‘భారతీయ భాషల్లో ఇటువంటి ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. ఇదొక అద్భుతం’ అని దర్శకుడు వంశీ అన్నారు. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ – ఐఆర్ఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. ఇందులో 45 మంది దర్శకులు, ఏడుగురు రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకులు వంశీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని దర్శకులు హరీష్ శంకర్‌కు, రెండో ప్రతిని నటులు నాజర్‌కు అందజేశారు. తొలి ప్రతిని ‘సంతోషం’ మ్యాగజైన్ అధినేత, నిర్మాత సురేష్ కొండేటి ఐదు వేల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. ఈ బుక్ కవర్ పేజీ ఫ్రేమ్‌ని దర్శకులు మోహనకష్ణ ఇంద్రగంటి, పుస్తకాన్ని పబ్లిష్ చేసిన అక్షౌహిణి మీడియా లోగోని దర్శకులు హరీష్ శంకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మాట్లాడుతూ, ”నేను ‘అన్వేషణ’ సినిమా తీయడానికి హిచ్‌కాక్ కూడా ఓ ప్రేరణ. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు వీసీఆర్ కొన్నప్పుడు అందులో ‘సైకో’ చూశా. హిచ్‌కాక్ తీసిన మొత్తం 53 సినిమాలు చూసిన వ్యక్తిని నేను. సినిమాకు అవసరమైనవి మూడు… స్క్రిప్ట్, స్క్రిప్ట్, స్క్రిప్ట్ అని చెప్పాడు హిచ్‌కాక్. ఆయన మీద పులగం చిన్నారాయణ, రవి పాడి గొప్ప పుస్తకం తీసుకొచ్చారు. ఇదొక అద్భుతం. ఈ పుస్తకం తొలి ప్రతిని చూసి థ్రిల్ అయ్యా’ అని చెప్పారు.
‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నటుడు నాజర్, దర్శకులు మెహర్ రమేష్, మోహనకష్ణ ఇంద్రగంటి, వీరశంకర్ (తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు), చంద్రసిద్ధార్థ, శివ నాగేశ్వరరావు, కరుణ కుమార్, వర ముళ్ళపూడి, దేవి ప్రసాద్, సునీల్ కుమార్ రెడ్డి, సాయి కిషోర్ మచ్చా, రమేష్ సామల, శ్రీమన్ వేముల తదితరులు పాల్గొన్నారు. అలాగే సీనియర్ రచయిత తోట ప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, సుబ్బారావు, ప్రసన్న ప్రదీప్, వడ్డి ఓం ప్రకాశ్, జలపతి తదితరులు పాల్గొన్నారు.