పేదరికాన్ని అంచనా కట్టడం ఇలాగేనా?

Is this how poverty is measured?‘పేదరికం’ అని వాళ్లు పరిగణించేదానిని అంచనా కట్టే పనిలో అనేక అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు మునిగివున్నాయి. కొంత కాలం వరకూ ఈ పని ప్రపంచ బ్యాంక్‌ చూసేది. ఇప్పుడు ఐరాస అభివృద్ధి ప్రాజెక్టు, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనీషియేటివ్‌ అనే ఆక్స్‌ఫర్డ్‌ సంస్థ ఆ పనిలో ఉన్నాయి. ఇవేవీ వాస్తవంగా పేదరికాన్ని అంచనా కట్టే లక్ష్యంతో లేవు. నయా ఉదారవాదాన్ని అందంగా చిత్రించే పనిలో ఉన్నాయి. ”కడు పేదరికం” అంటే 2011 నాటి డాలర్‌ కొనుగోలుశక్తి ప్రాతిపదికన రోజుకు 1.90 డాలర్లు తలసరి వినియోగం కన్నా హీన స్థాయిలో ఉండడం. అంటే తలసరి రోజుకు దాదాపు రూ.53 ఖర్చు చేయగలిగే పరిస్థితి ఉంటే అది ‘కడు పేదరికం’ స్థాయికి ఎగువన ఉన్నట్టే. ప్రపంచబ్యాంక్‌ అంచనా ప్రకారం 1990 దశాబ్దం చివరి భాగంలో ఈస్థాయి కన్నా దిగువన సుమారు 30 శాతం ప్రపంచ జనాభా ఉండేవారు. 2022 నాటికి ఆ స్థాయికి దిగువన కేవలం 10 శాతం కన్నా కూడా తక్కువే ఉన్నారని ప్రపంచబ్యాంక్‌ తెలిపింది. అంటే నయా ఉదారవాద విధానాల అమలు తర్వాత కోట్లాది మంది ప్రపంచ జనాభా కడు పేదరిక స్థాయినుండి బయటపడ్డారు అన్నది ప్రపంచబ్యాంక్‌ చెప్పదలచుకుంది. ఇది పూర్తిగా లోపభూయిష్టమైన అంచనా. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ప్రపంచబ్యాంక్‌ అంచనా కట్టే పద్ధతిలో మూడు పొరపాట్లు ఉన్నాయి. మొదటిది: ఒక వ్యక్తి దగ్గర ఉన్న సంపద పెరిగిందా, తరిగిందా అన్నది ప్రపంచబ్యాంక్‌ లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఆ వ్యక్తి ఆదాయం పరిస్థితిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. రెండవది: ఒక వ్యక్తి ఆదాయాన్ని అంచనా కట్టడానికి ఆ వ్యక్తి చేసే వ్యయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. మూడవది: వాస్తవ వ్యయాన్ని అంచనా కట్టడానికి అది ధరల సూచికను ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఈ ధరల సూచిక వాస్తవ జీవన వ్యయాన్ని సక్రమంగా ప్రతిబింబించడం లేదని అందరికీ తెలుసు. ఈ మూడు పొరపాట్ల ఫలితంగా వచ్చే నిర్ధారణలు చాలా పెద్ద పొరపాటు అంచనాలకు దారి తీస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్నీ చూద్దాం.
ఒక వ్యక్తి ఆర్థిక స్థాయిలో వచ్చిన మార్పులను పరిశీలించడానికి ఆ వ్యక్తికి వస్తూన్న ఆదాయాన్ని, ఆ వ్యక్తి వద్దనున్న సంపదలో పెరుగుదల లేదా తరుగుదలను- ఈ రెండింటినీ లెక్కలోకి తీసుకోవాలి. ఉదాహరణకు: ఒక వ్యక్తికి ఏడాది క్రితం ఎంత ఆదాయం వస్తోందో. ఇప్పుడూ అంతే ఆదాయం వస్తోందనుకోండి. కాని ఇదే ఏడాది కాలంలో ఆవ్యక్తి దగ్గరున్న సంపద కాస్తా హరించుకు పోయిందనుకోండి. అటువంటి వ్యక్తి ఆదాయంలో ఏ మార్పూ లేదు కనుక ఆర్థిక స్థాయిలోనూ ఏ మార్పూ లేదని మనం చెప్పగలమా? ఉన్న సంపద కాస్తా హరించుకు పోయినప్పుడు ఆ వ్యక్తి మరింత పేదరికంలోకి జారిపోయినట్టు కాదా? కాని ప్రపంచబ్యాంక్‌ పద్ధతిలో ఆ వ్యక్తి సంపద పరిస్థితి ఏమార్పులకు లోనైంది అన్న అంశం పరిశీలనలోనే ఉండదు. నయా ఉదారవాద విధానాలు అంటేనే సంప దను కొల్లగొట్టి పోగేసుకోవడం. అంటే చాలామంది వ్యక్తులను వారి వారి సంపదకు దూరం చేసి దానిని స్వాహా చేయడం. ఇటువంటి విధానాలను ఒకపక్క అమలు చేస్తూ మరొకపక్క కోట్లాది మంది పేదరికం లోంచి బైట పడ్డారని చెప్పుకోవడం అవహేళన చేయడమే.
రెండవది: ఆదాయాన్ని లెక్కించడంలో కూడా వాస్తవ ఆదాయాన్ని లెక్కించకపోవడం. భారతదేశంతో సహా చాలా దేశాల్లో వ్యక్తుల వాస్తవ ఆదాయాలకు సంబంధించిన వివరాలు లేవు. ఆదాయం అంటే ఏ యే అంశాలను పరిశీలించాలి అన్నదే ఒక సంక్లిష్టమైన విషయం. అందుచేత వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవడం పరిపాటి అయింది. వ్యయానికి సంబంధించి లెక్కలు లభిస్తున్నాయి గనుక దానినే ప్రాతిపదికగా తీసుకుని వ్యక్తుల ఆదా యాలను లెక్కించడం జరుగుతోంది. వ్యయాన్ని బట్టి ఆదాయం లెక్కించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి సంపద లో వచ్చిన మార్పులను పరిశీలించకపోవడం ఏమాత్రమూ క్షంతవ్యం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆదాయం పడిపోయినా, ఆ వ్యక్తి తన వద్దనున్న ఇతర సంపదను అమ్ముకుని ఆ సొమ్ముతో గతంలో మాదిరిగానే తన వ్యయాన్ని కొనసాగించ వచ్చు. వాస్తవానికి ఆ వ్యక్తి పేదరికం పెరిగింది అని నిర్ధారించాలి. కాని వ్యయం స్థాయి యథాతథంగా నిలబడింది గనుక ఆ వ్యక్తి పేదరికం పెరగలేదు అని నిర్ధారించడం అర్ధరహితం కాదా?
మూడవది: వ్యయాన్ని లెక్కించినప్పుడు కూడా వాస్తవ వ్యయం ఎంతో నిర్ధారించడానికి ఆ వ్యయాన్ని ధరల సూచీతో పోల్చి సరి చేస్తారు. ఈ ధరల సూచీ వాస్తవ ధరల పెరుగుదలను ప్రతిబింబించదు. ప్రజలకు గల సాధా రణ అవసరాలను బట్టి కొన్ని వస్తువులను మాత్రం లెక్కలోకి తీసుకుని వాటి ధరల్లో వచ్చే మార్పులను మార్కెట్‌ సర్వే ద్వారా నిర్ధారిస్తారు. దానిని బట్టి ధరల సూచీ లో మార్పులను నిర్ధారిస్తారు. ఐతే, ఎప్పటినుంచి పెరుగుదలను పరిశీలించాలి అన్నదానికి ఒక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు (ఉదా:1960, 1982, 2011-ఈ సంవత్సరాలను బేస్‌ సంవత్సరాలుగా తీసుకుని వివిధ ధరల సూచికలు రూపొందుతాయి). అయితే, అప్పటికీ, ఇప్పటికీ అవే సరుకులను అదే ప్రాధాన్యతతో ప్రజలు ఉపయోగించరు. వినియోగంలో వచ్చే మార్పులను ఈ ధరల సూచీ పరిగణనలోకి తీసుకోదు. అదే మాదిరిగా బేస్‌ సంవత్సరం నాడు లభించిన సరుకులు ఇప్పుడు లభించవు కూడా. ఈ మార్పులను ధరల సూచీ లెక్కలోకి తీసుకోదు.
ఉదాహరణకి: నయా ఉదారవాద విధానాలు వచ్చాక చాలా సేవలు ప్రయివేటుపరమయ్యాయి. ముఖ్యంగా విద్య, వైద్యం. ఇవి అంతకు మునుపు ప్రభుత్వ వ్యవస్థ ద్వారా అందేవి. ఇప్పుడు వాటి ఖరీదు విపరీతంగా పెరిగి పోయింది. వాటిని వినియోగించడం ప్రజలకు అనివార్యం. కాని ధరల సూచీ ఈ రెండింటినీ ఇప్పటికీ ఉచితంగానే అభిస్తున్నవిగా పరిగణిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక ఆపరేషన్‌కు బేస్‌ సంవత్సరంలో రూ. వెయ్యి వసూలు చేసినది. ఇప్పుడు రూ.రెండు వేలు వసూలు చేస్తే, ఈ తేడాను మాత్రమే ధరల సూచీ లెక్కలోకి తీసు కుంటుంది. ప్రభుత్వ వైద్యవ్యవస్థ విస్తరించనందువలన ప్రయివేటు వైద్యానికి అనివార్యంగా ప్రజలు పోవలసి వస్తోంది. అక్కడ ఇదే ఆపరేషన్‌కు రూ.పది వేలు వసూలు చేస్తారు. కాని ధరల సూచీలో ప్రభుత్వ ఆస్పత్రులలో పెరిగిన ఫీజులను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. వాస్తవ జీవన వ్యయం ధరల సూచీలో చూపుతున్న దానికన్నా ఎన్నో ఎక్కువ రెట్లు పెరిగింది. కాని దానిని లెక్కించనందు వలన అధికారిక ధరల సూచీని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డట్టు చిత్రిస్తారు.
నిజానికి జీవన వ్యయం పెరిగిన ప్రతీ సందర్భంలోనూ ప్రజలు సర్దుబాటుకు రెండు విధాలుగా ప్రయత్ని స్తారు. మొదటిది: ఉన్న ఆస్తులను, సంపదను అమ్ముకోవడం. లేదా అప్పులు చేయడం. రెండవది: వినిమయాన్ని తగ్గించుకోవడం. అలా వినిమయాన్ని తగ్గించుకోవలసి వచ్చినప్పుడు అత్యంత అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేస్తారు. వైద్యం అటువంటి అత్యవసరమైన ఖర్చు. ప్రయివేటీకరణ కారణంగా దాని ఖర్చు బాగా పెరిగింది. ఐనా ఖర్చు చేయక తప్పదు. అందుకోసం ప్రజలు తమ తిండి ఖర్చులను సైతం తగ్గించుకోవలసి వస్తోంది. పిల్లల చదువు నిమిత్తం చేసే ఖర్చుకు కూడా అటువంటి ప్రాధాన్యతే ఉంటుంది. ఈ రెండు సేవలనూ ప్రయివేటు రంగం నుండి పొందాల్సి వస్తున్నందున భారతదేశంలో అత్యధిక కుటుంబాలలో తమకున్న బంగారాన్ని, ఇల్లును, లేదా పొలాన్ని అమ్ముకునో, తాకట్టు పెట్టో సర్దుబాటు చేసుకోడం సర్వసాధారణం అయిపోయింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా జరుగుతోంది. దాని ఫలితంగా ఆ కుటుంబాల ఆహార వినియోగంలో తీవ్ర మార్పులు వచ్చాయి. తిండి ఖర్చులు తగ్గించుకోవడం వలన ఆర్థిక స్థితిగతుల్లో పెద్ద మార్పులు రావన్న సంగతిని వారు గమనించడం లేదు. ప్రజల ఆస్తులు, అప్పులను సర్వే చేసే అఖిల భారత వ్యవస్థ ఎఐఆర్‌డిఐఎస్‌ 2013కు, 2019కి మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతంలో అప్పుల పాలైన కుటుంబాల సంఖ్య పదకొండు శాతం పెరిగినట్టు తేల్చింది. దానితోబాటు సగ టు కుటుంబ రుణం 43 శాతం పెరిగినట్టు కూడా తేల్చింది. అంతేగాక సగటు ఆస్తుల విలువ 39 శాతం తగ్గి నట్టు నిర్ధారించింది. ఇదంతా కేవలం 7 సంవత్సరాల మధ్య కాలంలో మాత్రమే సుమా. ఇక పట్టణాలలో పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. స్వయం ఉపాధి ద్వారా జీవించే కుటుంబాల రుణం 24 శాతం పెరిగింది. సగటు ఆస్తుల విలువ 29 శాతం తగ్గింది. అంటే దేశంలో ప్రజల సంపద నయా ఉదారవాద కాలంలో క్షీణించింది అన్నది స్పష్టం.
ఇక రెండో విధంగా సర్దుబాటు చేసుకునేవారి విషయం చూద్దాం. తమ వినిమయాన్ని తగ్గించుకోవడం ద్వారా జీవన వ్యయ భారాన్ని తగ్గించుకోవాలనుకునేవారి విషయంలో కనీస పోషకాహారం 2200 క్యాలరీలు కూడా పొందలేకపోతున్నవారి శాతం 1993-94లో 58 ఉంటే 2011-12 నాటికి అది 68 శాతానికి పెరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి. ఇక పట్ట ణాలకు వస్తే కనీసం 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందలేనివారి శాతం 57 నుండి 65కి పెరిగింది. 2017-18 లో మళ్ళీ సర్వే జరిపితే వచ్చిన గణాంకాలు మరీ ఘోరంగా ఉన్నా యి. దాంతో ఆ గణాంకాల వివరాలను బహిరంగ పరచడా నికి మోడీ ప్రభుత్వం సాహసించలేదు. ఆ సర్వేలో గ్రామీణ ప్రాంతం లో కనీసపు స్థాయిలో పౌష్టికాహారం పొందలేక పోతున్న వారి శాతం 80ని దాటింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచ బ్యాంక్‌ నివేదికలు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి.
రోజుకు తలసరి ఖర్చు రూ.53 కన్నా తక్కువ చేస్తున్నవారి శాతం 2011-12లో 12 ఉంటే 2022-23లో అది రెండు శాతానికి తగ్గిందని ఆ నివేదికలు అంటున్నాయి! ఆయా దేశాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న లోప భూయిష్ట మైన ప్రమాణాలనే ప్రాతిపదికగా తీసుకుని ప్రపంచబ్యాంక్‌ ఈ నిదార్ధరణలకు వచ్చింది. తద్వారా పలు మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాలు పేదరికం తగ్గిపోయిందంటూ చేసుకుంటున్న ప్రచారానికే వంత పాడుతోంది. కోట్లాది మంది ప్రజలు పేదరికం లోంచి విముక్తి చెందారంటూ సాగుతున్న ఈ ప్రచారం కేవలం క్రూరమైన అవహేళన మాత్రమే. ఐరాస నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను ఎంత వరకూ ఆ యా దేశాలు చేరుకోగలిగాయన్న విషయం రాబోయే రోజుల్లో ముందుకు రానుంది. అందుచేత ఇటువంటి తప్పుడు ప్రచార హోరు మరి కాస్త పెరుగుతుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌