లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నోరి నాగ ప్రసాద్ నిర్మాతగా, దర్శకుడు హరీష్ చావా రూపొందిస్తున్న చిత్రం ‘ఇట్లు… మీ సినిమా’. అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా, ప్రదీప్, అమ్మ రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నలుగురు యువకులు తమకున్న ప్యాషన్‌తో సినిమా రంగానికి వచ్చి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?, వాళ్ళు సినీ ఇండిస్టీలో సక్సెస్ అయ్యారా లేదా అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 21న థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని మేకర్స్ సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు హరీష్ చావా మాట్లాడుతూ,’ చిత్ర పరిశ్రమలోకి రావాలనుకుంటున్న వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మేం ఈ కథలో చూపించాం. ప్రేక్షకులందరికీ తప్పుకుండా నచ్చుతుంది’ అని అన్నారు. ‘మా మూవీకి శ్రీనివాస్, రామారావు అని ఇద్దరు మిత్రులు మాకెంతో సపోర్ట్ చేశారు. ఈ మూవీతో ఒక మంచి ప్రయత్నం చేశాం. చిత్ర పరిశ్రమలో కొత్త వాళ్లు పడే ఇబ్బందులను ఆసక్తికరంగా ప్రేక్షకులకు నచ్చేలా చూపించాం. అన్ని ఎమోషన్స్ కలిపిన చిత్రమిది’ అని నిర్మాత నోరి నాగ ప్రసాద్ చెప్పారు. హీరోయిన్ వెన్నెల మాట్లాడుతూ, ‘ఒక మంచి మూవీలో భాగమవడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ‘ఈ సినిమాలో కొత్త నటీనటులు అని మాత్రమే చూడకండి. కేవలం కంటెంట్ చూసి మా మూవీ చూసేందుకు రమ్మని కోరుతున్నా’ అని హీరో అభిరామ్ చెప్పారు.