రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలు పూర్తవుతున్నది. ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల అమలుతో ప్రజల్ని ఆకర్షించింది. అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే పథకాలన్నింటినీ అమలు చేస్తామని నమ్మబలికింది. ఇచ్చిన హామీల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మినహా ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు చేయలేదు. ‘లంకెబిందెలు ఉన్నాయనుకుని వచ్చామని, తీరా చూస్తే ఖాళీ గిన్నెలే ఉన్నాయని’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పడం, ‘వచ్చే రాబడి నెలానెలా వడ్డీలకే సరిపోతోంది’ అని వ్యాఖ్యానించడం చూస్తుంటే ప్రజల్ని కాంగ్రెస్ సర్కార్ ఏమారుస్తుందా? అనే సందేహం కలుగుతోంది. ప్రజల నుంచి అసంతృప్తి రాకముందే వారి దృష్టి మరల్చే ఉద్దేశంలో భాగంగానే ‘హైడ్రా’ను తీసుకొచ్చారనే చర్చ జరుగుతోంది. అప్పుల్లో ఉన్నామంటూనే, వడ్డీల భారం పెరుగుతోందని చెబుతూనే మూసీ సుందరీకరణ పేరుతో రూ.1.50లక్షల కోట్లు అప్పు చేయడం ఎందుకు? మూసీ పక్కన అన్ని అనుమతులు తీసుకుని, రిజిస్ట్రేషన్లు చేసుకుని పేదలు ఇండ్లు నిర్మించు కున్నారు. కూలీనాలీ చేసుకుంటూ దశాబ్దాలుగా జీవిస్తున్నారు. వారి గూడు కూల్చి చేపట్టే సుందరీకరణ ఎవరికోసం? హైదరాబాద్‌లో చెరువులు ఆక్రమణకు గురైన మాట వాస్తవం. వరదల వల్ల నష్టం జరగకుండా సర్కార్ తీసుకునే ముందస్తు చర్యలు కూడా హర్షించదగినవే. కానీ, చెరువులు, కుంటలు, నాలాలపై కట్టడాలను కూల్చేస్తే బాధితులు ఎక్కడికి పోవాలి? వారికి నష్టపరిహారం చెల్లించిన తర్వాత, ప్రజలకు అవగాహన కల్పించి శాస్త్రీయ పద్ధతిలో కూల్చివేతలు చేపట్టాలి. కానీ సర్కార్ చేపట్టిన హైడ్రా దుందుడుకు చర్యలా కనిపిస్తున్నది. రాజకీయ పెద్దలు, బడాబాబులు, సంపన్నులు విలాసాల కోసం నిర్మించుకున్న విల్లాలు, ఫాంహౌస్‌ల్ని కూల్చకుండా పేదల ఇండ్లను కూల్చే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? సర్కార్ ఒంటెద్దు పోకడలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా? అని వాపోతున్నారు. కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పాలన సాగించాలి.ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా పయనించాలి. లేదంటే గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారు.
– అనంతుల మధు, 9505866698