ఇది కదా! భారత జీవనం

Isn't it! Indian life‘హిందువులం, బంధువులం’ ఎంత ఇరుకైన నినాదం! ‘వసుధైక కుటుంబకమ్‌’ కదా మన సంప్రదాయం. భారతీయులందరు నా సహోదరులు…అని కదూ మనం చిన్ననాటి నుండీ ప్రతిజ్ఞ చేస్తున్నాము. భారతీయులందరమూ బంధువులమే. అసలు మానవులందరూ ఒక జాతి కిందకే వస్తారు.మతాల ప్రాతిపదికన గిరి గీసుకుని పోతుంటే, అక్కడితో ఆగుతామా? కులం రాదూ! ప్రాంతం రాదూ! రంగు తేడాలు ఉత్తర దక్షిణాలు, జెండర్‌ బేధాలూ…భాషలూ.. ఇలా సమూహాలను విడగొట్టుకుంటూ పోతే గడ్డిపోచల్లా మిగిలిపోమూ! ఆ విభజన మొదలెయ్యటమే అమానవీయం. విభజించుకుంటూ వెలిపోవడటం మరింత దారుణం. అప్పుడు మనుషులుగా మిగల కుండా పోతాము చివరికి. ఆధునిక మానవుడు, అంతకు ముందున్న సమాజం కంటే ఉన్నత విలువను సమకూర్చుకున్నాడు. అభివృద్ధి చెందాడు. భౌతికంగానే కాదు ఆలోచనలో, ప్రవర్తనలో, విలువలలో ముందున్నాడు. తిరిగి వెనక్కి నడవడం కుదరదు. కాలం వెనక్కి తిరగదు. అయినా కొందరు ఆలోచనల్లో, ప్రవర్తనల్లో వెనక్కి నడిచే ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకంత నష్టాన్ని ఆ సమూహం, సమాజం అనుభవి స్తుంది. అభివృద్ధి ఆగిపోతుంది. వెనక్కి మళ్లడం కొందరు బలవంతంగా చేసే పని మాత్రమే. సమాజ గమనం మాత్రం ముందుకే వుంటుంది. మన దేశ సమూ హాల్లోనూ మానవీయ విలువలైన సౌహా ర్థత, సౌశీల్యం, సహనం, సోద రత్వం, సహజాతంగా కొనసాగుతూనే వున్నాయి. చరిత్రలోనైనా, వర్తమానం లోనూ జీవన గమనాలను పరిశీలిస్తే మనకు అవగాహన అవుతుంది.
దేశంలో మతం ఆధారంగా మను షుల మధ్య విభేదాలను, విద్వేషాలను రెచ్చ గొడుతూ విధ్వంస రచన కొనసాగు తున్న తరుణంలో కూడా సామరస్య జీవనం ఎలా వుంటుందో ప్రజలు ఎరుక పరుస్తూనే వున్నారు. నిజంగా ప్రజలు దేవుడి మూలంగా ద్వేషాన్ని కలిగి వున్నారా? లేదు.నిజమైన భక్తులకు అల్లాV్‌ా, రాముడు, యోహోవా ఎవరైనా ఒకటే. ‘ఈశ్వర్‌ అల్లా తేరేనామ్‌ సబ్‌కో సమ్మతి దే భగవాన్‌’ అని పాడుకొన్నవాళ్లం కదా! భక్తి విధానంలో భేదం వుండొచ్చు కానీ భక్తిలో విద్వేషం మాత్రం ఉండదు. విద్వేషాలు రెచ్చగొట్టేవారికి వున్న ప్రయోజనాలు వేరు. అవి కేవలం ఆధిపత్య రాజకీయ ప్రయోజనాలు మాత్రమే. అందుకే వారు వైషమ్యాలను ఎగదోస్తుంటారు. నిజమైన భక్తులు, సాధారణ ప్రజలు సామరస్యాన్ని కోరుకుంటారు. అందుకు చక్కని ఉదాహరణ మొన్న జరిగిన గణపతి ఉత్సవాలు. గణపతి నిమజ్జన ఊరేగింపుల సందర్భంగానే, అదే రోజు ముస్లింలు ముఖ్యంగా జరుపుకునే మిలాదున్నబీ కూడా వచ్చింది. ఈ సందర్భంగా వారు కూడా ప్రదర్శనలు తీయటం ఆనవాయితీగా వస్తున్నది. అయితే వైరుధ్యాలను సృష్టించాలనుకునేవారు వీటిని ఆసరా చేసుకుని గొడవలు రేపుతారు. అందుకని సహనంతో ఆలోచించిన మతపెద్దలు, మిలాదున్‌నబీని నిమజ్జనం రోజుకాక అక్టోబరు ఒకటిన జరుపుకోవాలని నిర్ణయించడం, అందరికీ విజ్ఞప్తి చేయడం సామరస్యతకు దారులు వేసింది. ఇది అందరి అభినందనలను పొందుతున్నది. అంతేకాదు గణపతి నిమజ్జన ఊరేగింపు జరుగుతున్న దారులలో ముఖ్యంగా హైదరాబాద్‌ పాత నగరంలోని ముస్లిం సోదరులు విఘ్నేశ్వరుని విగ్రహాలతో వున్న భక్తులకు స్వాగతం పలకడం, వారికి మంచినీళ్లు, ఆహారపు పొట్లాలు పంపిణీ చేయడం చూస్తుంటే హైదరాబాద్‌ గంగా జమునా తహజీబ్‌ సంస్కృతి కాపాడుతున్నట్లుగా, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఇంతేకాదు కొన్ని విషయాలను గమనిస్తే ప్రజల్లో ఇప్పటికీ ఎంతో గొప్ప సహనశీలత, సౌభ్రాతృత్వం కనిపిస్తుంది. దానికీ ఈ గణపతి ఉత్సవాలనే తీసుకుంటే, ఆదిలాబాద్‌లో గణపతి మండపం వద్ద వేలం వేసే లడ్డూను ఒక ముస్లిం యువకుడు షేక్‌ ఆసీఫ్‌ లక్షా రెండు వేలకు పాడి దక్కించుకోవటం సాధారణంగా జరిగిపోయింది. అదే విధంగా వరంగల్‌ జిల్లా రంగశాయిపేటలోని యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో కూడా ఎండీ నయిముద్దీన్‌ అనే యువకుడు లడ్డూను పొందటం, ప్రజలు మతాతీతంగా అభిమానాలను చాటుకుంటారనడానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇక హైదరాబాద్‌ బండ్లగూడ రిచ్మండ్‌ విల్లాలోని వినాయకుని లడ్డూను, అక్కడి కమ్యూనిటీ అంతా కలిసి రూ.ఒక కోటీ 26లక్షలకు కొనుగోలు చేశారు. ఆ లడ్డూ కొనుక్కున్న ప్రజల్లో అన్ని మతాలవారు హిందువులు, సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులు వున్నారు. ఆ వచ్చిన డబ్బులతో వారు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిసింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇట్లాంటి ప్రజల మధ్య లేనిపోని ద్వేషాలను పెంచాలని చేస్తున్న ప్రయత్నాలు కొంతకాలనికైనా వమ్ముకాక తప్పదు.
వందల వేల సంవత్సరాలుగా మన దేశంలో అనేక మతాలు,విశ్వాసాలు గల ప్రజలు సహనంగానే జీవనాన్ని కొనసాగిస్తున్నారు.మతపరంగా వచ్చిన తగాదాలన్నీ రాజకీయ ఆధిపత్యవర్గాల వల్లనే అనేది తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా దేవున్ని, ఆలయాలను, భక్తిని స్వార్థ రాజకీయానికి వాడుకునే చర్యలు పెరిగిన తరుణంలో ఇలాంటి సంఘటనలు ఎంతో స్ఫూర్తిని, సామరస్యాలను పెంపొందిస్తాయి.