ఇదేం పద్ధతి ?

– ఎంఈఎంఈపై పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి
– సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచన
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ప్రకారం విద్యార్థులు తమకు ఇష్టం వచ్చిన ఉన్నత విద్యా సంస్థలో ఎప్పుడైనా చేరవచ్చు. అలాగే విద్యా సంవత్సరం మధ్యలోనే సంస్థను వదిలేసి వెళ్లవచ్చు. అంటే ప్రవేశం, నిష్క్రమణలపై (మల్టిపుల్‌ ఎంట్రీ అండ్‌ మల్టిపుల్‌ ఎగ్జిట్‌-ఎంఈఎంఈ) విద్యార్థులే నిర్ణయం తీసుకోవచ్చు. అయితే దీనిపై విద్యార్థులు, అధ్యాపకుల నుండి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సైతం ఈ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంఈఎంఈ పద్ధతిని అమలు చేసే ముందు సంబంధిత వ్యక్తులందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ వివేక్‌ ఠాకూర్‌ నేతృత్వం వహించారు. ఎంఈఎంఈ విధానాన్ని అనుసరిస్తే ఉన్నత విద్యా సంస్థలు అనేక సమస్యలు ఎదుర్కొంటాయని కమిటీ అభిప్రాయపడింది. ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశాలలో కమిటీ తన నివేదికను పార్లమెంట్‌ ముందు ఉంచింది. ఎంఈఎంఈ పద్ధతి పశ్చిమ దేశాలలో విజయవంతం అయినప్పటికీ మన దేశంలో దీనిని అమలు చేయడం కష్టమని కమిటీ అభిప్రాయపడింది. ‘ఈ పద్ధతిని అమలు చేస్తే విద్యా సంవత్సరం మధ్యలో ఎంతమంది విద్యార్థులు చేరతారో, ఎంతమంది వెళ్లిపోతారో అంచనా వేయడం సంస్థలకు కష్టమవుతుంది. వచ్చే వారు, పోయే వారిపై స్పష్టత లేనప్పుడు విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తిపై ప్రభావం పడుతుంది’ అని తెలిపింది. ఈ సమస్యపై విద్యా సంస్థలు సరిగా ఆలోచించడం లేదని, సమస్య ఎదురైనప్పుడు దానిని ఎలా పరిష్కరించాలో వాటికి తెలియదని వ్యాఖ్యానించింది.
ఎంఈఎంఈ విధానంతో విద్యార్థులకు తమకు నచ్చిన సంస్థలో చేరే అవకాశం లభిస్తుందని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. అయితే దీనిపై సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. జాతీయ విద్యా విధానం అమలులో ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకొని, ఆ సవాళ్లను అధిగమించేందుకు ఏం చేయాలో తెలుసుకోవడానికి విద్యా సంస్థలు, వాటి యాజమాన్యాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర విద్యా శాఖను కోరింది. కాగా ఎంఈఎంఈ విధానం విద్యార్థి డిగ్రీ విలువను తగ్గిస్తుందని, ఉద్యోగ మార్కెట్‌కు చౌకగా సిబ్బందిని అందించేందుకు ఇది ఓ మార్గమని విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతి కంటితుడుపు చర్య అని, పాత పద్ధతినే తామంతా కోరుకుంటున్నామని ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిశ్వాస్‌ చెప్పారు.