మురిసిపోతుంది. వెలివేతల విలోమ గీతాలు నిత్యం ఊరి చివర్ల నుంచి వినిపిస్తుంటే సరిహద్దులు మారుస్తానని పొలిమేరల్లో ప్రమాణాలు చేస్తుంది. కులపు మకిలి పట్టిన సమాజానికి నలుగు పెట్టి స్నానం చేయిస్తున్న కవిత్వం ఇది. కన్నీటి చుక్కల తలనిమిరి ఓదార్చే కవితా వాక్యం ఇది, పాలపిట్టల ఆకాశంలో ఎర్రమల్లెలు పూయిస్తుంది, మట్టిగుండెలకు చీకటిని తగలబెట్టే చుక్కల దివిటీల్ని కానుకిస్తుంది, పదాల మధ్య ఖాళీల్లో కత్తుల్ని మొలిపిస్తుంది.
ఈ కవిత్వమంతా మట్టి చుట్టూనో, నింగి లాంటి నాన్న చుట్టూనో, నిండు అన్నంగిన్నె లాంటి అమ్మ చుట్టూనో తిరుగుతుంది, నాన్న నుదిటిపై మెరిసిన చెమట చుక్కలకు అమ్మ చీరచెంగుతో ముద్దుపెట్టినంత ఆప్యాయంగా ఉంటుంది. పాలపుంతల ఆకాశంలో బంధనాలు తెంపుకున్న వెలుగుపక్షి స్వేచ్ఛాగానం ఈ కవిత్వం. సమాజపు నడిబొడ్డున అంటరాని పూల అస్తిత్వం గురించి చర్చించే ధీటైన వాక్యం ఇది. ఉప్పుతేలుతున్న బతుకు బట్టలకి ఎప్పటికీ ఎలిసిపోని చెమటరంగులద్దుతుంది, యుద్ధపుకత్తి తలల్ని బలితీసుకుంటే శ్మశానాల తలాపున కన్నీటి పాటలు పాడుతుంది. దేశమంతా తడారని నెత్తుటి మడుగులు పారుతుంటే శవాల గుట్టల మీద మానవత్వపు జెండాలు మొలిపిస్తుంది. కులకావరపు ఊతకర్రలు అర్థాకలి కడుపుల సడుగులు ఇరగ్గొడుతుంటే పోరుకత్తులకు పదును పెడుతుంది.
కవిత్వం జీవితం లాగే, అందరికీ ఒకేలా ఉండదు… కొందరికి కవితా వాక్యాలు పున్నమినాడు వెండి జరీ చీరలారేసిన ఇసుకతిన్నెలు. ఇంకొందరికి కట్టుబాట్ల బంధనాలలో కటిక నల్లచీరలు కట్టుకున్న పసి విధవరాళ్లు. కొందరికి నవ్వుపూల బరువుకి ఎరుపెక్కిన చెక్కిళ్ళు. ఇంకొందరికి చెంపలపై మిగిలిపోయిన కన్నీటి చారికలు. కొందరికి రెల్లుపూల పడవలని భుజాన మోసుకుంటూ ప్రవహించే పచ్చని అడవి దార్లు. ఇంకొందరికి కన్నబిడ్డల కడుపుల్లోంచి గుత్తులు గుత్తులుగా పూచిన తూటా పూలు.
అక్షర పుప్పొడిని జల్లి కవిత్వపు పిడికిళ్ళై విరబూయడం ఈ కవిత్వంలో సాధ్యమైంది. ఉద్యమఖడ్గానికి ఆకాంక్షల సానబెట్టిన వాక్యాలెన్నో ఈ దారుల్లో, మాటల్లో కోపాన్ని, ఆవేశాన్ని దాచుకొని కేవలం కవిత్వంగా బయటపడ్డ మంత్రదండం ఇది. కొంచెం కొంచెంగా మనిషిని కప్పుకుంటున్న మరణానికి చిరునవ్వుల స్వాగతం చెబుతుందీ కవితా వాక్యం. భయమే లేని చీకటి అడవి దారుల్లో ప్రయాణించే అక్షరసమూహం దీనికి వ్యాకరణం. అస్తమించని విప్లవ సూర్యులు, పెల్లుబికిన స్వేచ్ఛాసంద్రాలు, చరిత్రకెక్కని నెత్తుటి సిరాచుక్కలు ఈ కవిత్వానికి తలకట్టు దీర్గాలు. తెగిపడ్డ దేహాలన్నీ ఒత్తులు పొల్లులు. కారంచేడు, చుండూరు, లక్షింపేట, కంచికచర్ల ఈ కవిత్వాన్ని దాచుకునే ఎర్రని కాగితాలు. ఇది మనిషి వర్ణాల్ని చెరిపేస్తున్న వర్ణమాల. నెత్తురుకీ, చర్మానికీ చివరికి పుట్టుకకి కూడా వెలివేత రంగులద్దిన నల్లబల్లల్ని ఎరుపెక్కిస్తుంది.
ఒళ్ళంతా తనయుల్ని కన్న నిండు బాలింతదేవుడిని ఒక్కో బిడ్డా ఒక్కో రంగు ఎందుకో లెక్కచెప్పమంటుంది. యుగాలుగా చాతుర్వర్ణ చితులపై కాలకుండా మిగిలిపోయిన వెలివేత శవాలకు దుఃఖకవిత్వాన్ని వినిపిస్తుంది. పోరుగాలికి రాలిపోయిన ప్రతి పువ్వూ ఇక్కడ అక్షరమై మెరుస్తుంది. తునకలుగా తెగిపడ్డ లేత నెలవంకలు వాక్యపుస్థూపాల అంచున కొడవళ్ళై మెరుస్తాయి. రెండుకాళ్ళ మొక్కలు ఒళ్ళంతా కన్నీళ్లు పూస్తుంటే ఆ రంగులేని ఉప్పు నీటికి కవిత్వపు రంగులద్దుతుంది. కండచీమల దండు శూద్రతనువుని పీక్కుతింటుంటే ఆ విలాపాన్ని పోరాట గీతం చేస్తుంది. ఇది లోకంతోపాటు నడుస్తున్న కవితాపాదం అడుగుల శబ్దాల్ని అనుసరించడమూ వచ్చు దారితప్పితే తిరగబడడమూ వచ్చు.
సొంత నేల బహిష్కరించిన మట్టికణాల గుండెచప్పుళ్లు ఎవరో ఒకరు వినాలి. ఆ గొంతుల్ని కలిపి కుట్టి పిడికిళ్ల మాల తయారు చేయాలి. వివక్షల నిప్పుల్లో అంటకాగుతున్న పంచమజాతి పంచన ఒక్క కన్నీటి వాక్యమైనా రాయబడాలి. కడుపుమంటల ముందు వంచనల సెగకాగుతున్న సమాజపు దాష్టీకానికి ఏదో ఒక ఉదయం ప్రశ్నతో నమస్కారం పెట్టాలి. నెత్తురంటిన దేహంతో, నిప్పులూరే అగ్నిలోయల కళ్ళతో, ఎడారిగాడ్పులంటి శ్వాసతో, బిగిసిన పిడికిళ్లతో, హక్కుల ఫిరంగిలా, ఆరిపోని పోరుచుక్కలా, నినాదపు ఘోషలతో పదాల్ని పట్టుకొని ఉరుకులాంటి నడకతో కవిత్వంలా సాగిపోవాలి. నిరసనల నిప్పులు కురిపించాలి. సమైక్య చీపుళ్ళతో కులజాఢ్యాల్ని ఊడ్చెయ్యాలి. ఎన్నటికీ వాడిపోని వెలుగుపూలు పూయించాలి. అక్షరాల మీదుగా జీవితపు తీగల్ని పాకనివ్వాలి. కవితోదయం రావాలి.
మొనదేరిన కులపు కొడవలి కొసలకి నెత్తుటి రుచి చూపించి, గట్టుమీది దళిత పిట్టలకి గుల్లేర్లు విసిరిన నేల ఇది. దీనికి అక్షరాలా అక్షరమే సమాధానం. ఇది మనిషి ఆడుతున్న ‘పడమటీది నాటకం’. నాటక కర్త ‘మిరప మహేష్’.
– గౌతమ్ లింగా,+27 630255994