చూసావటే… అప్రాచ్యపు వెధవలు. ఎంతకు తెగించారో, ఏది బడితే అది వాగుతున్నారు. సనాతన ధర్మం అంటే ఒకడు డెంగ్యూ అంటాడు, మరొకడు కుష్టురోగం అంటాడు. అందుకే మా నాయకుడు ఈ గర్వపోతుల ముసుగులను ఒక్కదెబ్బతో చీల్చిపారేసాడు. సనాతన ధర్మాన్ని పాతరేసేందుకు పెద్ద కుట్రే జరుగుతున్నట్టు కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడిక ఇండియా పేరెత్తారంటే చమ్డాలతీస్తారు తెలిసిందా?
ఎవరిదీ, ఎవరిది అంటావేంటి, ముందుగా నీది. మాట్లాడితే ‘హేమేరా ఇండియా, ఓ మేరా ఇండియా’ అంటూ ఎప్పుడూ ఇండియాను వెనకేసుకొస్తావుగా.
అయ్యోరామ. అది పాటండి. దేశభక్తి గీతాలు చాలామటుకు ఇండియా పేరుతోనే ఉంటాయి. ఇంగ్లీషులో అయితే మన దేశాన్ని ఇండియా అనే అంటారు. ప్రతిపక్షం వారు ‘ఇండియా’ పేరుతో కూటమి పెట్టుకున్నారని మీరు అంతగా అంత ఇదైపోతే ఎలా..?
నోర్మురు. మాటల మాటున గారడీ చేద్దామని అనుకున్నారా? ఇండియా పేరును రాజకీయాలకు వాడుకుంటారా? అదీ చూస్తాం. అందుకే ఇండియా పేరును భారత్‌గా మేం మార్చేయదలచుకున్నాం.
మార్చుకోండి. ఇండియా అన్నా భారత్ అన్న ఒక్కటేగా, ప్రతి ఒక్కరికీ ఇది తెలుసు. మీరే వేర్వేరు అనుకుంటున్నారు. మన పిల్లలు రోజూ బడిలో ప్రతిజ్ఞ కూడా చేస్తారు. ‘భారతదేశము నా మాతృభూమి. భారతీయులు అందరూ నా సహౌదరులనీ…’
అదే అదే ఆ బ్రిటిష్‌వాడు వచ్చి మనల్ని సర్వనాశనం చేసాడు. ఆ బ్రిటిష్ ఇండియానే మన బుర్రలను ఇప్పుడు ఖరాబు చేసింది. అరెర్రే… మన బడుల్లో వేద మంత్రాలుండవు. సరస్వతీ పూజలు లేవు. అంతా అల్లకల్లోలం గందరగోళం చేసి పారేసారు.
గందరగోళ పడుతున్నది మీరు. ఇప్పుడేమయింది. అంతగా విరుచుకు పడుతున్నారు.
ఏమయిందా..? ఆ పాశ్చాత్య చదువులకు లోబడే కదా! మన వేదాలను అటకెక్కించారు. ఇప్పుడు ప్రతి వెధవా సనాతన ధర్మాన్ని హేళన చేసేవాడే.
హేళన చేయకూడదంటే మీరు సనాతన ధర్మానికి ఓ స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలి. నలుగురు గుడ్డివాళ్ళు కలసి ఏనుగును వర్ణించినట్టు వర్ణిస్తే ఎలా..? ప్రవచనకారులు ఏదిబడితే అది మాట్లాడుతున్నారు.
వేదాలు అపౌరషేయాలు. మానవ మాత్రులు రాసినవి కావు. భగవంతునిచే సృష్టించబడినవి. అలాగే సనాతన ధర్మం కూడా. ఈ విశ్వంలా ఆది మధ్యాంత రహితమైనది పంచభూతాల్లా శాశ్వతమైనది.
ఏ ఒక్కరూ రాయకుండానే వేదాలు అలా ఆకాశంలో ఊడిపడ్డాయా? అది మీరు నమ్ముతున్నారా?
ఏం నీవు నమ్మవా?
నేను నమ్మను గాక నమ్మను. ఎవరో ఒకరు రాస్తేనే అవి పుట్టాయి. వాల్మీకి రాస్తేనే రామాయణం పుట్టింది. వ్యాసుడు రాస్తేనే మహాభారతం పుట్టింది. అలాగే మనువురాస్తేనే మనుస్మృతి పుట్టింది. భగవద్గీతలో కృష్ణుడు ‘చాతుర్‌వర్ణం మయాసృష్టి’ అని అన్నాడు. వ్యాసుడో, మనువో రాస్తేనే గదా ఆ సనాతన ధర్మం పుట్టింది. వర్ణవ్యవస్థను ఆ సనాతన ధర్మం సమర్థిస్తున్నది.
నీవూ ఇండియా కూటమిలా వితండవాదం చేస్తున్నావు. అందుకే ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతిః’ అని ధర్మం చెపుతున్నది.
స్త్రీలకు స్వాతంత్య్రం అక్కర్లేదని సనాతన ధర్మం చెపుతున్నప్పుడు ఆప్ఘనిస్తాన్ తాలిబాన్లు మాదిరి మీరూ స్త్రీలను చదువుకోనివ్వకూడదుగా. మరెందుకు మీ నాయకుడు ‘బేటీపడావో – బేటీ బచావో’ అని ఊరేగుతున్నారు.
తాలిబన్‌లతో మమల్ని పోలుస్తావా? నిన్నూ… నిన్నూ…
ఏం కొడతారా? అంతకన్నా మీరేం చేయగలరు? మూర్ఖులెప్పుడూ అసహనంతో ఆధిపత్యాన్ని చూపుతూనే ఉంటారు. కానీ ఇది తిరుగుబాటు యుగం. తిరుగుబాటు రూపాలూ మేం మార్చుకోగలం. అందులో గాంధీ మహాత్ముడు ప్రసాదించిన సత్యాగ్రహం ఒకటి.
మరి గాంధీ కూడా సనాతన ధర్మం బలపరిచాడు కదా!
లేదు. అలా అని మీ నాయకుడు చెప్పుకుంటున్నాడు. కావాలని ప్రజలను గందరగోళపరుస్తున్నాడు. ‘రఘుపతి రాఘవ రాజారాం. పతీతపావన సీతారాం. ఈశ్వర్ అల్లా తేరేనామ్. సబకో సమ్మతి దే భగవాన్’ ప్రజలందరికీ ఒక్కడే దేవుడున్నాడు. హిందూ-ముస్లిం భాయ్ భాయ్ అని నడిచాడు. బ్రిటిషోడ్ని తరమడానికి ప్రజలందర్నీ ఒక్క తాటిపై నిలిపాడు.
గాంధీని పొగుడుతావేంటి?
ఏం ఎందుకు పొగడకూడదు. నిన్నగాక మొన్న మీ నాయకుడు జి-20 సమావేశాల్లో దేశాధినేతలందర్నీ రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్ళి గాంధీ సమాధి వద్ద ఆ మహనీయునికి నివాళులు అర్పించారుగా మరి!
అదీ… అదీ. ఓ రాజకీయ ఎత్తుగడ. అగ్రదేశాల సరసన నిలబడాలంటే అలాంటివి ఎన్నో చేయాలి. అవన్నీ నీ కర్థం కావులే.
ఏం అర్థం కావు. సనాతన ధర్మం తొలగించాలన్న వారి తలనరికి తెస్తే పదికోట్లు రూపాయలు ఇస్తామని బెదిరించడం అర్థం కాదా? అలాంటి హింసాయుత ప్రేలాపనలను, చర్యలను ఖండించని మీ నాయకుని మౌనం అర్థం కాదా? ఏం అర్థం కావు.
ఏమిటలా రెచ్చిపోతున్నావు.
రెచ్చగొడుతున్నది మీరు. పిల్లే కదా! ఏం చేస్తుంది అని నాలుగు గోడల మధ్య బంధించి కొట్టిచూడు. ఆ పిల్లే పులి అవుతుంది. కళ్ళు పీకేస్తుంది తెలుసా..?
అయితే తప్పంతా మా నాయకునిదే అంటావా?
అధర్మాన్ని ధర్మంగా ప్రచారం చేస్తున్న మీలాంటి వారిది కూడా…
అధర్మమా?
అవును అధర్మమే. స్త్రీలకు స్వేచ్ఛా సమానత్వం ఇవ్వనిది అధర్మం కాదా? శూద్రులు, పంచములు, దళితులు, ఆదివాసులు అంటూ అస్పృశ్యతను పాటించడం అధర్మం కాదా? మతం పేరుతో మారణహౌమం, దేవుని పేరుతో ఊచకోతలు కోయడం అధర్మం కాదా? ఈ అధర్మాలే కదా మీరంటున్న సనాతన ధర్మం కాదని చెప్పండి. మీరు చెపుతారా? మీ నాయకుడు చెపుతాడా?
మరి నీవు చెపుతున్న ధర్మం ఏమిటో…
పాతది ఏదీ గొప్ప కాదు. కొత్తది ఏదీ తప్పూకాదు. ధర్మం కూడా మారుతూ ఉంటుంది కాలనుగుణంగా. సనాతన ధర్మం స్థానంలో సంస్కరణోద్యమాలు, ఆధునాతన భావాలు ఎన్నో పుట్టుకొచ్చాయి. వాటికి దేవుడు కేంద్రం కాదు. మనిషే కేంద్రం. మానవాభ్యుదయమే ఈ ఆధునిక యుగధర్మం.
ఏమిటో ఈ యుగధర్మం?
అలా అడిగారు. బావుంది. వందేండ్ల క్రితమే మన తెలుగువాడే మహాకవి గురజాడ మనిషి మనుగడకు మార్గం చూపాడు. నవీన మానవుడు ఈ విధంగా నడుచుకోవాలని తేటతెల్లం చేసాడు. అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యేలా ముత్యాల సరాల్లో దేశభక్తి గీతం రచించాడు.
దేశమును ప్రేమించుమన్నా / మంచి అన్నది పెంచుమన్నా / వట్టి మాటలు కట్టిపెట్టోయ్ / గట్టిమేల్ తలపెట్టవోయ్ / ఈ సురోమని మనుషులంటే దేశమేగతి బాగుపడునోయ్ / జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నింపవోయ్/ సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడవోయ్ / దేశమంటే మట్టికాదోయ్. దేశమంటే మనుజులోయ్ ఇలా ఎన్నో విధాలుగా ఎన్నెన్నో పద్ధతుల్లో ఉద్భోదించాడు. వీటి అర్థం పరమార్థం తెలుసుకుని ఆచరిస్తే తమ వ్యక్తిగత జీవితాలేగాదు, దేశ నిర్మాణంలో సైతం వారు నిస్సందేహంగా భాగస్వాములవుతారు. ఇదీ ధర్మం అంటే… తెలిసిందా!
(నేడు గురజాడ 161వ జయంతి)
కె. శాంతారావు
9959745723