బీఆర్‌ఎస్‌ అరాచకాలకు ఇవే చివరి ఎన్నికలు

– వట్టె జానయ్యపై ఒకేరోజు 90 కేసులెలా పెడతారు?
– బేషరతుగా ప్రభుత్వం ఉపసంహరించాలి
– లేదంటే రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం : ఆర్‌ కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ దుర్మార్గాలు, అరాచకాలకు ఇవే చివరి ఎన్నికల్లా ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య, ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. సూర్యాపేటకు చెందిన బీసీ నేత వట్టె జానయ్యపై ఒకేరోజు 90 కేసులెలా? పెడతారంటూ ప్రశ్నించారు. ఆయన వెనకాల 90 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలున్నారని వివరించారు. ఆయనపై అక్రమ కేసులను రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే బీఆర్‌ఎస్‌ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదముంటుందని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వట్టె జానయ్యపై అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి దళితులు, బహుజన బిడ్డలను అణచివేస్తున్నారనీ, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట నియోజకవర్గంలో జగదీశ్‌రెడ్డి తప్ప బీసీ నాయకుడు జానయ్య యాదవ్‌ పోటీ చేయకూడదా?అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చనీ, ప్రజలు ఆశీర్వదిస్తేనే గెలుస్తారని చెప్పారు. ఎన్ని రోజులు బానిసలుగా బతకాలనీ, బీసీలు రాజకీయంగా ఎదగకూడదా?అని నిలదీశారు. రాజ్యాధికారం వచ్చినపుడే పేద కులాలు బాగుపడతాయనీ, వ్యాపారాలు, ఆస్తులు, చదువు, కాంట్రాక్టులు వస్తాయని చెప్పారు. అగ్రకులాల చేతుల్లో రాజ్యాధికారం ఉంటే కొన్ని కులాలే బాగుపడుతున్నాయనీ, తెలంగాణలో రెండు కులాల కుటుంబాల వద్దే రూ.వందల కోట్లు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు. రూ.500 కోట్లకు తగ్గకుండా ఎమ్మెల్యేల ఆస్తులున్నాయని వివరించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వారి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని చెప్పారు. ఇంత అవినీతి జరుగుతున్నా కేంద్రం చూస్తూ ఊరుకుంటున్నదనీ, చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సూర్యాపేట కేంద్రంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలు ఏకమవుతారనీ, ఎన్ని రోజులు అగ్రకులాల పల్లకీలు మోయాలని ప్రశ్నించారు. బహుజన రాజ్యం వస్తే ఒక్కో దళిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వొచ్చని అన్నారు. జానయ్య ఇంత కాలం బీఆర్‌ఎస్‌లో ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదనీ, ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించాక అక్రమ కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాజకీయంగా బీసీలను ఎదగనివ్వకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట నుంచి జానయ్యకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తే జగదీశ్‌రెడ్డి కన్నా ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. యుద్ధభూమిలో చేస్తున్న పోరాటంలో జానయ్యకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఈనెల 11న చలో సూర్యాపేట కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు చెప్పారు. కేసీఆర్‌ వల్లే తెలంగాణ రాలేదనీ, 1,500 మంది ఆత్మబలిదానాలు చేశారనీ, సోనియాగాంధీ ఇచ్చారని అన్నారు. అధికారం ఉందని కేసులు పెడతారా? జానయ్య ఒకేరోజు 90 కేసులు ఎలా పెడతారో డీజీపీని, ఎస్పీని అడుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో జానయ్య సతీమణి రేణుకా యాదవ్‌, ఓయూ జేఏసీ నేత శ్రీకాంత్‌, యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్‌, జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల వెంకటేశం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్‌, బీసీ నేత తుల ఉమ తదితరులు పాల్గొని ప్రసంగించారు.