వాకిళ్ళు ఊడుస్తున్న
మెత్తని చప్పుళ్ళు నాకు సుప్రభాతాలు
నేను ముప్పూటలా తింటోన్న అన్నం
రైతు పెట్టిన ప్రసాదం
తాగుతున్న నీళ్ళు
ఒకప్పుడు మా బావి తవ్విన ఉప్పర్ల తీర్థం
తల్లి తన కాళ్ళపై
నన్ను వెల్లకిలా బోర్లా పడుకోబెడుతూ
గోర్వెచ్చని నీళ్ళతో పోసిన స్నానం
గొప్ప అభిషేకం
మా చెల్లె కత్తిరించిన బీడీల ఆకుల
శబ్దాలు మంగళవాయిద్యాలు
నేతన్న నాకు తొడిగిన గుడ్డలు
సమస్త వస్త్రాలంకణలు
దోమల నివారణకై
అమ్మ ముట్టించిన కుంపటి పొగ…ధూపం
గురువులు శిష్యవాత్సల్యంతో
నాలో వెలిగించిన జ్ఞానం… దీపం
చలిని అరికట్టేందుకు
మా అక్క నా తలకు
కట్టిన అరికంట్లం…శఠగోపం
ఉన్నతవిద్యల కోసం
పడరాని పాట్లుపడుతూ
నాన్న నా జేబులో వేసిన పైసలు…
హుండీ డబ్బులు
మేస్త్రీ కట్టిన మా ఇల్లు …గుడి
నాకు పని- నిజమైన పూజ
చెప్పేదీ, చేసేదీ ఒక్కటే అయిన మనిషి-
నా ఇష్టదైవం, మా ఇంటిదైవం.
– నలిమెల భాస్కర్