ఇదేం పద్ధతి

This is the method– బీజేపీని వదిలేసి మాపై గురా?
– కేరళలో కాంగ్రెస్‌ తీరుపై ఏచూరి ఆగ్రహం
తిరువనంతపురం : కేరళలో పరోక్షంగా బీజేపీకి సహకరిస్తూ వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డీఎఫ్‌)ని, ప్రధానంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను వ్యక్తిగత లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శనివారం అలప్పుజలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బీజేపీని ఓడించే ప్రధాన లక్ష్యంతో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) ఇతర ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ‘ఇండియా’ బ్లాక్‌ను ఏర్పాటు చేసిన సంగతిని ఈ సందర్భంగా ఏచూరి గుర్తు చేశారు. అయితే కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) మాత్రం ఎల్‌డీఎఫ్‌ను తన మొదటి టార్గెట్‌గా చేసుకుందని విమర్శించారు. కాషాయ పార్టీని విడిచిపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని, ఇది విస్మయకరమని అన్నారు.
కొత్త కాంగ్రెస్‌గా బీజేపీ
కేరళలో యూడీఎఫ్‌ నుంచి, అలాగే కాంగ్రెస్‌ నుంచి చాలా మంది నాయకులు బీజేపీ పంచన చేరుతున్నారని ఏచూరి అన్నారు. దేశమంతటా ఈ ధోరణి ఉందని, ఇప్పుడు బీజేపీని ‘కొత్త కాంగ్రెస్‌’గా పిలుస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ను ఫిరాయించిన పలువురు నేతలను బీజేపీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపిందని కూడా ఏచూరి పేర్కొన్నారు. ఈ విషయానైనా గమనించి ఇప్పటికైనా కాంగ్రెస్‌ ఆత్మ పరిశీలన చేసుకోవాలని, తన ప్రధాన లక్ష్యాన్ని గుర్తించాలని ఏచూరి హితవు పలికారు. ‘కాంగ్రెస్‌కు కూడా బీజేపీ ప్రధాన లక్ష్యమైతే.. అందరం కలిసి దానిని ఓడిద్దాం. కానీ కాంగ్రెస్‌ ప్రధాన లక్ష్యం ఎల్‌డీఎఫ్‌, కేరళ ముఖ్యమంత్రి అయితే దానివల్ల బీజేపీకి కాంగ్రెస్‌ మేలు చేసినట్లే అవుతుంది. ఇదేనా కాంగ్రెస్‌ చేయాలనుకున్న పోరాటం. ఇది చాలా విస్మయకరం’ అని ఏచూరి తప్పుబట్టారు.
రాహుల్‌కు ఆ విజ్ఞత కూడా లేదు..
పార్లమెంటు నుంచి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని సస్పెండ్‌ చేసినప్పుడు ఆయన సస్పెన్షన్‌ను ఖండించిన మొదటి వ్యక్తి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అని, కనీసం రాహుల్‌కు ఆ విజ్ఞత కూడా లేదా అని ఏచూరి ప్రశ్నించారు. కాంగ్రెస్‌లాగా తాము నీచమైన రాజకీయాల జోలికి వెళ్లబోమని ఆయన చెప్పారు. ‘ఢిల్లీ, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులను అరెస్టు చేసినప్పుడు కేరళ సీఎంను ఎందుకు మినహాయించారని బీజేపీని రాహుల్‌ ప్రశ్నిస్తున్నారు? దీనర్థం ఏమిటి? యూడీఎఫ్‌కు చేవ ఉంటే ఎల్‌డీఎఫ్‌ విధానాలపై సహేతుక విమర్శలు చేయవచ్చు. కానీ ఇదేమిటి? ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి విజయన్‌ కానీ, కేరళ వామపక్ష నాయకులు కానీ మహారాష్ట్ర, జమ్ముకాశ్మీర్‌లో అరెస్టులకు భయపడి బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రులు లాంటి వారు కారని, ప్రజాపక్షాన నిలిచే సైద్ధాంతిక పోరాటశక్తులని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో సీపీఐ(ఎం) నాయకత్వ పాత్ర పోషిస్తోందని, అందువల్ల బీజేపీని వదిలేసి ముఖ్యమంత్రి విజయన్‌ను లక్ష్యంగా ఎంచుకున్న కాంగ్రెస్‌ నేతృత్వ యూడీఎఫ్‌కు ఈ ఎన్నికల్లో పరాభవం తప్పదని అన్నారు. కేరళలో 2004 నాటి ఎన్నికల్లో 20 లోక్‌సభ స్థానాలకు 18 స్థానాలను ఎల్‌డీఎఫ్‌ కైవసం చేసుకుందని, ఈ దఫా అవే ఫలితాలు పునరావృతమవుతాయని ఏచూరి తెలిపారు.
శక్తి తక్కువే..కానీ చిత్తశుద్ధి మెండు
వామపక్షాలు తక్కువ పోటీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి కదా బీజేపీని ఎలా ఎదుర్కొంటారు అన్న ప్రశ్నకు ఏచూరి బదులిస్తూ ‘మేము తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నా.. బీజేపీని ఓడించాలన్న చిత్తశుద్ధి మెండుగా ఉంది’ అని అన్నారు. ‘ సీపీఐ(ఎం) 60 స్థానాల్లో పోటీ చేస్తోంది. వామపక్షాలన్నీ కలిసి 100 లోపు స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపాయి. దేశాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడటంలో మాకు చిత్తశుద్ధి ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా నిలబడిన పార్టీల మధ్య పోటీ తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. ఇది మా రాజకీయ చైతన్యానికి ప్రతీక. తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నామన్న హేళన సరైంది కాదు. మా రాజకీయ పరిపక్వతకు ఇది నిదర్శనం’ అని ఏచూరి పేర్కొన్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో త్రిపురలో భారీగా రిగ్గింగ్‌ జరిగిందని, ఇది ఆందోళనకరమని ఏచూరి తెలిపారు.
ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం
దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రజాస్వామ్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు భారత భవిష్యత్‌కు ఎంతో కీలకమని ఆయన అన్నారు. ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారిపోతుంది. అసహన ఫాసిస్టు హిందూత్వ దేశంగా భారత్‌ మారిపోతుంది. భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా పరిరక్షించాలని కోరుకునే వాళ్లంతా బీజేపీని అధికారంలోకి మళ్లీ రానీయకుండా చూడాలి. ఇందుకోసం ఐక్యంగా కృషి చేసి బీజేపీని, దాని మద్దతుదారులను ఓడించి తీరాలి’ అని ఏచూరి పిలుపునిచ్చారు.