ఇదేం పని బాసూ…?!

What is this job Basu...?!– గోధుమల మార్కెట్‌ ధర ఎంఎస్‌పీ స్థాయికి తగ్గింపు
– వికటించిన కేంద్రం చర్యలు
– అన్నదాతకు 40 వేల కోట్ల నష్టం
– ఇతర పంటలకూ తప్పని ముప్పు
న్యూఢిల్లీ : ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసుేంకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు వికటించాయి. దీని ఫలితంగా దేశంలోని రైతన్నలు రూ.40 వేల కోట్ల మేర నష్టపోయారు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలపై భారత పరిశోధనా మండలి ఈ నెల 14న విడుదల చేసిన నివేదిక ప్రకారం గోధుమలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులను నష్టాలపాలు చేసింది.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో గోధుమ ధరలలో ద్రవ్యోల్బణ రేటు 25.4%గా నమోదైంది. కనీస మద్దతు ధర కంటే మార్కెట్‌ ధర అధికంగా ఉండడంతో ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమైంది. ఎందుకంటే మార్కెట్‌ ధర ఇలాగే కొనసాగితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసేందుకు అవసరమైన గోధుమలను ప్రభుత్వం సేకరించడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ ధరను కనీస మద్దతు ధర స్థాయికి తగ్గించేందుకు ప్రభుత్వం తన వద్ద ఉన్న 3.4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గోధుమలను పంట ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకే తెగనమ్మింది. అంతేకాక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గోధుమ నిల్వలపై పరిమితులు విధించింది. గత పదిహేను సంవత్సరాలలో ప్రభుత్వం ఇలాంటి చర్యకు పూనుకోవడం ఇదే మొదటిసారి.
బహిరంగ మార్కెట్‌లో ధర తగ్గించి...
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల కారణంగా గోధుమ ధరల ద్రవ్యోల్బణం ఆగస్ట్‌ నాటికి 9.33%కి తగ్గినప్పటికీ రైతులపై పరోక్ష భారం పడింది. దీంతో అన్నదాతలు ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రబీ పంటలకు సంబంధించిన 2023-24 మార్కెటింగ్‌ సీజన్‌లో క్వింటాలు గోధుమల కనీస మద్దతు ధరను రూ.2,125గా నిర్ణయించారు. అయితే జనవరిలో మార్కెట్‌ ధర క్వింటాలుకు రూ.2,673గా ఉంది. దేశీయ గోధుమ ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం ఫిబ్రవరిలో బహిరంగ మార్కెట్‌ అమ్మకపు పథకాన్ని (ఓఎంఎస్‌ఎస్‌) ప్రారంభించింది. ముందుగా క్వింటాలు ధరను రూ.2,350గా నిర్ణయించి, ఆ తర్వాత మరింత తగ్గించింది. ఎన్నడూ లేని విధంగా రూ.2,150కే అమ్మింది. ఈ ఓఎంఎస్‌ఎస్‌ ధర సాగు ఖర్చు కంటే చాలా తక్కువ. 2022-23లో క్వింటాలు గోధుమలను ఉత్పత్తి చేయడానికి సగటున రూ.2,654లు ఖర్చయ్యాయి. కేంద్రం జోక్యం చేసుకొని ఉండకపోతే రైతులు తమ గోధుమలను విక్రయించడం ద్వారా క్వింటాలుకు అదనంగా రూ.548 సంపాదించే వారు. అంటే మొత్తంమీద దేశంలోని గోధుమ రైతులు కేంద్ర ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాల కారణంగా రూ.40 వేల కోట్లు నష్టపోయారు.
పట్టణ వినియోగదారుల కోసమే…
ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ ధరలు పెరుగుతున్న సమయంలో అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. అంతర్జాతీయ ధరలతో పాటు దేశీయంగా కూడా గోధుమ ధరలు పెరిగినందున ప్రభుత్వం మరింత అధిక పరిమాణంలో గోధుమలను విక్రయించి ఉండాల్సిందని, తద్వారా రైతులు ప్రయోజనం పొంది ఉండేవారని నివేదిక తెలిపింది. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఉచితంగా గోధుమలు లేదా బియ్యం పొందుతుండగా మార్కెట్‌ విలువను తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలు కాపాడాలని చూస్తోందని ప్రశ్నించింది. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి పట్టణాలలో నివసించే మధ్యతరగతి వినియోగదారులకు మేలు చేకూర్చడమే ప్రభుత్వ ఉద్దేశమని విమర్శించింది.
రైతులందరికీ పొంచివున్న ప్రమాదం
వరి వంటి ఇతర పంటలు పండించే రైతులు కూడా ఇలాంటి ప్రభుత్వ విధానాల కారణంగా నష్టాలు చవిచూస్తారని నివేదిక హెచ్చరించింది. గోధుమల మాదిరిగానే బియ్యం విషయంలో కూడా ప్రభుత్వం మార్కెట్‌ ధరను కనీస మద్దతు ధర స్థాయికి తగ్గించింది. దీనివల్ల రాబోయే ధాన్యం సేకరణ సీజన్‌లో వరి రైతులు నష్టపోయే అవకాశం ఉంది. గోధుమ రైతులతో పోలిస్తే వరి పండించే అన్నదాతలకే మరింత ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. పప్పు ధాన్యాలు, ఉల్లిగడ్డలు పండించే రైతులకు సైతం ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయి.
అనాలోచిత నిర్ణయాలు
2022 సెప్టెంబర్‌లోనూ, తిరిగి ఈ సంవత్సరం జూలైలోనూ బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో భారత వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఇబ్బంది పడ్డాయి. ఎందుకంటే ఆయా దేశాలు మన ఎగుమతుల పైనే అధికంగా ఆధారపడ్డాయి. బియ్యంపై ఎగుమతి సుంకాన్ని విధించి, దానిని క్రమేపీ పెంచడానికి బదులు ప్రభుత్వం జూలైలో బాసుమతి యేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది. దీంతో ఆఫ్రికా దేశాలే కాకుండా అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కూడా ఇబ్బంది పడ్డారు. నిషేధం విధించినప్పటికీ బియ్యానికి సంబంధించి ఆగస్టులో ద్రవ్యోల్బణ రేటు 12.54%గా కొనసాగింది.