వాన జల్లు కురవాలి వాన దేవుడా మా ఇళ్లు మునగాలి వానదేవుడా అని ఎవడైనా పాడాడో ఏమోకాని గుంపులు గుంపులుగా మబ్బులు ఆకాశం మీదికి ఎగబడి ఒకదానితో ఒకటి కలబడ్డంతో కుండల్తో కాదు ట్యాంకర్లతో ఒకలబోసినట్లు కురవసాగింది వాన. వాన కాదది జడివాన. ఈడ్చి చెంపమీద కొట్టినట్లు పోలీసోడి లాటీ వీపు మీద ఫెళ్లున విరిగినట్లు కురవసాగింది.
సన్నగా పారుతున్న కాలువ చూస్తూ ఉండగానే పొట్ట వుబ్బి ఉరుకులూ పరుగులూ పెట్టింది. ఆ పక్కనే నింపాదిగా కదుల్తున్న పిల్ల కాలువ గాభరా పడి ఎక్కడికి పరుగెత్తుతున్నావు అనడిగింది గట్లు దాటి చెట్లు మింగి పరుగుతీస్తున్న పెద్ద కాలువని. ఎక్కడికో ఎలా తెలుస్తుంది. పై నుంచి మేఘాల గ్యాంగ్ వారి కారణంగా నేలకు చిల్లులు పడుతుంటే వున్నచోట వుండగలమా మనం ఎవరో తోస్తున్నట్లు, దిక్కు తెలీకుండా పారాల్సిందే. నువ్వూరా నాతో కల్సి పరుగెత్తు. ఎక్కడికో ఓ అక్కడికి పోవాల్సిందే అని పెద్ద కాలువ అంటుండగానే పిల్ల కాలువతో పాటు మరికొన్ని పెద్ద కాలువతో కల్సి ‘మారథాన్’ సాగించేయి. అప్పట్నించీ లేదు ఈ కంపువాసన ఎక్కడ్నించి వస్తున్నదో అంది పెద్ద కాలువ. డ్రైనేజీ మూతలు తెర్చుకుని బయటికి వస్తున్న నీళ్ల వాసన అనుకుంటాను అంది పిల్ల కాలువ.
అంతే అంతే! ముక్కులు పగిలే వాసన వస్తున్నదంటే మనం చాలా దూరం వచ్చేశామన్న మాట. చెట్లూ పుట్టలూ దాటి మేడలూ, మిద్దెలూ, కార్లూ, బస్సులూ రోడ్లంట తిరిగే సిటీలోకి వచ్చేశామన్న మాట. అవును పెద్ద పెద్ద ఇళ్లూ మనని తొక్కుతూ పోతున్న వాహనాలు ఇదే కదా సిటీ అంటే ఎన్నాళ్లకి చూశాను అంది పిల్లకాలువ.
ఇది మామూలు నగరం కాదు. విశ్వనగరం. హైటెక్ సిటీ అంటారు. చూడు చూడు బారులు తీరిన కార్లు చూడు. వాటిల్లో వున్న వాళ్లు రేపటికి కాని కొంపలకు చేరుకోరు.
అసలు ఎందరు చేరుకుంటారో ఎందరీలోకం నుంచి జారుకుంటారో! వీడెవడో బైకు బోర్లా పడింది. అయ్యయ్యో డ్రైనేజీ నీళ్లు మింగుతూ కొట్టుకు పోతున్నాడు అంది పిల్లకాలువ. ఆ బ్రిడ్జి కింద చూడు పిల్లలు నీటిలో వదిలేసిన కాగితపు పడవల్లా కార్లు మునుగుతూ తేలుతూ పోతున్నాయి అంది పెద్ద కాలువ. నీ వెంట పడి వస్తున్నాను ఎక్కడికి తీసుకువెళ్తున్నావ? ఇక్కడ రోడ్లు లేనట్టున్నవి. రాళ్లూ రప్పలూ తగుల్తున్నాయి. చిరిగిన బట్టలు గోనె పట్టాలు చుట్టుకుంటున్నాయి. ఈ ఇళ్లలోకి దారి తీశావేం అయ్యయ్యో వీళ్ల వస్తువులన్నీ మునిగి పోతున్నవి అంది పిల్లకాలువ.
ఇదంతా ఒకప్పుడు చెరువు. ఆ చెరువును నిలువునా చంపి లారీల మట్టితో పాతరేశారు. దానిమీద కట్టారు ఈ ఇళ్లు. మన నీళ్ల జాగా కనుక మనం వస్తాం. ఇంట్లో సామాన్లు బయటపడేస్తాం. ఖాళీ చేయిస్తాం. ప్రతి వర్షాకాలం ఇలాగే వస్తుంటాం. మనల్ని ఆపే దమ్మెరికుంది. ఓట్లు రాలే పథకాలకు ఖర్చు పెడ్తారు కానీ మనుషుల్ని ఇళ్లనీ మింగేసే మనల్ని ఆపరు. ప్రజల్ని ఆదుకోరు. మనవాళ్లు అన్నివైపుల నుంచీ వేగంగా వస్తున్నారు. గుడిసెలు, ఇళ్లు కొట్టుకుపోతయి. ఆయువు తీరిన వాళ్ల లెక్క దినపత్రికలు, టీవీలు తేలుస్తాయి. పరుగెత్తు కళ్లు మూసుకుని. చావు కేకలు వినపడకుండా హోరుమను అంది పెద్ద కాలువ. ఎవరో నన్ను తోకతో బాదుతున్నారు అంది పిల్ల కాలువ. ఎవర్రా అది అని కేకేసింది పెద్ద కాలువ. నేను… నేనే క్రోకడైల్‌ని అంది ముసలి నోరు బార్లా తెరిచి. తెలుగు నేల మీద సారీ నీళ్లల్లో తెలుగు ఏడవరాదూ అంది పెద్ద కాలువ. నన్ను తెలుగులో మొసలి అంటారు. మా పూర్వీకుడు ఒకడు ఏనుగుని కాలు పట్టుకుని నీళ్లలోకి లాగాడు తెలుసా అంది ముసలి. ఓహో ఆ జాతి వాడివా! ఏ ఏట్లోనో పడుండక ఈ సిటీకి వచ్చావేం?
నేను వచ్చానా? మీ వాళ్లే లాక్కువచ్చారు. రోడ్డున పడ్డ మొసలినయ్యాను. ఈ నీళ్లు ఆవిరైతే నా గతేమిటి అంది మొసలి దిగులుగా. ఇక్కడ వున్న మీ వాళ్లతో కల్సి జల్సా చేయి అంది కాలువ. మా వాళ్లా? ఈ ఊళ్లో! నిజంగా అంది ముసలి కంటి నుంచి నీరు కారుస్తూ. ఇదేనన్న మాట మొసలి కన్నీరు. నీలాగానే పేదల పట్ల, బడుగు బలహీనవర్గాల ఓటర్ల పట్ల జాలిగా కన్నీరు కార్చేవారున్నారిక్కడ. దూరంగా కనపడుతుందే ఆ తెల్లటి పెద్ద భవంతి ఈ మధ్యే కట్టారు దాన్ని. అక్కడ కొందరు ప్రతి వానాకాలమూ నీలాగే మొసలి కన్నీరు కారుస్తారు. వాళ్ల కొంపలు కూలేవి కావు. వరదనీళ్లమైన మేం వాళ్లని మింగలేం అంది కాలువ. నాలాగ కన్నీరు కార్చే మనుషుల్ని చూడాల్సిందే అంటూ నీళ్లలో తేలుతున్న నూతన భవనం వైపు ఈదింది మొసలి.
మురుగు కాలవలన్నీ కల్సి చెరువుగా మారి సిటీ అంతటా విస్తరించిన ‘నాలా’ను మరో వర్షాకాలం వచ్చేలోపు శుభ్రం చేసి న్యూయార్కు నగరం సిగ్గుపడేలా చేస్తామని ఉత్తర కుమారుడొకడు పాత ప్రగల్భాలే రిపీట్ చేస్తున్నాడు. మీడియా వాళ్లు ప్రతియేటా వినే పాటనే మళ్లీ ఆసక్తిగా వింటున్నారు. చెప్పేవాడు చెప్తూనే వుంటాడు. వినేవాడు వింటూనే వుంటాడు. కానీ అడిగే వాడెవడూ లేడు కదా!
– చింతపట్ల సుదర్శన్
9299809212