ఇదీ బంధానికి బలమే..!

ఇదీ బంధానికి బలమే..!పెండ్లి ఓ భద్రతగా సమాజంలో భావిస్తున్నాం. ఎందుకంటే అది అందరి ఆమోదం, భాగస్వాముల మధ్య స్థిరత్వం, హక్కు, బాధ్యతలను ఏర్పరిచే ఓ చట్ట బద్దమైన ఒప్పందం కాబట్టి. అయితే ఈ మధ్య కాలంలో కొందరు పెండ్లికన్నా లివ్‌-ఇన్‌-రిలేషన్‌షిప్‌కు ఆసక్తి చూపుతున్నారు. కానీ కొంత మంది యువత ఈ సహజీవనాన్ని కేవలం వారి క్షణికమైన కోర్కెలు తీర్చుకు నేందుకు కూడా ఉపయోగిం చుకుంటారు. దాన్ని వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి సమస్యతోనే గీత ఐద్వా అదాలత్‌కు వచ్చింది. ఇంతకీ ఆమె సమస్యకు పరిష్కారం దొరికిందో లేదో మీరే చదవండీ…
గీతకు సుమారు 32 ఏండ్లు ఉంటాయి. మంచి ఉద్యోగం, ఉన్నతమైన కుటుంబం. ఇంట్లో వాళ్లు ఆమెకు పెండ్లి సంబంధాలు చూస్తుంటే ఆమె మాత్రం ‘నాకు పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదు కొన్ని రోజులు లివ్‌ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉండి తర్వాత పెండ్లి చేసుకోవాలా? లేదా? అనేది నిర్ణయించుకుంటాను. ఈ విషయంలో నన్ను బలవంతం పెట్టొద్దు’ అంటూ కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకుంది.
పెద్దలు పెండ్లి చేస్తాం అంటున్నా వినకుండా పదేండ్ల నుండి తను ప్రేమిస్తున్న అశ్విన్‌తో కలిసి జీవితం ప్రారంభించింది. వారు అలా ఉండటం ఇరు కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. చెప్తే వినేవాళ్లు కాదు. అందుకే చూస్తూ ఊరుకున్నారు. అయితే ఇద్దరూ సహజీవనం ప్రారంభించడానికి ముందు ఓ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఏమిటంటే ఎవరు ఎప్పుడైనా రావొచ్చు, పోవచ్చు. ఎవరికి నచ్చినట్టుగా వారు ఉండొచ్చు, మాట్లాడొచ్చు. ఎవరు ఎవరినైనా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇంకొకరు నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? అని అడగటానికి వీల్లేదు. ఇద్దరిలో ఎవరికైనా వేరే వ్యక్తి నచ్చితే వారితో వెళ్ళిపోవచ్చు. ఇంకొకరి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చాలా కండీషన్స్‌ రాసుకున్నారు.
ఇలా ఆరు నెలలు గడిచిపోయింది. ఆశ్విన్‌లో చాలా మార్పు వచ్చింది. తన స్నేహితులను తీసుకొచ్చి ఇంట్లోనే తాగేవాడు. అంతే కాదు వేరే అమ్మాయిలను కూడా ఇంటికి తీసుకురావడం మొదలుపెట్టాడు. గీత ఇదేంటని అడిగితే ‘ఎవరికి నచ్చినట్టు వారు ఉండాలి అనుకున్నాం కదా! ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నావు, మన అగ్రిమెంట్‌ ప్రకారం నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. ఇదంతా నచ్చకపోతే నువ్వే ఇక్కడి నుండి వెళ్ళిపో’ అనేవాడు. ‘నువ్వు స్నేహితులను ఇంటికి తీసుకొస్తే నేను తీసుకురాలేనా’ అంటూ గీత కూడా తన స్నేహితులను ఇంటికి పిలవడం మొదలుపెట్టింది. ఇలాగైనా అశ్విన్‌ తన మాట వింటాడనుకుంది. కానీ దీనికి పూర్తి విరుద్దంగా జరిగింది. గీత స్నేహితురాలు రూప ఇప్పుడు అశ్విన్‌కు దగ్గరయింది. వాళ్ళిద్దరూ కలిసి వేరే ఇల్లు తీసుకొని ఉంటున్నారు. అయితే గీతకు ఇప్పుడు మూడో నెల. అశ్విన్‌ తనను వదిలి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల వద్దకు ఎలా వెళ్ళాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఏమీ తోచని స్థితిలో ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
మేము ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడాము. గీత తల్లిదండ్రులు ‘మేము ఎంత చెప్పినా వినకుండా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చింది. ఈ రోజుల్లోనూ చాలామంది ప్రేమ వివాహం అంటేనే ఒప్పుకోవడంలేదు. కానీ గీత ప్రేమను అంగీకరించి ఆశ్విన్‌తో పెండ్లి చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్లు మాత్రం ‘కొంతకాలం కలిసి ఉంటాం. ఆ తర్వాత ఇష్టముంటే పెండ్లి చేసుకుంటాం’ అన్నారు. కలిసిన ఆరు నెలల్లోనే ఇలా జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చేసుకోమనండి. మేము ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగానే ఆలోచిస్తుంది గీత. సహాయం కోసం మీ దగ్గరకు వచ్చింది. మాకు మీ సంస్థపై నమ్మకం ఉంది. కాబట్టి మీరే తనకు దారి చూపించండి’ అన్నారు.
అశ్విన్‌ తల్లిదండ్రులు ‘మా వాడికి స్థిరత్వం లేదు. పదేండ్లుగా గీతను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని హాయిగా ఉంటారు అనుకున్నాం. కొన్ని రోజులు కలిసున్న తర్వాత పెండ్లి చేసుకుంటారనే అనుకున్నాం. కానీ ఈ అగ్రిమెంట్లు ఏంటో? అసలు స్వేచ్ఛ అంటే ఏంటో వీళ్ళకు అర్థం కావడం లేదు. అందుకే ఆరు నెలల్లోనే ఈ పరిస్థితి వచ్చింది. అశ్విన్‌ గురించి గీతకు పూర్తిగా తెలుసు. ఈ ఆరు నెలల్లో ఇంకా బాగా తెలుసుకొని ఉంటుంది. కాబట్టి ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే. కలిసి ఉండాలా, విడిపోవాలా అనేది వారి ఇష్టం. ఆమె అశ్విన్‌ను పెండ్లి చేసుకొని ఇంటికి వస్తే మాత్రం బాగా చూసుకుంటాం’ అన్నారు.
ఇక అశ్విన్‌తో మాట్లాడితే ‘మేము ముందే అగ్రిమెంట్‌ రాసుకున్నాం. దాని ప్రకారమే నేను నాకు నచ్చినట్టు ఉంటున్నాను. మేము రిలేషన్‌లో ఉన్నప్పటి నుండి గీత ప్రతి దానికి నన్ను అడ్డుకుం టుంది. ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేస్తున్నావు అంటూ ప్రతిదీ ఆరాలు తీస్తుంది. అయినా నేను ఇప్పుడు గీతతో ఉండడం లేదు. అమె స్నేహితురాలితో కలిసి ఉంటున్నాను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ఇలా వదిలేయండి, ఇబ్బంది పెట్టకండి’ అన్నాడు.
మరి అగ్రిమెంట్‌లో పిల్లల గురించి ఏమీ రాసుకోలేదేంటి. తిరగడం, తాగడం, శారీరక సంబం ధాలు పెట్టుకోవడం ఇలాంటి విషయాలైతే చక్కగా రాసుకున్నారు. కానీ గీత నిన్ను నిజంగా ప్రేమిస్తుం ది. అందుకే నీతో తల్లి కావడానికి సిద్ధపడింది. నీతో జీవితాంతం ఉండాలను కుంటుంది. కాబట్టే నువ్వు ఇంకొకరితో మాట్లాడు తుంటే భరించలేకపోతుంది. ఇప్పుడు నీకు నీ బేబీ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా?’ అని అడిగాము.
‘పెండ్లి, బాధ్యత అంటే నేను భరించలేను. అందుకే లివింగ్‌ రిలేషన్‌షిప్‌కు ఓకే అన్నాను. ఆ బాధ్యతలను తట్టుకోలేకే ఇప్పుడు రూపతో ఉంటున్నా. ఆమెను ఎలా వదిలి పెట్టి రావాలి. నాకు ఆలోచించుకోడానికి కాస్త సమయం కావాలి’ అన్నాడు. ఇద్దరూ కలిసి మా దగ్గరకు ఐదారు వారాలు వచ్చారు. కొన్ని రోజులు కౌన్సెలింగ్‌ తర్వాత అశ్విన్‌, గీతను పెండ్లి చేసుకోడానికి ఒప్పుకున్నాడు. రూపకు వేరే అబ్బాయితో పెండ్లి కుదిరింది.
సహజీవనం అనేది ఇద్దరూ అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి సంబంధాలు కూడా బంధాలకు బలాన్నిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కలిసి జీవించాలి అనే ధైర్యాన్నిస్తాయి. అంతే కాని నీ కోర్కెలు తీర్చుకోడం కోసం సహజీవనాన్ని వాడుకుంటే నడవదు. ఏ రిలేషన్‌లోనైనా బాధ్యలు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఇవే మీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. బాధ్యతలను ఎప్పుడూ భారంగా అనుకోకూడదు. తాత్కాలిక సంతోషానికి అలవాటు పడితే రేపు నీకంటూ ఎవ్వరూ మిగలరు. కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉన్నప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది అని అశ్విన్‌కు నచ్చజెప్పి ఇద్దరికీ పెండ్లి చేశాము.
– వై వరలక్ష్మి, 9948794051