నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఘనవిజయం సాధించిందనీ, ఇది మోడీ విజయమని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల అంశంతో ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ చేసిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. ఆరునెలల్లోనే రేవంత్ సర్కార్‌పై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. 2014లో ఒక సీటును, 2019లో నాలుగు, ఇప్పుడు ఎనిమిది సీట్లను సాధించామనీ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్‌స్వీప్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 16 సీట్లలో కాంగ్రెస్ దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చుపెట్టిందని విమర్శించారు. అయినా, 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రజలు ఆదరించారన్నారు. 35శాతం ఓటు శాతాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.