– మేం బలపడటం.. ప్రత్యర్థులను బలహీనపర్చటం…
– కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు నక్కకూ నాగ లోకానికి ఉన్నంత తేడా
– ‘కరెంటు’పై కర్నాటక వెళ్లి చూసొద్దామా..? :మీట్ ది ప్రెస్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘యుద్ధం రెండు రకాలుగా ఉంటుంది.. మేం బలపడటం.. ప్రత్యర్థులను బలహీనపర్చటం… ఇదే మా వ్యూహం…’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘మీ ప్రభుత్వం, పార్టీ బలంగా ఉందంటున్నారు.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు బాగా అమలవుతున్నాయని అంటున్నారు… అలాంటప్పుడు ప్రతిపక్షాల నుంచి నేతలను విపరీతంగా ఎందుకు చేర్చుకుంటున్నారు ? వలసలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ?’ అని అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాలనలోనూ, సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలోనూ కాంగ్రెస్‌కు, తమ పార్టీకి నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. కర్నాటక రైతులు తమ కరెంటు కష్టాల గురించి ఇక్కడికొచ్చి చెప్పుకుంటున్న నేపథ్యంలో… వారికి బీఆర్‌ఎస్ డబ్బులిచ్చి తీసుకొస్తోందంటూ కాంగ్రెస్ నేతలు కొట్టిపడేయటాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇద్దరం కలిసి ఒకే బస్సులో కర్నాటకకు పోదాం. అక్కడి జనం దగ్గరకు పోయి.. కరెంటు గురించి అడుగుదాం… మీరు సిద్ధమా…?’ అని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు.
టీఎస్‌యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 55 ఏండ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన ఆ పార్టీ… రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసిందని విమర్శించారు.
దేశానికి స్వాతంత్య్రానంతరం వివిధ సందర్భాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ తొక్కిపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయాల్లో వందలాది మంది యువకులను కాల్చి చంపిందని తెలిపారు. ‘2009లో జగన్ కొత్త పార్టీ పెట్టటంతో ఏపీలో కాంగ్రెస్‌కు దిక్కూ దివాణం లేకుండా పోయింది. అక్కడి నష్టాన్ని కనీసం ఇక్కడైనా పూడ్చుకుందామనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది తప్ప ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు కాదు…’ అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశాన్ని, రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పుర్రెలో ఎప్పుడైనా రైతుబంధు, దళిత బంధు లాంటి పథకాలు, అలాంటి ఆలోచనలు పుట్టాయా..? అని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాము తొమ్మిదన్నరేండ్ల కాలంలో చేసిన అభివృద్ధిని వివరించి, ఆ తర్వాతనే ఓట్లడుగుతున్నామని తెలిపారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఏ ముఖం పెట్టుకుని, ఏం చెప్పి జనం దగ్గర ఓట్లడుగుతాయని నిలదీశారు. పదేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ చేసింది గుండుసున్నా అంటూ ఎద్దేవా చేశారు.
వివిధ పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లింది ఎక్కువ.. అక్కడి నుంచి వచ్చింది మాత్రం చాలా తక్కువని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటనను విలేకరులు ప్రస్తావించగా… ‘గతంలో కాళేశ్వరం మోటార్లు మునిగితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. కానీ ప్రజలపై, ప్రభుత్వంపై ఒక్క పైసా భారం పడకుండా సదరు నిర్మాణ సంస్థే పునరుద్ధరణ చర్యలను చేపట్టింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. రాష్ట్ర ఖజానాపైగానీ, ప్రజలపై గానీ ఒక్క పైసా భారం పడదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే బ్యారెజీని పరిశీలించి వెళ్లింది. చిన్న చిన్న సాంకేతిక లోపాలుంటాయి. అయితే ఆ వివరాలేవీ నాకు తెలియదు. కానీ త్వరలోనే నిర్మాణ సంస్థే పునరుద్ధరణ చర్యలు చేపడుతుంది…’ అని వివరించారు. కార్యక్రమానికి టీఎస్‌యూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి విరాహత్ అలీ అధ్యక్షత వహించగా…ఐజేయూ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.