ఇదేందయ్యా ఇది.. గర్భవతిని ట్రాక్టర్‌లో ఆస్పత్రికి తరలింపు..

నవతెలంగాణ -తాడ్వాయి
నిండు గర్భిణికి ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడం తప్పనిసరి. లేదంటే తల్లి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాగా ములుగు జిల్లాలో మారుమూల గ్రామాల్లో నివసించే చాలామంది తల్లులు రహదారులు (రోడ్లు) లేక అంబులెన్స్ సేవలు అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగూ ఎన్నో సంవత్సరాల నుండి పొలిటిషన్లు, అధికారులు ఏజెన్సీ గ్రామాల రోడ్ల గురించి శ్రద్ధ తీసుకోరు.  ఆ విషయం పక్కన పెడితే తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బంధాల ఏజెన్సీ గ్రామపంచాయతీ పరిధిలోగల బొల్లెపల్లి ఆదివాసి గ్రామంలో మల్లెల ఈశ్వరి అనే ఆదివాసి మహిళ నిండు గర్భిణి ఆసుపత్రికి పోవడానికి రోడ్డు రవాణా సరిగా లేక అంబులెన్స్ సేవలు లభించక చాలా ఇబ్బందులు పడింది. సుమారు 30 కిలోమీటర్లు పస్రా వరకు ట్రాక్టర్ ద్వారా వెళ్ళింది. ఆమె పురిటి నొప్పులతో ఆమె బాధ వర్ణాతీతం. అభివృద్ధి గురించి చెబుతున్న నాయకులు బంధాల ఏజెన్సీలో అంబులెన్స్ సౌకర్యం లేక చిన్న పిల్లలు ముసలివారు గర్భిణీలు పిల్ల తల్లులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్ సర్వీస్ గ్రామాలు ఇప్పటికీ ఉన్న అభివృద్ధి ఏం జరిగిందో వారి అంతరాత్మకు తెలవాలని గ్రామస్తులు అంటున్నారు. బంధాల గ్రామపంచాయతీ పరిధిలోగల బొల్లెపల్లి, బంధాల, నర్సాపూర్ (పిఎల్), అల్లిగూడెం, పోచాపూర్ అన్ని గ్రామాల రోడ్ల పరిస్థితి దారుణం. ప్రభుత్వం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి రోడ్ల నిర్మాణానికి గాను కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం, ఫారెస్ట్ అధికారుల పెత్తనం వలన ఆదివాసి ఏజెన్సీ గ్రామాల ప్రజలు అభివృద్ధికి నోచుకోక, చావు బతుకుల్లో మగ్గుతున్నారని ఆదివాసి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇటువంటి సంఘటనలు మండలంలోని బంధాల ఏజెన్సీ గ్రామాల్లో కోకోళ్ళలు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం బంధాల గ్రామపంచాయతీ ఆదివాసీల రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదివాసి ప్రజలు కోరుకుంటున్నారు.